కీర్తనలు త్యాగరాజు సారమేగాని యన్యమార్గవిచార మేటికే ఓ మనసా
పంతువరాళి - చాపు
పల్లవి:
సారమేగాని యన్యమార్గ వి
చార మేటికే ఓ మనసా ॥సారమేగాని॥
అను పల్లవి:
వారు వీరుఁ దెలియ లేక బల్కెడు
వార్తలు విననేలే రామ నామము ॥సారమేగాని॥
చరణము(లు):
మారకోటి లావణ్యుఁడైన రఘు
వీరుని నామ సుధారసమునను
సారెకుఁ బానముఁ జేసి జగద్వి
హారుఁడై వెలసెడు నారాయణ
నారాయణ యనుచును వారము
శరదంబుద నిభుఁడౌ శ్రీ
నారదముని వల్మీక జాతునికిఁ
గూరిమి నుపదేశించ లేదా ॥సారమేగాని॥
పరమపావనుని శరణాగత జన
పరిపాలన బిరుదాంకుని సీతా
వరుని నామ సుధారస పానము
నిరతమునను జేసి హరి హరి
హరి యనుచు సంతతంబును
సరియు లేని కీర్తి గాంచి దేహము
పరవశంబు జెంది శుకబ్రహ్మ
పరీక్షిత్తు కొసగలేదా వారా ॥సారమేగాని॥
సామగాన లోలుఁడౌ రజితగిరి
ధాముఁడైన త్యాగరాజ శివుఁ డతి
నేమముతో నామామృతము పానము
యేమరకను జేసి రామ రామ
రామ యనుచును సతతము
శ్రీమదాది గౌరికి శృంగారికి
నా మహిమల నా రహస్యముల నతి
ప్రేమను నుపదేశింప లేదా ॥సారమేగాని॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - saarameegaani yanyamaargavichaara meeTikee oo manasaa ( telugu andhra )