కవితలు చీకటి నీడలు - బైరాగి 06. చారిత్రక జ్యోతులు
చారిత్రక జ్యోతులు

జీవిత నాటకరంగపు
గడచిన బహు దృశ్యాల్లో
రంగుల తళుకుల బెళుకుల
కపట పటాటోపంలో
మరుగుపడిన వెలుగులు ఇవి!
భూనభోంత రాళాల్లో పిక్కటిలిన
గెలిచిన సైన్యాల జయధ్వానాల
వంది మాగధుల బానిసగానాల
రక్తాక్త కృపాణాల
మంద్రవేగ ఘోషల్లో
అణగారిన అనాధజీవుల
అరణ్య రోదన లివి!
పుక్కిటి పురాణాల, కట్టుకథల
దట్టమైన అరణ్యాల్లో
కనుపించని చిన్నిపూలు
రారాజుల నరహంతక పరపీడక
నిరంకుశ కళంక చరిత్రల
కలుష పాపపంకిల పుటల్లో
కనుపించని వినిపించని
క్షుద్రమానవుల జీవిత పోరాటపు
భగ్నపరాజయ గాథలు!
ఆకశమంటే కోటల నిర్మించిన ఎముకగూళ్ళ
మూకకంఠ సమూహాల ఆశృత ఘోషలు
పుత్రుల గోల్పోయిన మాతల, అనాధశిశువుల,
సద్యోవిధవల లోలోపల దిగమ్రింగిన
యింకిన అశృమహానదాలు
కళాప్రియుల రాజ్యాల్లో కాటకాలు
కాలువకట్టిన పాటక జనసామాన్యపు చెమటలు
ఊసరక్షేత్రాలను తడిపిన
విలువలేని నరరక్తపు సాగరాలు
మా తెచ్చిన సందేశం!!!
పండిన పచ్చటిపైరుల
బంగరు రంగుల ఒరిగిన చేలపైన
యోద్ధల గుర్రపు డెక్కల ధ్వంసలీల,
మదమత్త కరీంద్రాల స్వేచ్ఛావిహరణ
సామ్రాట్టుల సంకేతంపై
వర్షాషాఢపు నదులై ప్రవహించిన
మహాసైన్య వాహినిలో
కొట్టుకపోయిన జనపదాలు.
ఏమిటి ఈ చరిత్ర? హత్యలు దోపిళ్ళుతప్ప!
లెండి! లెండి! దారి తొలగిపొండిక!
ప్రాపంచపు సౌఖ్యాలకు
మెరిసే బంగరు నాణ్యాలకు
మానవమేధస్సును విక్రయించి
తమ హృదయపు నెత్తుటినమ్మిన
మిథ్యాచరిత్ర కారులూ!
రాజసభల కవికుమారులూ!!
వినండి! మా తెచ్చిన సందేశం!
మా వెలిగించిన జ్యోతులు
శ్రామిక జనరక్త తైల పోషితమౌ
ప్రభువిలాస నృత్యోత్సవ
ప్రమత్త దీపికలు కావు.
సంస్కృతి బలిపీఠంపై
ఆత్మోత్సర్గపు దీపమాలలై
వెలిగిన మేధావుల జీవితాల
ఎర్రని ఒంటరి జ్యోతులు!!
చరిత్ర చీకటి గుడిలో
ఆశా నిగూఢ రశ్ములు!
భవిష్యయుగ యాత్రికులకు
నవ్యకథ ప్రదర్శన జ్యోతులు!!
AndhraBharati AMdhra bhArati - kavitalu - chaaritraka jyootulu - chIkaTi nIDalu - AlUri bairAgi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )