కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి 48. పూజాప్రసూనములు
48. పూజాప్రసూనములు
రాలని పూలు కోసికొనిరమ్మని పంపితి వీవె యీ యుషః
కాలమందు పెద్దయొడిగట్టి ననున్‌,` పవమానవీచికా
జాలములందు నే వలపుజాడలఁ గట్టుచు వచ్చులోన నీ
పూలవనమ్ము గుమ్మమును మూసిరి పిల్చినఁ బల్క రెవ్వరున్‌
ఈ పథమందు వచ్చు జను లెల్లరెగాదిగఁ నన్నుఁ జూచి లో
లోపల నవ్వుచుండ, నెటులో నిలుచుంటిని వేఁగుచీఁకటిన్‌
మాపులువడ్డ లేఁతపొగమంచుతెరల్‌ పులకించిపో నుషః
శ్రీపవనమ్ము లెక్కి విహరించెడు పూవులతావు లానుచున్‌
ఆ రవికాంతి నీలజలదావళిపైఁ బడ చిత్రవర్ణశో
భారమణీయతల్‌ దివిని వ్రాలినపోలిక నీ ప్రభాతగం
భీరసుగంధశీతలసమీరము నా మెయి సోకినంత వి
ప్పారెను నా విషణ్ణహృదయాన నపూర్వవిముగ్ధభావముల్‌
వేసవిరేల వేణువనవీథులయం దలస ప్రచారముల్‌
చేసిన కమ్మతెమ్మెరల చిందులలో స్ఫురియించు గానవి
న్యాసమువోలె మెల్లమెల నాచెవి సోకెను నీ నిరంతర
వ్యాసితవిశ్వఘోషణరహస్యము దూరమునుండి పిల్పుగన్‌
కాలము వెళ్లఁబుచ్చి విధికాళులపైఁ దలమోపుకంటె నే
నేల స్వతంత్రధర్మము వహింపఁగ రా దని తోట పెన్గడిన్‌
గేల స్పృశింప, వింటి నొక కేకను 'మాలిక గ్రుచ్చ నెంచు ప్రె
మాలసు లీ వనిం జొర ననర్హులు వారల కందవీ పువుల్‌'
AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - 48. pUjAprasUnamulu - gautamI kOkila vEdula satyanArAyaNa Sastri ( telugu andhra )