కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి 37. కన్నీటిపాటలు
37. కన్నీటిపాటలు
-౧-
కారుచీఁకటిలోనఁ గన్నులు మూసి
యొడ లెరుంగని నిద్ర నుండిన వేళ
జిఱునవ్వు చిలుకుచుఁ జెంతకు వచ్చి
యనుకూల పవమాన మట్లు మైసోకి
జన్మజన్మాల వాసన లూర్చి యూర్చి
నా హృదయమ్మును నను మేలుకొల్పి
మంజులస్వరముతో మధురగానమున
నేనాఁడు వినియైన నెరుఁగనియట్టి
పాటలు పాడి నన్‌ బరవశంజేసి
తొలిచూపులో రూపు దోఁచినయంత
తొలియూర్పులో వేడి పొలసినయంత
తీయనికల యట్లదృశ్యమై పోయె
-౨-
కనులెత్తి కనినంతఁ గరఁగిపోయితిని
మాటలాడినయంత మమతనుగొంటి
పాటఁ బాడినయంతఁ బరవశనైతి
దరిజేరి నంతనే దాసి నైపోతి
కన్నులఁ జిరునవ్వు వెన్నెల గురియ
వలపుపిల్లనగ్రోవి వాయించు నతని
పాదాల సుమమాల పగిది వ్రాలితిని
ముడితేనెకన్నీట నడుగులు గడిగి
తీయని వలపు లుపాయన మిచ్చి
'ఉంటి నీకై' యని యంటినో లేదో
సురచాప మట్లు మంజులగాన మట్లు
అంతలో మటుమాయమై పోయినాఁడె!
-౩-
అడ వెల్లఁ దిరుగాడి యాయాస మనక
సగమువిచ్చిన సన్నజాజిపూవులను
తీవ కొక్కొకపూవు తీరునఁ గోసి
తనకంఠమున వేయు తలఁపున నేను
కట్టిన యీ దండ కఠినుఁడై త్రెంచి
నా మెడ కురివోసి నను మాయజేసి
యెటు వోయినాఁడె నా హృదయేశ్వరుండు!
-౪-
తేటిరెక్కలనీడ, తెమ్మెరయూర్పు
పసిప్రొద్దు నునుముద్దు, నిసికంటినీరు
సోకక తాకక సోనలై పారు
కమ్మతేనెలతోడ గమగమ వలచు
నీ పేదపూవుపై నిసుమంతయేని
కృపలేక యడవిని గిరవాటువైచి
యీ కారుకోనలో నీ కొండపొంత
నీ ముండ్లపొదలలో నీ రాళ్ళదారి
కనురెప్పపాటులోఁ గనఁబడకుండ
నెటు వోయినాఁడె నా హృదయనాథుండు!
-౫-
అలరులు ముడిచిన యామనిరేల
తల విప్పుకొని యాడు తొలకరిరేల
వెలిరెక్క లల్లార్చు వెన్నెలరేల
జడివారు కన్నీటి చలికారురేల
తలిరుఁ బ్రాయమునాటి తలఁపులలోన
మరులు గొల్పెడి వాని మధురరూపమ్ము
ప్రాయంపుఁ దీయని పాటలలోన
రాగ మొల్కిన వాని రమణీయగుణము
తలపోసికొనుచు వంతల మోసికొనుచు
సొదరూపుగొన్న యీ శుష్కజీవితము
నెట్టులో నిలిపితి నిన్నాళ్ళదాఁక
నిముసమైన గృహాన నిలువలే నింక
సైపలే నింక దుస్సహవియోగమ్ము
సాగింతు నా ప్రేమసాగరయాత్ర
తేలుటో మునుగుటో తేలెడుదాఁక
-౬-
దూరదూరమునుండి తోయధిపిలుపు
చెవి సోకి పరువెత్తు సెలయేరువోలె,
వినువీథిఁ దొలిమబ్బు కనుసైగ దోచి
దరిఁ జేరఁబోవు బెగ్గురుకన్నెవోలె
నేకడనుండియో హృదయేశు మురళి
యెద సోకి నిలువోక యేగుదెంచితిని
పోయెద నాశాంతముల కైనగాని
చేరెద నంభోధిపారమ్ము నైనఁ
పూలవెన్నెలకడలి పొంగినవేళఁ
బూచిన విరజాజి పొదలక్రీనీడ
నిసి నీలితలకట్టు కొస లార్చు వేళ
సెలయేళ్ళదరిఁ జెట్లచేమలనడుమ
బ్రదుకెల్ల కన్నుగా వెదుకాడుకొందు
మోమోడు సిగ్గును మూలకుఁ ద్రోసి
మొరపెట్టుకొందు నా విరహజీవితము
-౭-
ఎలప్రాయపు టెడంద మొలిచిన తీవ
తునుమగాఁ దరమౌనె దుర్విధికైన
ఏజామునందైన నెచ్చోట నైన
నెట్టిచిక్కుల నైన నేరీతి నైన
చాయనై నీ వెన్కనే యుందునన్న
మాట యంతంతనె మరచితి వెట్లు?
