కవితలు చీకటి నీడలు - బైరాగి 20. ఒకేజ్యోతి
ఒకేజ్యోతి

ఒకేజ్యోతి!
అచలదీక్షతో వెలిగే
జాగరూకమై మెలిగే ఒకేజ్యోతి!
నిరంతాందోళిత మానవహృదయంలో
పిరికివాని భీతిలోన, వీరుని అభయంలో
ఆశలో నిరాశలోన
తృప్తిలో దురాశలోన
విరిసిన పుష్పాల సువాసనలో
కవిగాయక ప్రేమికజన
సకలశిల్పి సౌందర్యోపాసనలో
నాట్యాంగన విన్యాసములో
యోగిజనుల సన్యాసములో
ఉరికెక్కే విప్లవకారుని
అంతిమ దరహాసములో
అనేకస్వరూపాల
శతజీవిత తరంగాల
నురుగునవ్వు దివ్వెల్లో
వెలుగుతుంది ఒకేజ్యోతి!
దుర్గమతర హిమవన్నగ శిఖరంపై
బాలారుణ కిరణాంకురమై
దుస్తరసాగర రహస్య గర్భంలో
ఆరని బడబానలమై
విప్లవాల సుడిగాడ్పులు
కాటకాల వడగాడ్పులు
దారుణమారణ సంగ్రామపు
పెనుతుపాను హోరులోన
జడివానల జోరులోన
ఆరక సతతము వెలిగే
జాగరూకమై వెలిగే
దివ్యజ్యోతి! ఒకేజ్యోతి!
బరువై తోచిన మన తెరువు లేని జీవితాల
కరాళ కాలరాత్రిలో
అడుగడుగున కరపదముల
నిగళయుగము మ్రోగుచున్న
బానిస బ్రతుకుల చిరముతక యాత్రలో
తన కరుణాకిరణమ్ముల
నవకటాక్ష వీక్షణమ్ముల
నైరాశ్యము రూపుమాపి
మునుముందుకు త్రోవ చూపు
మహాజ్యోతి! ఒకే జ్యోతి!
ఏ జ్యోతిని వెదకి వెదకి
తెలియని సృష్ట్యాదినుండి
తెలిసిన మన యుగమువరకు
ఎందరో మహానుభావులు
అనేక విప్లవకారులు
సత్యాన్వేషణ మిషతో
త్రోవతప్పిన మతప్రవక్తలు
పేరులేని తిరుగుబాటులో కూలినజనశక్తులు
కాలాన్నెదిరించిన మేధావంతులు
తమనెత్తురు చమురుపోసి
ప్రాణాన్నే దివ్వెచేసి
నేటివరకు దేనికొఱకు
వెదకి వెదకి విసిగారో
అదేజ్యోతి, ఒకేజ్యోతి!
కన్ను మిన్ను కానరాని
చీకటిలో నడిరేయిని
గృహమువీడి ధనమువీడి
రాజ్య ప్రలోభనమువీడి
వీతరాగుడై వెడలిన
గౌతమబుద్ధుని హృదిలో
అదేజ్యోతి వెలిగిందట
ప్రభుశక్తిని ధిక్కరించి
చావును తానై వరించి
మూఢజనుల అవహేళన
అవమానపు వెత భరించి
తన కంటక కిరీటాన్ని
తానై యౌదల ధరించి
శిలువెక్కిన ఏసుక్రీస్తు హృదయంలో
అదే చిచ్చు రగిలిందట
కునికిపాట్ల చీకటిలో
బాధలతో ఆకలితో
ఎదమరచిన నరజాతికి
మేలుకొలుపు పాడేందుకు
అదేజ్యోతి!
యుద్ధాల దరిద్రాల
ఈ చీకటి సముద్రాల
ఆవలి ఒడ్డు చూపేందుకు
ఒకే జ్యోతి! ఒకే జ్యోతి!
జ్యోతి! జ్యోతి! ఒకే జ్యోతి!
కాని యెచట? జ్యోతి యేది?
మన నిద్రిత హృదయాల్లో
మన ముద్రిత నేత్రాల్లో
మన బానిస భావాల్లో
జ్యోతియేది? జ్యోతిలేదు,
జ్యోతిని కోరేవారలు
జ్యోతి పాదపూజారులు
ఈ జగజీవిత నిశిలో
నూతన మార్గంకొరకై
భూతల స్వర్గంకొరకై
వెదకే విప్లవకారులు
మీప్రాణం దివ్వెచేసి
మీనెత్తురు చమురుపోసి
జ్యోతిని వెలిగించండి
మీ హృదయపు తిరుగుబాటు
ఆరిపోని నిప్పురవ్వ
ప్రపంచాన్ని మండించే
మంటల పంటలు పండించే
మీ బ్రతుకొక హారతిగా
జ్యోతిని పూజించండీ!
జ్యోతిని ఆరాధించండీ!
AndhraBharati AMdhra bhArati - kavitalu - okeejyooti - chIkaTi nIDalu - AlUri bairAgi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )