కవితలు ఆంధ్రావళి - ప్రబోధము - రాయప్రోలు తమ్ముడా
6. తమ్ముడా
శ్రీలు పొంగిన జీవ గడ్డయి,
పాలుపాఱిన భాగ్యసీమయి,
వ్రాలినది ఈ భరతఖండము
భక్తిపాడర తమ్ముడా!
వేదశాఖలు పెరిగె నిచ్చట,
ఆది కావ్యం బందె నిచ్చట,
బాదరాయణ పరమఋషులకు
పాదు సుమ్మిది చెల్లెలా!
విపినబంధుర వృక్షవాటిక
ఉపనిషన్మధు వొలికె నిచ్చట
విపులతత్త్వము విస్తరించిన
విమలతల మిదె తమ్ముడా!
సూత్రయుగముల శుద్ధవాసన,
క్షాత్రయుగముల శౌర్యచండిమ,
చిత్రదాస్యముచే చరిత్రల
చెఱిగిపోయెనె చెల్లెలా!
మేలికిన్నెర మేళవించీ
రాలు కరగగ రాగ మెత్తీ
పాలతీయని బాలభారత
పదము పాడర తమ్ముడా!
నవరసమ్ములు నాట్యమాడగ
చివురుపలుకులు చెవులవిందుగ
కవిత లల్లిన కాంతహృదయుల
గారవింపవె చెల్లెలా!
దేశ గర్వము దీప్తి చెందగ
దేశ చరితము తేజరిల్లగ
దేశమరసిన ధీరపురుషుల
తెలిసి పాడర తమ్ముడా!
పాండవేయుల పదును కత్తులు
మండి మెరసిన మహిత రణకథ
కండ గల చిక్కని తెనుంగుల
కలిసి పాడవె చెల్లెలా!
లోకమంతకు కాక పెట్టిన
కాకతీయుల కదనపాండితి
చీకిపోవని చేవపదముల
చేర్చి పాడర తమ్ముడా!
తుంగభద్రా భంగములతో
పొంగి నింగిని పొడిచి త్రుళ్లీ
భంగపడని తెనుంగు నాథుల
పాట పాడవె చెల్లెలా!
AndhraBharati AMdhra bhArati - kavitalu - AMdhrAvaLi prabOdhamu - tammuDaa ( telugu andhra )