కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి 05. నిరీక్షణము
05. నిరీక్షణము
అనిలతరంగమాలికలయందునఁ జల్వలఁ జల్లు తీయవా
సన పసిగట్టి యంధతమసమ్ములు మూసిన యీ నిశీథమం
దున ననుఁ జూడ నీవె దయతో నునురెక్కలఁ దాల్చి వత్తువం
చు, నిటులు వాకిలిం దెరచి చూచుచునుంటిని వీథి సారెకున్‌
కురులను దువ్వి, పూల్ముడిచి, గొజ్జఁగిపూవుల లేమెరుంగు టం
బరము ధరించి, గంధకలపమ్ముల మేన నలంది, కమ్మక
స్తురితిలకమ్ము నెన్నుదుట సొంపుగ దిద్ది, సువర్ణభూషణో
త్కరములఁ దాల్చి ద్వారసవిధమ్మున నిల్చితి వెచ్చ నూర్చుచున్‌
విచ్చినయట్టి బండిగురివెందపువుల్‌ గొనితెచ్చి మాలికల్‌
గ్రుచ్చితిఁ బూలకన్న నతికోమలమై భవచ్ఛరీరమే
నొచ్చునొయంచుఁ జక్కఁగఁ గనుంగొని కమ్మని తమ్మి పుప్పొడి\న్‌
దెచ్చియె పాన్పుపైఁ బరచితి\న్‌ సకలమ్మును సిద్ధపెట్టితిన్‌
అలికిడి యేదియైన వినినంత గవాక్షమునుండి లేచి మే
న్పులకలుదేరఁ, బాదములను న్దడబా టిగురొత్త, మారుతో
చ్చలిత కదంబపల్లవము చాడ్పున నా యెద సంచలింప, న
ల్గెలఁకుల వీథియెల్లఁ బరికింతుఁ జలింప నిశాంధకారముల్‌
నీ యనురాగగీతికల నీ పదసన్నిధిఁ గంఠ మెత్తి నేఁ
దీయగ నీవు మెచ్చుకొను తీరునఁ బాడఁ బ్రదోషయామ మం
దే యిటు మేలవించి శ్రుతిఁ దీర్చిన వల్లకి యర్ధయామినీ
వాయుతరంగసంహతి నపశ్రుతు లీను విభిన్న తానమై
కలువలతేనె లాని వలిగాడ్పు మదాననకీర్ణచూర్ణకుం
తలములతో సయాటము లొనర్పఁగ నాచెవి నూఁదునేమొ నీ
పొలఁకువయంచు నూర్పు లెగఁబోయుదుఁ బ్రాణములోని ప్రాణమై
పొలిచిన వాని కేని దయపుట్టని దుర్విధి నాడిపోయుదున్‌
రేయి పదేపదే కనులరెప్పల స్వప్నపు నీలిక్రొందెరల్‌
నేయఁ దపించు నాయెదఁ జలించిన మ్రోఁతలె నీ పదస్వనం
బో యని యూపి రాపి వినుచుంటిఁ జలత్తరుశాఖనీడ వా
తాయనబింబితమ్మయి త్వదాగమనభ్రమ గొల్ప మాటికిన్‌
రావనుకొందుఁగాని యనురాగము ద్వారము మూయనీదు, దుః
ఖావహమౌను గాని భవదాదరపాత్రములంచు వేషభూ
షావళు లూడ్వ లే, నిటు నిరాశ యొకింత యొకింత యాశగా
శ్రావణలక్ష్మినై నిలువఁ జాలక యుంటిని వెల్గునీడలన్‌
చీకటి గ్రమ్ముకొన్న వనసీమను బూవులు రాలు చప్పుడుల్‌
జోక దొరంగి రాల్పఁడు నెలుంగునఁ జక్కవపెంటి గూయు నా
నాకరుణారవమ్ములు వినంబడ నాహృదయమ్ము దుర్నిమి
త్తాకుల మౌను శంకఁ గొనినట్టి వనీమృగి గుండెపోలికన్‌
ప్రేమవిహీనమానసము రీతి విషాదపయోదధూమముల్‌
బ్రామిన యట్టి యీ భయదరాత్రి నిమేషపరాఙ్ముఖమ్ములౌ
ప్రేమవిలీనదృష్టుల వివిక్తపథమ్మును జూచుకొంచు నో
స్వామి యిఁకెంతసేపు గడపంగల నోయి! ముహూర్త కల్పముల్‌
AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - 05. nirIxaNamu - gautamI kOkila vEdula satyanArAyaNa Sastri ( telugu andhra )