కీర్తనలు త్యాగరాజు సుందరి నీదివ్యరూపమును
కల్యాణి - ఆది
పల్లవి:
సుందరి నీదివ్యరూపమును
జూఁడ దనకు దొరికెనమ్మ సుం..
అను పల్లవి:
మందగమన నీ కటాక్షబలమో
ముందటి పూజాఫలమో త్రిపుర సుం..
చరణము(లు):
భువిలో వరమౌ శ్రీమదాది
పురమున నెలకొన్న నీ సొగసువిని
సువివేకులైన బ్రహ్మాది
సురలు గుంపుగూడి
కవివాసరపు సేవ కనుంగొన
కలుగునా యనికరఁగుచు మదిలో
దివి దత్తరము పడుచు నుండఁగా
దీనజనార్తి హారిణి త్రిపుర సుం..
కలిలో దీనరక్షకి యని సభ
కలిగిన తావునఁ బొగడుదునమ్మా
సలలితగుణకరుణాసాగరి నీ
సాటి యెవరమ్మా
అలసివచ్చినందుకు నామనసు
హాయి చెందునా యని యుండఁగ మఱి
కలకలమని సురసతులు వరుసగాఁ
గొలుచు శుక్రవారపు ముద్దు త్రిపుర సుం..
నన్నుఁ గన్నతల్లి నా జన్మము
నాఁడు సఫలమాయెనమ్మా ఇపుడు
ఘనదరిద్రునికి పైకమువలెఁ గనుల పండువుగా
వనజనయన ఎండుపైరులపై జలము
వలె శుభదాయకి కామ
జనకుని సోదరి శ్రీ త్యాగరాజ మనోహరి గౌరి సుం..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - suMdari niidivyaruupamunu ( telugu andhra )