కవితలు దాశరథి కవితలు రుద్రవీణ
01. మంగళగీతి
 
మంగళగీతి పాడెద హిమాచల శృంగ సరత్‌ సురాపగా
భంగ తరంగ రంగముల పాదములూని నటించు తారకా
లింగిత బాలచంద్రముని లీల తలన్‌ ధరియించినట్టి భ
స్మాంగుని ఫాలనేత్రము నవాగ్ని కణమ్ముల జిమ్ముదారులన్‌.
కుంకుమ చిల్కరింతు నిదిగో! పరిగర్జిత మేఘ మాలికా
పంకిల రోదసీ కుహరభాగ దివాంధ భయంకరార్భటీ
సంకుల కాళరాత్రి తెరచాటున నాటన శాలవంటి ప్రా
గంకమునన్‌ మదీయ ఘుసృణారుణ హస్త తలద్వయమ్మునన్‌.
వెచ్చని మొల్లపూలు కురిపింతును శైశిర శీతవాత ఘా
తోచ్చలి తాతిశుష్క లతికోద్గత నగ్నతతో చెలంగు యీ
గచ్చ పొదల్‌ గలట్టి వన కన్యక శూన్య ముఖాంగణమ్మునన్‌
పచ్చని మాధవ ప్రభుని బాహువు లెత్తిన పూల బుట్టతో
వెన్నెల కాగడాలకు ద్రవించెడి చీకటి కొండపైన కూ
ర్చున్న అనంత తారకలు రొప్పుచు రోజుచు జారివచ్చి ఈ
పున్నమనాటి చెంగలువ పూవులవోల్‌ వికసించెనో! యనన్‌
మిన్నులు దించి తెచ్చెదను మేచక వారిరుహాకరమ్ములన్‌.
AndhraBharati AMdhra bhArati - dAsharathi - rudravINa - maMgaLagIti - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )