కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి 02. కాగడా
02. కాగడా
వెలిగించు కాగడా వెలిగించవోయి!
ప్రళయరుద్రుని ఫాలభాగమ్మునందు
అతని నిశాతశూలాగ్రమ్మునందు
అతని నేత్రగోళాంతమ్ములందు
జ్వలియించు శిఖిశిఖాజాలమ్ముతోడ
వేడిగా వాడిగా వెరపుగొల్పేదిగా
వెలిగించు కాగడా వెలిగించవోయి!
రేయి విప్పిన నీలిరెక్కల నీడ
అవనీనభోంతరం బార గ్రమ్మినది
పులుగుగొంతుక మూగవోయిన వేళ
గూట నుంచిన దివ్వె కొండెక్కు వేళ
విడిన పూవులు రాలి పడిపోవు వేళ
ప్రాత దన్నది యెల్ల పైకి తోడుచును
వెలిగించు కాగడా వెలిగించవోయి!
నెమరు వేయుట పశుత్వముపాడి, గాని
సప్తసామ్రాజ్యముల్‌ స్థాపించుకొన్న
పరరాజ్యముల పారుపత్తెమ్ము గొన్న
పౌరుషమ్మున కది పరిపాటి గాదు
ఎన్నెన్ని కల్పమ్ము లేగిన గాని
ఆరని మారని యా ధ్రువజ్యోతి
వెలిగించు కాగడా వెలిగించవోయి!
అధికారదృప్తుల కర్థమత్తులకు
భోగదాసిగ నున్న భూదేవికొరకు,
చెక్కిన నెలరాల చెరసాల నడుమ
వధ్యశిలావైభవం బిచ్చగించి
దేవులాడుచునున్న దేవునికొరకు
దారి తప్పిన బాటసారులకొరకు
దారి గానని పేదవారలకొరకు
వెలిగించు కాగడా వెలిగించవోయి!
తొడిమవీడినపూవుత్రోవ చూడదు తీవ
ధూళిరాలినపండుతో పోదు పాదపము
గాలి గలసిన పాటకై పక్షి వెత పడదు
తరగ విరిగిన మహోదధి తీసిపోవదు
పశ్చిమాశామేఘపటలాంచలముల
ముదిప్రొద్దు రేపటి యుదయమ్ముకొరకు
దాచుకొన్న ప్రతాపరోచిర్లవాల
వెలిగించు కాగడా వెలిగించవోయి!
పూవు వీడినగాని పుట్టదు ఫలము
ఫలము రాలక జనింపదు నవాంకురము
దగ్ధదినైకచితాభస్మరాశి
సుప్తి వీడెడి యుషస్సునకు పునాది
ముదిశిశిర మ్మాకు చిదిమినపట్లు
పూలకారుచివుళ్ళ పురిటిపొత్తిళ్ళు
గతముకై తలపేల, క్షతి కేల వగపు
అరణి మథించి యజ్ఞాగ్ని రగిల్చి
వెలిగించు కాగడా వెలిగించవోయి!
మంటికి మింటి కన్నింటికి మంటగా
వెలిగించు కాగడా వెలిగించవోయి!
AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - 02. kAgaDA - gautamI kOkila vEdula satyanArAyaNa Sastri ( telugu andhra )