కవితలు చీకటి నీడలు - బైరాగి 09. జీవితం
జీవితం

ఏమి వెదుకుతున్నావూ?
ఈ జీవిత శిథిలాల్లోనీవూ?
చెదిరిన నీ సుఖస్వప్నాలే అవి
రంగుల రంగుల గాజుపెంకులూ
బ్రతుకు పంటలో తాలుకంకులూ
పెంటపోగులో విశ్రమించినయ్‌
దాగని బ్రతుకుల రంగుల బొంకులు
చివికిన ఖాళీసిగరెట్‌ పెట్టెలు
మంటిని గలసిన సిగరెట్‌పీకలు
గాలి అలలలో తేలియాడుతూ
నేలనువాలే కోడియీకలూ
తళుకు కాగితం, మెరిసే తగరం,
తుప్పుతినేసిన యినుపరేకులూ
మందుల పొట్లాలకు పనికొచ్చిన
చిరిగిన మాసిన ప్రేమలేఖలూ
నల్లని యెర్రని గుడ్డపీలికలు
పూర్వపుటందము చెడినపోలికలు
గుప్పెడుదుమ్మూ, పిడికెడు బూడిద
యిది నీ మిగిలిన జీవితసంపద.
యీ బూడిదలో కలిసిపోయినవి
ఆశ, నిరాశలు, నవ్వులు, ఏడ్పులు
నెత్తుటి చుక్కలు, అశృబిందువులు
కొంచెం బ్రతుకూ, కొంచెం చావూ!
ఏమి వెతుకుతున్నావూ!
.......................................
ఏమి వెతుకుతున్నానూ?
యీ బ్రతుకుల బూడిదలో నేనూ!
చావుల బ్రతుకుల సంజ వెలుగులో
మసక చీకటుల నల్లని పొగలో
అలముకొనే చిక్కని నీడలలో
చెదిరిన కలల అడుగు జాడలలో
నమ్మకాల ఆరిన రవ్వలకై
ఆశయాల వాడిన పువ్వులకై
కన్నీరుల యింకిన గురుతులకై
బూడిదలో నెత్తురు మరకలకై
నేను వెతుకుతున్నానా?
గడచిన గొప్పదనపు ఒక కిరణం
మరచిన పాటలోని ఒక చరణం
యీ చీకటి క్షణాలు గడిపేందుకు
కదలని కాలరథం నడిపేందుకు
పూచికపుల్ల, చిన్న ఆధారం
యీ హారపు తెగిపోయిన దారం
ఇదా నేను అన్వేషిస్తున్నది?
ఈ ధ్వంసంలో ఆశిస్తున్నది?
పగిలిన గుండెల నెత్తుటి చారలు
కడిగేస్తవి కన్నీరుల ధారలు
బ్రతుకు సంజ కెంజాయల గురుతులు
తుడిచేస్తవి కాటుకల చీకటులు
అలసి సొలసి నిదురించిన అలజడి
మొగముపైన నిశ్శబ్దపు గొంగడి
తిరుగుతోన్న బ్రతుకుల గానుగలో
మూల్గుతోన్న జీవాల పీనుగలు
వాటి చెమట కన్నీరు నెత్తురులు
చిట్లినఎముకలు, పిండినకండలు
తెగివేళ్ళాడే నరాలపోగులు
జరజరసాగే ఎర్రనివాగులు
విరసపు ఎండుపిప్పిగుట్టలు ఇటు
మెరుస్తోన్న నెత్తురుబొట్టులు అటు
అది తైలం, అది జీవితసారం
ప్రపంచాల దివ్వెలకాధారం
అందుకనే ఆ దీపపు వెలుతురు
క్రక్కుతోంది ఇటు ఎర్రని నెత్తురు.
ఏమిటి నే నిట ఆశిస్తున్నది?
ఏకాంతపు చీకటి కాకున్నది?
ఇది ఎండిన మండిన మైదానం
బూడిద నిండిన కటిక శ్మశానం
మాడిన నల్లని రెల్లు దుబ్బులూ
భూ చర్మంపై పుళ్ళ జబ్బులూ
తాకిన కరచే వాడి ముళ్ళపొద
ఈ భూముల మిగిలిన తరుసంపద
కనిపించదు ప్రాకే పురుగైనా
వినిపించదు నక్కల అరుపైనా
వెతికేందుకు ఇక్కడ ఏమున్నది?
మంటల మాడి దుమ్ముకానున్నది?
అంతులేని త్యాగాల నెత్తురులు
కడలిపొంగులో పీనుగ తెప్పల
నూతచేసుకొని చీకటి రాత్రులు
గడచిన మానవ జీవితయాత్రలు
చావులతీరం చేరుకున్నవా?
యీ మృతభూమిని కోరుకున్నవా?
