కవితలు చీకటి నీడలు - బైరాగి 17. గాలివాన
గాలివాన

జోరునకురిసే వాన
హోరున వీచేగాలి
సముద్రతీరంలో గాలివాన
అంతులేని శూన్యంలో
త్రోవతప్పిన తుపానుమూల్గులు
తెరలోపల అదృష్టపు చిరునవ్వులు
కనుపించని ఆ ఒడ్డున
కోట్లకొలది పసిపాపలఏడ్పులు
గురితప్పని ఆహ్వానం
నావికుని మృత్యుగానం
ఆకాశపు మెరుపుల్లో
కోపించిన కడలికెరటాల తళుకులు
నాగలోక విషకన్యల కులుకులు
భూమంతా తడిపేసీ
వారిధిలోజలమూ
వారిధి గర్భంలో బడబానలమూ
ఒడ్డున వెర్రివాడు,
నలుదిక్కుల చెలరేగిన సౌందర్యం
మహా ప్రకృతి రహస్యాలు
బట్టబయలుగా నిలిచిన ఆశ్చర్యం
నురుగులు కక్కుతున్న
తరంగాల గుర్రాలు
జీవితపు ఉధృతంలో
నిలువలేని జలమూ
కొలతలేని లోతుల్లో
ఆనందపు మహోన్మత్తలాస్యం.
వెర్రివాడు తనచుట్టూ చూశాడు,
ఆనందంతో చిటికెలు వేశాడు
నీళ్ళలో కలిశాడు;
గాలివాన ఆగింది.
పసిపాపలు అలసిసొలసి
నిద్రించారు,
నురుగులు కక్కుతున్న
తరంగాల గుర్రాలో
తరలిసాగి పోయాయి
వెర్రివాడు మాత్రం
ఒడ్డున లేడు.
AndhraBharati AMdhra bhArati - kavitalu - gaalivaana - chIkaTi nIDalu - AlUri bairAgi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )