కవితలు ఆంధ్రప్రశస్తి:
విశ్వనాథ సత్యనారాయణ
యమదంష్ట్రిక

12. యమదంష్ట్రిక

అళియరామరాయలు మహావీరశిఖామణి. రాజకీయ కోవిదుడు. కళ్యాణిదుర్గ మొక సారి అతడు ముట్టడించినపుడు జరిగిన సంగతులు ఈ కావ్యమున వ్రాయబడినవి. సదాశివ నాయకునిది కేళాదిపురము. ఆ వంశమువారు విజయనగర సామ్రాజ్యమునకు కుడిభుజము వంటివారు. ఇందు రామరాయల యుత్సాహశక్తి ప్రభుమంత్రశక్తుల కెట్లు మీఱిపోయినదో తెలియఁగలదు. అన్నిటికన్న చిత్ర మహా మహావీరుని కాలమున తల్లికోటలో తెలుఁగు లోడిపోవుట.

నెలనాళ్ళయినది కోటపట్టుపడలేనేలేదు కళ్యాణి, రా
యలకున్‌ సిగ్గయిపోయెఁబో తెలుఁగుసైన్యంబుల్‌ వృధాక్రోధవ
హ్నులతోమండెడునాఱెడున్‌ బతియుమంత్రుల్‌ దండనాధుల్‌ విని
శ్చలదీప్తాస్యులు పాలువోక సభలో సారింత్రు రక్తాక్షముల్‌.
కృత్స్నాకాశపుపాలవెల్లి యొడిలోఁ గ్రీడించె శుక్లాష్టమీ
జ్యోత్స్నాకారికుమారిచంద్రముఁడుదిగ్వ్యూహంబులన్‌ హాసదీ
వ్యత్స్నాతంబులుగాఁ బొనర్చిన నృపీఠాగ్రస్థ చంద్రోపలో
ద్యత్స్నేహంబు వెలార్చు ఱేని యొడలంతన్‌ జల్లనై పొల్చినన్‌.
చూచినచూపుత్రిప్పకయ చూచుచు గద్దియ నుండి మెల్లఁగా
లేచి మదద్విపప్రణుతలీల నరేంద్రుఁడుపోవఁజొచ్చె నా
త్మోచితవృత్తి సైన్యపతు లొక్కరునొక్కరురాజుపార్శ్వభూ
మీచరు లౌచు మెల్లన గమించిరి తన్ముఖలగ్నదృష్టులై.
నిసి యని కోటముట్టడిని నిల్పఁగలేదు తెలుంగు సైనికుల్‌
ముసరుచుఁబోయి యే బురుజుమూలకొ నిచ్చెనలెత్త, లోనివా
రు శిలల మొత్త, నచ్చటికి ద్రోవను దీసెను రాజు, తీసి ని
ల్చి, సకల దుర్గపార్శ్వపరిశీలనదృక్కులు చిమ్మె నంతటన్‌.
మృత్యుదేవత చాచి మెఱపించు నాలుక - పోలిక కోట తల్పులను జూచి
తనకు శత్రులకు మధ్యగ నిల్చియున్న ర-క్షో మూర్తివలెఁ గోటగోడఁ జూచి
తెలుఁగు సేనల ప్రాణముల కెత్తిన ఫణాళి - వలె నున్న కోటకొమ్ములను జూచి
విధి పన్నినది యనిర్భ్యేద్యమౌ వ్యూహ మ్మొ-కో యనఁజాలిన కోటఁజూచి
        చూచి యేఁమార్గమునుగూడఁదోచరామి
        పరమసాహసి యో ధరాఫాలమౌళి
        పార్శ్వమున వ్రేలు తన కరవాల మొఱను
        దూసి కోటలోపలఁ బాఱవేసె విసరి.
