కీర్తనలు త్యాగరాజు సంసారులైతే నేమయ్య, శిఖిపింఛావతంసు డెదుట నుండగ
సావేరి - ఆది
పల్లవి:
సంసారులైతే నేమయ్య, శిఖిపింఛావతంసు డెదుట నుండగ ॥సంసారు॥
అను పల్లవి:
హింసాదులెల్ల రోసి హంసాదులఁ గూడి ప్ర
శంస జేయుచు నే ప్రొద్దు కంసారిని నమ్మువాడు ॥సంసారు॥
చరణము(లు):
జ్ఞాన వైరాగ్యములు హీనమైనట్టి భవ
కానమునఁ దిరుగు మానవుఁడు సదా
ధ్యానయోగయుతుఁడై నీ నామము బల్కుచు
నానా కర్మఫలము దానము జేయువారు ॥సంసారు॥
క్రూరపు యోచనలు దూరుజేసి తన
దారపుత్రులఁ బరిచారకుల జేసి
సారరూపుని పాదసారస యుగముల
సారె సారెకు మనసార పూజించువారు ॥సంసారు॥
భాగవతులఁ గూడి భోగములెల్ల హరి
కే గావింపుచు వీణాగానములతో
నాగమచరుని శ్రీరాగమున బాడుచు
త్యాగరాజనుతుని బాగుగ నమ్మువారు ॥సంసారు॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - saMsaarulaitee neemayya, shikhipiMchhaavataMsu DeduTa nuMDaga ( telugu andhra )