కీర్తనలు త్యాగరాజు సమయముఁ దెలిసి పుణ్యము లార్జించని
అసావేరి - చాపు
పల్లవి:
సమయముఁ దెలిసి పుణ్యము లార్జించని
కుమతియుండి యేమి పొయ్యేమి స..
అను పల్లవి:
శమతతోడి ధర్మము జయమేగాని
క్రమముతో మనవిని వినవే ఓ మనసా స..
చరణము(లు):
సారమౌ కవితల విని వెర్రివాఁడు
సంతోషపడి యేమి పడకేమి
చేరెడేసి గుడ్డికన్నులు బాగ
తెఱచి యేమి తెఱవకున్న నేమి స..
తురక వీథిలో విప్రునికి పానకపూజ
నెరయఁజేసి యేమి సేయకుంటె నేమి
ధరనీని ధనకోట్లకు యజమానుఁడు
దయ్యమైతే నేమి లోభైతే నేమి స..
పదము త్యాగరాజనుతునిపై గానిది
పాడియేమి పాడకుంటె నేమి
ఎదను శ్రీరామభక్తియులేని నరజన్మ
మెత్తియేమి ఎత్తకుంటే నేమి స..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - samayamu.r delisi puNyamu laarjiMchani ( telugu andhra )