అవ్వలిమో మైన యంత నే మాయె
లోగుట్టు నిట్టూర్పులో వెలిగాదె,
కన్నెత్తి చూడలేకున్న నే మాయెఁ
బులకరించిన మేను తెలుపదే మనసు,
మాటాడ కున్నంతమాత్ర నే మాయె
చెప్పదే మర్మంబు చెక్కిలిచెమరు,
ఎన్ని జన్మాలదో, యీ మనప్రేమ
నేడు దాచిన దాగునే మనలోన
అపరాధ మెరుగని యనదను నేను
ప్రాణేశ మన కేటి పంతమ్ము లోయి?
-౮-
నీ కింతమనసు లేనేలేద యేని
రాగానల మ్మింత రగులింపనేల
ఆశ గొల్పెడి తలం పసలె లేదేని
నా దరి నీ వేణు వూదుట యేల
సాధించు బుద్ధియే జనియింపదేని
అగుపించి మటుమాయమై పోవనేల
ఏనెరుంగుదును నీ హృదయమర్మంబు
జాగేల భయమేల సంశయమేల
నా ప్రాణపతి వీవె నా నిధి వీవె
నా జీవనమ వీవె నా యాశ వీవె
నా పవిత్రాత్మైకనాథుడ వీవె
మాయని కనుచందమామవు నీవె
పారమ్ములేని గభీరమహాబ్ధి
దరిఁజేర్చుకొను కర్ణధారివి నీవె
నీవు లేకున్న నీ నిఖిలలోకమ్ము
నాపాలి చీకటి నరకమ్ముగాదె
-౯-
మర్మంబు తెలియని మనసులో కోర్కె
యారిపోవని జ్వాల యై కాల్చుచుండ
ఏ పాటలో పాడి యేమొ మా టాడి
ప్రేమింప నెంత ప్రార్థించినఁగాని
లవలేశమైనను లాభింప దాయె
మనసారఁ దీయని మా టాడు ననుచు
పంజరమ్మున పక్షి బంధింపనేల
అవ్వలిదరి లేని యాకాశ మందె
తీయగాఁ బాడుచుఁ దిరుగాడ నిమ్ము
నాకమ్ము నరకమ్ము నాలోనె గలుగ
సుఖదుఃఖముల వేర చూచుట యేల
వలపులజోతి భావమ్మున వెలుగ
దారికోసము పరితాప మేమిటికి
యెదలోని మూర్తితో నెడబాటు లేదు
తీయని బంధమ్ము తెగిపోవ దెపుడు
-౧౦-
కాలిసంకెళ్ళతో గానమ్ము నేర్పు
పైడిపంజరముపై భ్రమ యేల నాకు
దొంగమబ్బులవెన్క దోబూచులాడు
చుక్కలవెలుగుతో సొద యేల నాకు
ఈ నడుకానలో నేకాంతముగను
చెట్లచేమలతోడ సెలయేళ్ళతోడ
పూలగుత్తులతోడఁ బులుఁగులతోడ
నాట లాడుచుఁ బాట లాలపించుచును
స్వేచ్ఛగా గాలినై విహరించుచుందు
బ్రతుకె దుఃఖం బాశపడుటె దుఃఖమ్ము
వలపె దుఃఖము ప్రాణపతియె దుఃఖమ్ము
ఏనె దుఃఖమను, నాదే దుఃఖ మింక
వెలుఁగులో వెలుఁగుచు వేడుకపడుచు
లోకంబె సౌఖ్యంబులో మున్గుఁగాక!
AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - 37. kannITipATalu - gautamI kOkila vEdula satyanArAyaNa Sastri ( telugu andhra )