కవితలు బంగారిమామ పాటలు కొనకళ్ల వెంకటరత్నం
29. వెళ్ళిపోదామా?
 
వెళ్ళిపోదామా,
వెళ్ళిపోదామా?
వెళ్ళిపోదామ పట్నవాసపు
కుళ్ళు వీధులలో బడి?
 వెళ్ళిపోదామా...
ఈనమోపై వున్నపైరులు
ఏటిమునకల పాలుజేసి
కొంపగోడీ విడిచి పట్టెడు
కూటికై ఊరేగవలెరా
 వెళ్ళిపోదామా...
పంటతల్లిని ఏ రహస్యపు
పాతరల ఖయిదుంచినారో?
గుండెలోన ఎడారి మండే
గోడెరుంగ దికేమి దిక్కో
 వెళ్ళిపోదామా...
ఒళ్ళుపెంచిన గడ్డమీదే
ఒరిగిపొయ్యే రాణలేదో
ఊరుగానీ ఊరిలో చితి
పేర్చుకొమ్మని నొసటివ్రాలో!
 వెళ్ళిపోదామా...
రాజసపు రతనాలభూమిని
ఏమనీ సెలవడిగి వస్తవు?
ఏ కడల మన్నయిన, తనలో
ఇమిడిపోవక తీరదనరా
 వెళ్ళిపోదామా...
గడిచిపోయెనె పూలుపూచిన
గడియలిక మనకాపురములో?
కాలమొక్క మహాగ్నిగుండము
కాచుకొన్నదీ ముందుమనకై
 వెళ్ళిపోదామా...
AndhraBharati AMdhra bhArati - kavitalu - veLLipoodaamaa? - baMgArimAma pATalu - konakaLla veMkaTaratnaM - telugu kavitalu - tenugu andhra ( telugu andhra )