తెలి లేవెన్నెల చాలులో తళతళై దీపించు వజ్రాల ప
చ్చల నీలాల హొరంగువన్నెల సరుల్‌ చాయల్‌తలారింపులై
తొలిక్రొక్కారు మెఱుంగులట్టులయి యెంతోవైనతేయాహృతో
జ్జ్వల దివ్యాహివలెన్‌ జెలంగి నసి రాజద్ధూమకేత్వాకృతిన్‌.
వివిధసైన్యములు నివ్వెఱవోయి నిలచిరి, - దండనాధులునుఁ జిత్రప్రతిమల
వలెనైరి, కోటలోపలి శత్రుసైన్యంబు - మెఱుపువోలిక త్రాచుకరణి నేదొ
పఱతెంచి కోటలోఁ బడుటయు దెలుఁగు సై-నికులు ముట్టడిని మాని నిలబడుటఁ
గనుఁగొని దానికిఁ గారణం బెఱుఁగక - గుములుగానై కలగుండు వడిరి
        దండనాధులు రాజు నేత్రములయందు
        నిశితదృష్టులు చూచుచు నిలువబడిరి
        అరనిముస మాగి రామరాయాధినేత
        మెల్లన వచించె నిట్లు గంభీరమూర్తి
"అదె యమదంష్ట్రిక శత్రుల
సదనంబున బోయి వ్రాలె జనపతి రాజ్యం
బది యేమిరాజ్య మాత్మ
ప్రదరం బరికోట మాటుపడి యుండగన్‌.
మీలో నెవ్వరు సాహసుల్‌ కదలుఁడీ, మీమీ ప్రతాపాగ్ని తే
జోఽలంకారముగాఁగ శత్రుజన కళ్యాణంబు ఖడ్గాన కు
ద్దాలించం జనుఁడీ, తెలుంగుముని విద్యారణ్య సన్యాసి ద
త్తాలంకారము బుక్కరాజునసి తెండా! పోయి, సైన్యాధిపుల్‌"
అను నలియరామరాయల
జననాథుని మాటలు విని సభయులు సాలో
చనులును సాశ్చర్యులు నౌ
చు నిలంబడిరి దళవాయి శూరులు పెలుచన్‌.
తాళతరుప్రమాన తనుదైర్ఘ్యము గాఢకవాటవక్షమున్‌
నీలసరోరుహాభ రమణీయ విశాల విలోచనంబులున్‌
హాళిఁ జరించు మత్తగజయానము తుమ్మెదఁగేరు కోరమీ
సాలును బొల్చునాయకుఁడు చాగి యొకండుకృతప్రణాముడై.
"క్షోణీవాసవ! నా పొనర్చు నిదిగో జోహారు! మీ యాజ్ఞఁ, గ
ళ్యాణంబెంత త్రిలోకముల్‌ గెలిచి మీయందెం జెలంగున్‌ మణి
శ్రేణిం గ్రుచ్చెద" నంచు విన్నప మొనర్చెన్‌ మందహాసంబు ని
శ్శ్రేణుల్‌ గట్టెను లేతవెన్నెల ధరిత్రీభృన్ముఖోద్గారమై
ఱేనియనుజ్ఞ మెచ్చుఁదల రీతిని వచ్చెను "మా యనుజ్ఞ, వి
ద్యానగరమ్ము నిక్కము సదాశివనాయకుగారు మీ భుజా
స్థాన పరాక్రమార్జిత దిశాసువిశాలము, మీరు నిన్ననే
కా! నెల దాటలేదు, కడకన్‌ హరియించి బిజాపురోద్ధతిన్‌."
తలవాంచి సెలవుఁగైకొని
మెలమెల్లన రాజు పార్శ్వమేదిని జేరెన్‌
దళవాయి, గూడచేతః
ప్రలోభగతులైరి సైన్యపతు లెల్లరునున్‌.
ముట్టడి మానివేసి యొకమూల గుడారము చెంత నేగి ర
ప్పట్టున తెల్గుసేన, లరిపక్షమువారలు వంతువారు కా
కెట్టిరు కోటగోడలఁ జరింపరు, రాతిరి వేళ నెప్పుడో
యట్టె శశాంకబింబ మది యస్తమయంబును బొందె నెఱ్ఱనై.
కడల నాల్గింటఁ గటికచీఁకటులు క్రమ్మి
యరులజాడలఁ దెలిసికో నపుడు కోట
గోడలందున దివిటీ లొకండు రెండు
కడగి వెలిగింపఁబడి యార్పఁబడుచు వచ్చె.
అంతట కాగడావెలుఁగులారిఁ, జీకటు లింక దట్టమై
చెంతలనున్న జీవ మొక చీమయుఁ గన్పడకుండ నాంధ్య మ
త్యంతము క్రమ్మె, కోటదరి ద్వారమునొద్ద నదేమొ నల్లనై
యింతయు సవ్వడిం బడి చరింపదు! చీకఁటిలోన నైక్యమై.
ఒక నిముసంబులో ఫెళఫెళోద్ధతి, నేనుఁగు తాకి యొత్తిగి
ల్లకమునుపే మఱొక్కటి బలంబుగఁ దాకుచు నిల్చియున్న యే
నిక లొక బారు తీర్చి గజనిర్భరకుంభ మహాప్రఘాత మే
చి కదలి కోటతల్పు లవి చీలెఁ బటాపటమంచు బ్రద్దలై.
నెఱిఁ గోటలోవారు నిద్రామదపరీత - నేత్రులై యాయుధాల్‌ నెమకుకొనుచు
చేరక మును సదాశివనాయకులవారి - తెలుఁగుబంటులు కోటతలుపుచెక్క
లటు నిటు త్రోసి యభ్యంతర భటశిర - స్స్కంధముల్‌ తెగఁగొట్టి గంధసింధు
రమ్ములు విడివడ్డ రమణ, పై బురుజుల - కెగఁబ్రాకి స్వాధీనముగ నొనర్చి
        కోట యెల్లెడ తామయై ఘూర్ణమాన
        వారిరాశి విధంబున వఱలునంత
        ఉదయ పర్వతశిఖర సానూపలములు
        ధగధగని ప్రజ్వరిల్లె మార్తాండరోచి.
ఉదయ నవారుణాంశులు కవోష్ణములై దెసలందుఁ బర్వుచో
ముదితుఁడు రామరాయలు విభుండు మహాసభతీర్చి పొల్చినన్‌
దదవసరంబునందు 'యమదంష్ట్రిక' చేకొనివచ్చి శత్రుహ
స్తదళనయోగ్యహస్తుఁడు సదాశివనాయకుఁ డిచ్చె ఱేనికిన్‌.
దేహముతోడ స్వర్గము గతించిన వైఖరిఁబొంగె ఱేఁడునున్‌
బాహుల గౌగిలించి తనపజ్జ నిషణ్ణునిజేసి 'కోటి కో
లాహల రాయనాయక బలా!' యని క్రొంబిరుదంబు లిచ్చి మే
లౌ హరులున్‌ గజంబులు పురావళి యిచ్చెను రాజు వానికిన్‌.
ఆ కేళాదిపురాధిరాట్పటకుటీరాగ్రంబునన్‌ మ్రోసె నాఁ
డేకా రావము "రాయనాయక! బలారే! శత్రుసప్తాంగహా
రీ! కేళాది పురీంద్ర! యాదవమురారీ! కోటికోలాహలా!
కైకోసామి! పరాక!"టంచు పతి రాఁగా మాగధధ్వానముల్‌.
AndhraBharati AMdhra bhArati - kavitalu - AMdhraprashasti - Andhra Prashasti - Viswanatha Satyanarayana - yamadaMShTrika Viswanadha Satyanarayana kavi Samrat Kavisamrat gnanapeetha gnanapitha ( telugu andhra )