కవితలు రుధిరజ్యోతి
శ్రీరంగం నారాయణబాబు
కదన కుతూహల రాగం
కదన కుతూహల రాగం
రుధిరజ్యోతిర్‌
జ్వలనా లలనా
ప్రియుండ!
విప్లవఋషిని
విద్రోహ కవిని
ఆహవరంగం నా
హృదంతరంగం
పగిలిన ఖలేజాలె
నా
పాటల జలేజాలు
మరఫిరంగినె
మహతిగ మీటి
కదన కుతూహల రాగం
వినిపిస్తాను
అగ్గిని కురిపిస్తాను
బ్రహ్మాండ భాండమ్మున
శేషుని కోరల
గరళం పిండి
గాలి పెదవుల
కమ్మని
తమ్మల మట్టుల
పూసేస్తాను
నీలి తావుల
చావు పూవులే
మొలిపిస్తాను
నిర్మల నభంపు
నీలపాళికల
వెన్నెల కత్తి
ఝళిపిస్తాను
నోరులేని తారలచే
కీలాలం కక్కిస్తాను
శంకరు శ్యామల
శంఖగళమ్మె
పూరిస్తాను
హాలాహలమె
బొట్టుగ కీలిస్తాను
మహాశక్తినై
మారణ మంత్రం
పారణ చేస్తూ
చివురించిన ఈ
జనాళి యుద్ధం
జైత్రరధమ్ముగ
కజ్జల కాళి
గజ్జల గుఱ్ఱం
కాల భుజంగం
కళ్ళెంలాగి
'ఛలో! ఛలో!' యని
సాగిపోయెదను.
AndhraBharati AMdhra bhArati - kavitalu - rudhirajyOti - kadana kutUhala rAgaM - SrIraMgaM nArAyaNabAbu Srirangam Narayana babu Sriramgam NarayaNababu rudhira jyothi rudhirajyothi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )