కవితలు రుధిరజ్యోతి
శ్రీరంగం నారాయణబాబు
ఎవరికి తెలుసు
ఎవరికి తెలుసు
ఎందుకులే
అందరితో అనడం
ఆర్చేవా రున్నారా?
తీర్చేవా రున్నారా?
దొంగనిశ
అమావాస్య
అర్ధరాత్రి
గాఢనిద్ర
పెరట్లోను
చప్పుడవుతె
ఇరుగు పొరుగు
'లెండో' యని కేకవేయ
పాముచెవుల లోకం
వినబడలేదని వాదిస్తుంది!
కనబడలేదని గద్దిస్తుంది!
ఏకాకి
లోకానికి చెంద
ఆకలికే
ఓపలేక
ఊరంతా
పగలంతా
తిరగడం
రాతిరికి
శూన్యంగా
చెరువుగట్టు రావిచెట్టు
చేరుకునే
ఋషిపక్షి
భిక్షుకుడు!
కాటిసుంకం
లేకపోతే
నీటిలోన
పడిపోతే
తెప్పున తేలిపోతే
ఉదయాన్నే
చూచేందుకు
వచ్చిన లోకం
'కుఁయ్యో' మని ఏడుస్తుందా?
గలగల కన్నీరే కారుస్తుందా?
ఎవరికి తెలుసు?
ఎన్ని రెక్క లెగిరాయో!
ఎన్నిచుక్క లారాయో!
కన్నవార లున్నారా?
విన్నవార లున్నారా?
అనుకోకుండా
హఠాత్తుగా
అమాంతంగా
నా హృదయం
పురాణ బౌద్ధస్తూపం
మహాధ్యానం చేస్తూ
కూలిపోతే!!
AndhraBharati AMdhra bhArati - kavitalu - rudhirajyOti - evariki telusu - SrIraMgaM nArAyaNabAbu Srirangam Narayana babu Sriramgam NarayaNababu rudhira jyothi rudhirajyothi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )