కవితలు చీకటి నీడలు - బైరాగి 08. వంచిత భర్త
వంచిత భర్త

మురికి గుంటలో పొర్లిన తిమింగలం
నవ్వింది అమంగళం
హృదయపు గాజుపాత్ర
తునకలుగా పగిలింది
వధ్యపశువు గొంతుకలో
చివరిమాట పిగిలింది.
నిర్భాగ్యుని గుండెల గడియారం
ఠక్కున ఆగింది.
బయర్లుకమ్మిన కళ్ళూ
సలసలకాగే ఒళ్ళూ
జీవిత మర్యాదకు
మానభంగం జరిగింది.
చెవుల్లో సప్తసముద్రాలహోరు
సగంచచ్చిన కోడిపుంజులపోరు
విషాద హలాహలం
ఉక్రోశ దవానలం
గురితప్పిన నరచాలిత టార్పీడో
కోపగించిన విసూవియస్‌
కూలిన ఆశల అట్టల ఇళ్ళూ
వంచిత భర్త ఇంటికి
దౌడు తీశాడు.
నీలకంఠుని గొంతుకలో
గరళం గురగురలాడింది
గోడ నీడ వెక్కిరించింది,
తోలు బొమ్మ కొక్కిరించింది.
విడిచిన బట్టల్లో దూషిత
సంపర్కపు దౌర్భాగ్యపు కంపూ
వంచిత భర్తకు తలవంపూ
అల్లకల్లోలమైన ఆ చేతనంలో
పడకమంచం కిర్రు కిర్రు.
హృదయంలో గుచ్చిన మండే
లోహశకలాల చుర్రు చుర్రు.
* * *
వెన్నును తాకిన మంచుముద్ద
పొంగిన పాలపైన చన్నీళ్ళూ
శిలపై తలపగిలిన తరంగం
పనిచేయని ఫిరంగి.
వంచిత భర్త ఇంటి కెళ్ళి
శరీరాన్ని గోడకు చేరగిల వేశాడు.
AndhraBharati AMdhra bhArati - kavitalu - vaMchita bharta - chIkaTi nIDalu - AlUri bairAgi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )