కవితలు కాంచన విపంచి
- శ్రీమతి చావలి బంగారమ్మ
1. ఆకొండ
1. ఆకొండ
మంచులో ములిగింది
మాయమై పోయింది
ఆకాశమున గలసెనో
    ఆకొండ
అక్కడే నిలుచుండెనో

రైలులోపల నేను
రాబోవు చున్నాను
ననుజూచి వెనుదిరిగెనో
    ఆకొండ
నైజమే అటులుండెనో

వడివడిగ లేచింది
తడబడుచు నడచింది
మరుగుపడి ననుజూడ
పరుగిడుచు వచ్చింది
హడలుచూ నిలుచుండెనో
    ఆకొండ
అక్కడే పడియుండెనో

జరజరా నడిచింది
గిరగిరా తిరిగింది
ఒలుతిరిగి తాను బడెనో
    ఆకొండ
తలతిరిగి బారుమనెనో

పరుగు పరుగున నాతో
పయనమై యాకొండ
సరగున్న రాబోతె
దారికడ్డము నిల్చు
సరివితోటలు దాటెనే
    ఆకొండ
తలయెత్తి ననుజూచెనే

ఏల జూచెదవంటి
ఏమి కావలెనంటి
ఎంతపిలిచిన పల్కదే
    ఆకొండ
పంతమేమో తెల్పదే

డబ్బుతే డబ్బుతే
డబ్బుతే యనుపల్కు
విడువకను బల్కేటి
వడినడక రైలుతో
తనుకూడ చనుదెంచెనే
    ఆకొండ
తడయకను పయనించెనే

ఇంతలో ఆకొండ
సొంతరూపము దాచి
వింతరూపము దాల్చెనే
    ఆకొండ
పంతమున బడిపోయెనే

చలియన్న జడవదే
పులియన్న వెరవదే
మలయానిలుని దాచునే
    ఆకొండ
మంచుకొండనిపించునే

మంచుకొండయితేను
మనకొరకు తానేల
మరచిపోయీ చూచునే
    ఇదినాకు
మదితోచకను పోయెనే

గిరికన్య శ్రీగౌరి
వరతనయలము మేము
గురితప్పి పోయినాదా
    ఆకొండ
గుణము తా మారినాదా?

కొనియాడ లేదన్న
కోపమున తాబోయి
కొండపొడుగున గూలెనే
    ఆకొండ
గుండె రాయిగ మారెనే

ఒరులు పోశక్యమా?
పరులు తేశక్యమా?
నను విడిచి యాకొండ
నల్లరాయై పోయె
యెంత చూచిన చూడదే
    ఆకొండ
ఎంత పిలిచిన పల్కదే.
AndhraBharati AMdhra bhArati - kavitalu - 1. AkoMDa - kAMchana vipaMchi - Kanchana Vipanchi - chAvali baMgAramma - Chavali Bangaramma geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )