కీర్తనలు త్యాగరాజు శ్రీ తులశమ్మ మాయింట నెలకొనవమ్మ
దేవగాంధారి - ఆది
పల్లవి:
శ్రీ తులశమ్మ మాయింట నెలకొనవమ్మ శ్రీ..
అను పల్లవి:
ఈ మహిని నీ సమానమెవరమ్మ బంగారుబొమ్మ శ్రీ..
చరణము(లు):
కఱకు సువర్ణపు సొమ్ములుబెట్టి
సరిగచీర ముద్దుగురియఁగఁ గట్టి
కరుణఁజూచి సిరులను ఒడిగట్టి
వరదునిఁ గరమునను బట్టి శ్రీ..
ఉరమున ముత్యపు సరులసియాడ
సురతరుణులు నిన్నుఁ గని కొనియాడ
వరమునులష్టదిగీశులు వేడ
వరదుఁడు నినుఁ బ్రేమఁ జూడ శ్రీ..
మరువక పారిజాత సరోజ
కురువక వకుళ సుగంధరాజ
వరసుమములచే త్యాగరాజ
వరద నినుఁ బూజసేతు శ్రీ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - shrii tulashamma maayiMTa nelakonavamma ( telugu andhra )