నురుగులు కక్కి కటికి దప్పులతో
బొబ్బలుపొక్కి కాలి నొప్పులతో
అడు గొకదాటరాని దూరంగా
క్షణమొక మోయరాని భారంగా
చీకటు లలముకొనే చూపులతో
దడదడమనే ఎండుగుండెలతో
పరుగెత్తే ఆ పిచ్చిపాంథునికి
ఎండమావులా దాహశాంతులకు?
ఎందుకు పరుగులు, వృథాప్రయాసలు
భ్రమగొలిపే బ్రతుకులకు అడియాసలు?
కఠినతపస్యలు బలి సమర్పణలు
నెత్తుటిపూజలు వెర్రిప్రార్థనలు
ఈ రాక్షస విగ్రహం ముందునా?
ఈ జీవిత శనిగ్రహం ముందునా?
యుగయుగాలుగా మ్రొక్కిన శిరసుల
వణికే చల్లని మెత్తని స్పర్శల
రాపిడి చెందిన బండరాయి ఇది
కదలని మెదలని మొండిరాయి ఇది
దీనిపైన నీ దీనాలాపం
అనునయ వినయం కరుణవిలాపం
పనిచేయదు నీ అశృబిందువులు
చింది కలిసిపోతాయి ధూళిలో
ఎండి ఇంకి పోతాయి నేలపై.
యీ అనంత జీవితశూన్యంలో
రేజీకటి నిండిన దైన్యంలో
గాలి అలల అస్పష్టపు టేడ్పులు
అవి ఒంటరి జీవాత్మల మూల్గులు
నలుదిక్కుల చొరనేరని నీడలు
బ్రతుకుచెరల కనుపించని గోడలు
ఎక్కడ వెలుగు తెరవు యీనిశిలో?
స్వేచ్ఛాసీమ ఉన్న దేదిశలో?
చీకటి! కటికి నిరాశల చీకటి!
బ్రహ్మాండం ఒక ఆరిన కుంపటి
యీ చీకటి పీనుగలో బిలబిల
ప్రాకుతున్న పురుగులు మన బ్రతుకులు
మురికిగుంటలో పొరిలే పందులు
శవంపైన ఎగిరే రాబందులు
పగటి వెలుతురు మేలిముసుగులో
బంగరు రంగుల పసిడిమెరుగులో
తళతళ లాడిన ధగధగ మెరిసిన
పలుకు పలుకులో కులికిన మురిసిన
ఆ అతులిత జీవిత సౌందర్యం
మెరుపులాగ మెరసిన ఐశ్వర్యం
ఏదీ? యీ కురూపి చీకటిలో
నలిగి నశించిందా ఒకతృటిలో?
జీవితోదయపు లేతవెలుగులో
ఉషాసుందరి చీరచెరగులో
అలముకొన్న పరిమళతరంగమది
ఏ వడ గాడ్పుల్లో నశించినది?
ఈ పెనుచీకటి లేనిరోజులూ
బ్రతుకొక యుద్ధం కానిరోజులూ
ఒకానొకప్పుడు ఉన్నాయేమో?
మనమాలస్యంగా వచ్చామో?
ఏమో మరి, మనమొచ్చేసరికే
చూపుమేర పరుగెత్తేవరకే
జీవితశకటం తప్పిపోయినది.
మనలను మసితో కప్పిపోయినది
వెతికేందుకు ఇక్కడ ఏమున్నది?
పొగగా మసిగా నుసిగాకున్నది?
మబ్బుల్లో పసిపాపల నవ్వులు
అడవులలో వికసించే పువ్వులు
కొండలపై కులికే కిరణాలూ
రేలకు తారల ఆభరణాలూ
జీవితాని కేమిటి శృంగారం?
కటికి వాని కేమిటి కనికారం?
ఇవిగో! ప్రత్యేకంగా ఉంచిన
నరికి, తరిగి ముక్కలుగా తూచిన
జీవితాల నెత్తుటి ప్రోవులు ఇవి.
అమ్మేందుకు సిద్ధంగా వున్నవి
చీకటి మూలల ఆశాభావం
ఆసుపత్రిలో గర్భస్రావం
భ్రూణ హత్య, మృతశిశువుల జన్మలు
చేసిన పాపం పట్టిన ఖర్మలు
ఉదయం నెత్తురు కందు పుట్టటం
సాయంత్రపు చితిలోన గిట్టటం
బ్రహ్మాండపు గుండ్రని సుడిగుండం
లోచిక్కిన ఈ జీవిత పిండం
గడ్డిపోచలా క్రిందికి మీదికి
తిరుగుతోంది బయటకు రానేరక
చీకటిగదిలో పుట్టిన పాపం
నీడలాగ వెన్నాడేశాపం
త్వత్వరగా జీవితమే తొందర
నడువ్‌ చరచరా, త్వరగా, బిరబిర
జీవిత జ్వరపు వేడిలో తొందర
నీడ అదే వెనుకను నీ దగ్గిర.
