కవితలు నవమి చిలుక శిష్‌ట్లా ఉమా విజయ మహేశ్వర వినాయక్‌

05. ఊట్ల వెర్రెమ్మ

ఊట్ల వెర్రెమ్మ ఊళ్ళో ఉందంటే ఊరంతా ఉబుసుపోక!

దార్లో కనబడితే దారి కడ్దంగా, కర్రమీదానుకుని కర్ర వణికిస్తూ, కనబడిన మనిషి తోల్లా కదిలించి కదిలించి కరిచినట్లు మాట్లాడే ఊట్లవెర్రెమ్మ ఊళ్ళో ఉందంటే ఊరంతా ఉబుసుపోక!

మా ఊళ్ళో పిల్లలకు దాగులుమూచీ ఆటల్లో ఊట్ల వెర్రెమ్మ ఊళ్ళో ఉందంటే గప్‌చిప్‌! పలకరిస్తే కష్టం, లేకపోతే చావు, ఊట్ల వెర్రెమ్మని! పలకరిస్తే - పెద్దంతరం, చిన్నంతరం లేదా అంటుంది; దారినే పోతే - కళ్ళు తలకెక్కినయా నాయనా అంటుంది! మా ఊరిమధ్య రావిచెట్టుకింద ఎండలో వానలో, రాత్రీ పగలూ, ఊట్ల వెర్రెమ్మ ఉన్నా ఉన్నట్లే; ఉండకపోయినా ఉన్నట్లే ఉంటుంది!

ఆకాశాన ఎగురుతూ తిరిగే పిట్ట లన్నింటికి మా ఊరిమధ్య రావిచెట్టుకింద ఊట్ల వెర్రెమ్మ ఉండటమే గురుతు.

ఊట్ల వెర్రెమ్మ తెల్లముసుగే ఊరిజండా! అర్జునా ఫల్గుణా పార్థివాకు బదులుగా ఊట్ల వెర్రెమ్మ పేరుతో పిలిస్తే ఉరుములే ఉరమవు. పిల్లలను మేకలను కొట్టదు తిట్టదు, కొట్టినట్టుంటుంది; ముద్దూ మురిపెంచేయటం చేతకాదు. కాని ఊట్ల వెర్రెమ్మ వీధిలో వెళుతుంటే జారుతూ జరుగుతూ రాళ్లనూ రప్పలనూ రాచుతూ పోయే కొంగుముడి తాయాన్ని జూస్తూ నవ్వుతూ నసుకుతూ నాట్యాలు చేస్తూ అల్లరి పిల్లలు ఆడుతూ పాడుతూ వెంటపడి చేసే వేళాకోళాలను చూచి దారినే పోయే బాటసార్లందరూ "ఇదే ఊట్ల వెర్రెమ్మ ఊరు!" అనే వాళ్లు. ఊట్ల వెర్రెమ్మ ఊరికి ఉత్తరాన ఉంది! ఊళ్ళో ఉబుసుపోవటం లేదు.

ఆకాశాన తిరిగే పిట్టలన్నింటికీ ఫలానా ఊరనే గురుతు పోవటంతో మా ఊళ్లో పిట్టలే తక్కువైనాయిప్పుడు.

దారినేపోయే బాటసారు లొకరో యిద్దరో అయినా రిప్పుడు.

అల్లరి పిల్లల ఆటలూ పాటలూ తగ్గడంచేత మా ఊరిమధ్య రావిచెట్టుకు కళాకాంతీ లేదిప్పుడు. అయినా, మావూళ్లో తల్లులంతా గూడా చద్దెన్నాల్లో ఇదిగో ఊట్ల వెర్రెమ్మ ముద్దంటే చడీ చప్పుడూ చెయ్యకుండా చంటిపిల్ల గూడా తింటుంది!

ఊట్ల వెర్రెమ్మ ఊళ్ళోనే అక్కడక్కడ అప్పుడప్పుడు కనబడుతుందని అనుకుంటారు - ఆలకిస్తూ చెప్పుకుంటారు.

AndhraBharati AMdhra bhArati - kavitalu - navami chiluka - SiShTlA umA vijaya mahESvara vinAyak - Shishtla Umamaheswara Rao - Sishtla Umamaheswara Rao - kavitalu kavitvaM geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - telugu kavita - tenugu andhra ( telugu andhra andhrabharati telugu literature )