కీర్తనలు త్యాగరాజు శరణు శరణనుచు మొరలిడిన, నాగిరములన్ని పరియాచకమౌనా
మధ్యమావతి - ఆది
పల్లవి:
శరణు శరణనుచు మొరలిడిన, నా
గిరములన్ని పరియాచకమౌనా? ॥శరణు॥
అను పల్లవి:
శరజనయన! పరమపురుష! నిన్నను
సరణతో గరుణతో మఱిమఱి ॥శరణు॥
చరణము(లు):
శరము తరుమ తరము గాక కాకా
సురుఁడు సురుల నరయ వేడగాను ద
శరథవర కుమారుని బాణమనుచును
వెఱచి జరగ మరల తాను గని గా
బరబడి సరగున శరణను మాత్రము
నిరవుగను రజతగిరి నాథాదులు
వరమగు బిరుదున సరసత మెచ్చను
కరుణను స్థిరముగ వరమిచ్చిన నిను ॥శరణు॥
మునుపు మనసున నసూయలను తపో
ధనుఁడు వినయమునను ద్రౌపదిని శో
ధనము ఘనముగ నిజమున సేయ దృఢ
మునను తన మదిని శరణనగానే
కనికరము వేగన నీ వెంతో చను
వున మునులు సుజనులు సురాసుర
గణము లవనిపాల నరులు బొగడను
వనజనయన! లఘువున బ్రోచిన నిను ॥శరణు॥
మదిని బెదరు సుదతిని గని నీదు
పదములు దయను ధరలోను బ్రోచె
గదర? మదజనదళ నాపఘన! జిత
మదన! బుధజన ధన! త్యాగరాజ
హృదయకుముద జలజధర సంహరణా!
రిదమన! దమలరదన! ముని మనో
సదన! శుభద! నను ముదమున బ్రోవుము
సదయుఁడ! కొదవల నదలింపుము, నిను ॥శరణు॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - sharaNu sharaNanuchu moraliDina, naagiramulanni pariyaachakamaunaa ( telugu andhra )