కీర్తనలు త్యాగరాజు శ్రీరామ రామ రామ శ్రీమానసాబ్ధి సోమ
గోపికా వసంత - ఆది (నీలాంబరి - జంప)
పల్లవి:
శ్రీరామ రామ రామ శ్రీమానసాబ్ధి సోమ
నారాయణాప్తకామా నళినాక్ష పవ్వళించు శ్రీ..
అను పల్లవి:
పల్లవాధర వరేణ్య పాపేభసింహధన్య
మల్లికాతల్పమందు మాధవ పవ్వళించు శ్రీ..
చరణము(లు):
ధారాధరాభదేహ తారాధిపానన సదా
నీరాక కోరియుంటి శ్రీరామ పవ్వళించు శ్రీ..
జనకరాజింట బుట్టి జానకి జెట్టబట్టి
కనకమౌ సురటిబట్టి గాచినది పవ్వళించు శ్రీ..
వర్ణింపతరముగాని స్వర్ణంపు మేని సీత
పూర్ణమౌ భక్తితోను బూజించు పవ్వళించు శ్రీ..
ఆశుగాశన సుశయన అంభోజపత్రనయన
ఆశతో త్యాగరాజు అర్చించు పవ్వళించు శ్రీ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - shriiraama raama raama shriimaanasaabdhi sooma ( telugu andhra )