అదే నీడలో ముద్దులు వలపులు
శరీరాల తప్పనిసరి పిలుపులు
జ్వరపు వేడిలో మండేకౌగిలి
లో గడగడవణికే ఆత్మల చలి
మరల పుట్టుకలు చావుల నీడలు
ఇవే ప్రపంచపు అడుగుల జాడలు
ఇది దుర్భర జీవితశృంగారం
పీనుగున్న గదిలో వ్యభిచారం
రోగిభార్యతో డాక్టరు ప్రేమలు
నర్సుల సరసాలకు ఓ, న, మ, లు
బీభత్సపు క్రుళ్ళిన దుర్గంధం
కుళ్ళులోని పురుగులకానందం
మానవదేహపు చెమట వాసనలు
కప్పేందుకు పువ్వుల సువాసనలు
మురిగిన ఆత్మల అందవికారం
దాచేందుకు తనువుల శృంగారం
మనసులనేరపు చీకటిలోతుల
ముసుగులు ఆ చిరునవ్వుల కాంతులు
క్షమార్పణల్లో అభివందనములు
జయఘోషల్లో ఆక్రందనములు
నెత్తురులో మునిగిన మొదళ్ళపై
మొలచే బ్రతుకుల లేతచిగుళ్ళవి
వందఓటముల పీనుగపెంటల
పైనమ్రోగునవి గెలుపులగంటలు
క్షణమాత్రపు వణికే ఆనందం
బ్రతికినంత వరకొక నిర్బంధం
క్షణమాత్రపు ఈ మురుపులు కులుకులు
దీపకాంతిలో తళుకులు బెళుకులు
రేపటి ఉదయపు కటికవెలుగులో
నగ్నసత్యముల అచ్చ తెలుగులో
తడబడుమాటలు వణికే కంఠం
మొద్దుచూపు మొనబోయినగంటం
రంగులపూతలు వెలవెలబోతూ
తెల్లమొగంతో తెలతెలబోతూ
నలిగినపూవులాంటి సౌందర్యం
చూస్తే కలుగుతుంది ఆశ్చర్యం.
వెతికేందుకు ఇక్కడ ఏమున్నది?
మొదటి తాకుతో నేల రాలనిది?
ఈ అదృష్టపు అనాధ పుత్రులు
కుక్కల నక్కల ఈగల మిత్రులు
బ్రతుకువేటలో పరుగెత్తేందుకు
తెరవు లేక తప్పించుకునేందుకు
కాలురాక, వణకుతూ భయముతో
ఈ విశాలమగు ఇసుకబయలులో
ఉష్ట్రపక్షులై తలలువంచుకొని
కూర్చున్నారా ఆశవదలుకొని?
తమ నేరపు తుది తీర్పు వినేందుకు
చావుల తెరవాలటం కనేందుకు.
తమకందని శక్తుల బానిసలై
తా మెరుగని పాపపువారసులై
తమ దైనిక జీవితపు ఊబిలో
దిగబడి, ఎగబడి పోరుకాడుతో
పయనించే ఈ మానవజాతికి
లేదా త్రోవ విముక్తికి, శాంతికి?
కరువు, తుపాను, ప్రబల భూకంపం
దారుణ ప్రపంచమారణ యుద్ధం
ఈర్ష్యాద్వేషపు నరకజ్వాలలు
నలుదిక్కుల మానవ వధశాలలు
మిన్నులుముట్టే హాహాకారం
అది జీవిత దేవత జయకారం.
మృత్యుబాధలో మునిగినప్రాణికి
ఊపిరిసలపక, గిలగిల తన్నుక
చచ్చే చిట్టచివరి సంఘర్షణ,
పీడకలల జీవిత యమయాతన,
మెలుకువ ఎక్కడ? ముక్తి ఎటున్నది?
అది కాదా అందరం వెదుకునది?
కాని ముక్తి ఎక్కడ? ఈ చీకటి
జీవిత వృక్షపు తుది పెనుకూకటి
వేరువరకు వ్యాపించి పెరిగినది,
అన్ని తీరములు ముంచి పొరలినది.
ఈ చీకటిలో మంచుబొట్లలా
టపటపరాలే అశృ బిందువులు
అవే మనకు మిగిలిన ఓదార్పులు
వీడలేకపోతున్న బంధువులు
నేను వెదుకుతున్నది ఇంతేనా?
ఈ బ్రతుకులవెల బూడిదలోనా!
AndhraBharati AMdhra bhArati - kavitalu - jiivitaM - chIkaTi nIDalu - AlUri bairAgi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )