కవితలు బంగారిమామ పాటలు కొనకళ్ల వెంకటరత్నం
24. చల్లచల్లగా బండీ
 
చల్లచల్లగా బండీ
సాగనీయరా, మామ!
చెళ్ళున కొరడా ఇసిరే
సిత్రమేటిరా?
ఎలపటెద్దు మందకొడిగ
ఎనకెనకై పోతుంటే,
దాపటెద్దు ముందరికే
తరుముకుపోతానంటది
        సద్దుకుపోవేరా మన
        సంసారము సూశయినా!
 చల్లచల్లగా...
నువ్వుచేల తొలిపూతల
నవ్వుల నురగలలోబడి,
ఎన్నెలలో చెట్ల నీడ
లెగరజిమ్ముతా, బండి
        పుంతదారి ఇసకలలో
        పూపడవై పోవాలి
 చల్లచల్లగా...
సూపులు దారెంటనిలిపి
సోద్దెము మానర నాతో;
పడుసుగిత్త లేమరితే
బళ్ళగాడి దాటేస్తై;
        ఊసులాడదామంటే
        ఆశలేదురా కసింత
 చల్లచల్లగా...
గడ్డివాము నీడలంట
కలలుముసిరి కవ్విస్తే
పొదసాటున కోకిలమ్మ
పదమేదో అల్లుతుంటె
        మూగసూపుగా నడుమనె
        ఆగిపోద మనిపిస్తది!
 చల్లచల్లగా...
ఎద్దులజత మెడగంటల
ఏమితీపు లొలికినవో,
కుదుపులోన ఏమరుపులు
కదిలి ఓసరిల్లినవో,
        సిగ్గిడిసిన మనసులెవో
        మొగ్గతొడుగు తున్నయిరా
 చల్లచల్లగా...
AndhraBharati AMdhra bhArati - kavitalu - challachallagaa baMDii - baMgArimAma pATalu - konakaLla veMkaTaratnaM - telugu kavitalu - tenugu andhra ( telugu andhra )