కవితలు రుధిరజ్యోతి
శ్రీరంగం నారాయణబాబు
మౌన శంఖం
మౌన శంఖం
[నారాయణబాబూ!
నీమౌనశంఖం
(శ్రీశ్రీ చదవగా)
విని
నీ పాదాభివందనం చేసి
నీ గుండెల్లో నా తలదాచి
నీ మాటల్లో నా వ్యధ డించి
నా ఆత్మ పక్కన నీ ఆత్మ కలిపి,
నీ నా పతంగి తాళ్ళు తెంపి
రూపాయలు మీద జల్లి
పోదామనుకున్నాను
వేళకు లేకపోయావు;
నుంగంబాకంలో ఆమెపక్కలోనో
అరవ ఆర్భాటం ఎదురుగుండానో
పందికొక్కు డొక్కలోనో
నీ అంతరాత్మ ఆలకించే ఉంటుంది.
        - రుక్మిణీనాథ]
కాడ్‌ లీవరాయిల్లో 'డీ' విటమి నుంటుంది
కోడిగుడ్లు ధాతుపుష్టి
కాకాతువ్వ తెలుపు; కోయిల నలుపు
ఆకాశం పొడవు; భూమి వెడల్పు
ఆకాశం ప్రవాళాధరం
అందుకొస్తే కదా!
నే పడుకొంటే
శరీరమంతా మెలికలు మెలికలై
'ఎవరు నీవు' అని అడుగుతుంది.
భూమంతా
మరకత పసిరికయై నా కాలు గోకి
'నీ వెవరు?' అని అడుగుతుంది.
గాలి భుజం తట్టి నీ వెవ రంటుంది
పొద్దున్న, సాయంత్రం.
ఆకాశం పలకమీద
ప్రకృతే వేస్తుంది
బ్రహ్మాండమైన
రెండు ప్రశ్నార్థకపు గుర్తులు
నీ వెవరు? నే నెవరని.
? ?
నీలగిరిలో పురుడు పోసుకుని
దాహం దాహం అంటూ మరణించిన
చూలాలి వక్షంలో గడ్డకట్టిన
చనుబాల జిడ్డును.
తాగి చనిపోయిన ఒక పుండాకోరుని
డాక్టరు శవపరీక్ష చేసినప్పుడు
అతని కడుపులో అరగకుండా
పైకి ఒలికిన సారా చుక్కను!
చూలాలై మృత శిశువుని కని
గుండెల్లో పాలే
పాముకాటులా బాధపెడితే,
ఒక యిల్లాలు
ఒక చీకటి రాత్రిలో వీధికాలువలో
కురిపించిన పాలవానను!
ఇంతకూ ఎవరైతేనేం?
రుక్మిణీ కల్యాణ తపస్సులో
కుటుంబచింతలో కలిశాం
నీవూ నేనూ
కత్తిపీటమీద కలిసిన
అరటిపండు, అరిసెలాగ
ఎన్నిమార్లు నీవు లెక్క పెట్టినా
నన్ను మరచినా నీవు
ఉన్నవాళ్ళం ఇద్దరం?
నీటికన్న రక్తం చిక్కన
కవులమైనా అన్నదమ్ములమైనా
గర్భశత్రువులమైనా
శ్రీశ్రీ నేనూ
సిరాబుడ్డిలో కలం ముంచితే
సిరాకు బదులు పాళీకి తగిలింది
ఒక సాలెపట్టు
దానిమధ్యన చచ్చిన సాలెపురుగు
పట్టులో సజీవంగా ఉన్న
రెండు మక్షికాలు సాక్షాత్కరిస్తే
పక్కనున్న శ్రీశ్రీని పిలిచి
'ఏమిట్రా తంబీ?' అన్నా
'సాలెపట్టులేదు. అదంతా కవితావ్యూహం
మక్షికాలు నీవూ నేనూ
పట్టులో చిక్కి చచ్చాం కామని
ఆకాశం చూరునుంచి సిరాబుడ్డిలో పడి
ఆత్మహత్య చేసుకొన్న కృశాస్త్రి
రెక్కలు తెగాయి కాబట్టి
డేకురుకుంటు పోదాం పద వీధిలోకి!'
వ్రాత అయిపోయింది
సిరా మిగిలిపోయింది
ఏం సాధన మన్నా!
'ఉంచు; నా మహాప్రస్థానంలోకి
వచ్చే మహారాజులకి
నీలి శాలువలల్లి కానుకలిస్తా
కాకపోతే
నీ నెత్తురు నల్లబడే దాకా నీవే త్రాగీ!
అప్పుడు వెలిగించు దీపం
ఈ మానవజాతికి నీవు ఎర్రదీపానివి
ప్లేగు వ్యాధికి కనిస్టీపువి'
అంత రోడు ఆవలిస్తే
ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు
తుమ్మితే
మూడు ఎలక్ట్రిక్‌ దీపాలు వెలిగాయి
లోపలికి ఒక దీర్ఘ నిశ్వాసం తీస్తే
అన్నీ మాయమయాయి
కాశ్మీర సరస్సులో పడవల్లాగు
కాలప్రవాహంలో కలరా శవాలు కొన్ని
'వీధులు ప్రమాదం, పరిగెడదాం పద
ఆ బయలులోకి' అన్నాడు
పరిగెట్టేం ఇద్దరం
అక్కడ గాలిలేదు వెలుతురులేదు
శూన్యంలేదు
సప్తసముద్రాలు జట్టుకట్టుకొని
జలతరంగిణి వాయిస్తున్నాయి
ఆకాశం చిరిగిపోయిన అరటిదొప్పలా
ఒక మూల పడివుంది
భూగోళ పఠంమీద
ఉల్లిపొర కాగితంలాగ
మృతించిన శేషుడు
భూమిని చుట్టుకొని ఉన్నాడు
వెలిసిన రంగు గుడ్డలు మంచీచెడ్డా
జండాలై ఎగురుతున్నాయి!
కులపర్వతాలు
గాలిలో విమానాల్లా
ఎగురుతున్నాయి
కుష్టురోగంతో కాళ్ళూ చేతులూ పడిపోతే
కిందపడి దొర్లుతూ ఏడుస్తున్న దేవేంద్రుడు
ఇంకిపోయిన అమృతభాండంలో
తడైనా తగుల్తుందేమోనని
వేళ్ళతో స్పృశిస్తున్న శచీదేవి
దేవేంద్రుని సింహాసనం మీద
కూర్చుని వజ్రాయుధం
తానొకప్పుడు కొండలను ఖండించిన
రెక్కలన్నింటిని పోగుచేసి
మరల పర్వత భుజాలకు
అంటిస్తున్నాది పేస్టుతో
గండభేరుండ పక్షులు కలరవాలు చేస్తుంటే
శ్రీశ్రీ పాడుదామన్నాడు
అటుపక్కనుంచి
మాసినబట్టల మాటల మూటలు
రేవులో తగులబెట్టుకొని ఏడుస్తూ
ఎదురుగుండా తోచిన
చాకలి సరస్వతిని చూసి
కోపంతో శ్రీశ్రీ తన్నేందుకు కాలుఎత్తి
మూగయై నిల్చున్నాడు.
'అయితేనేం పోతేనేం' అన్నా
'ఎంతో సరదాపడి
పరీబజారులో కొన్న పాఁతుఁ
జర్మను సాహిత్య కోమటిని
ప్రాధేయపడి తెచ్చిన వాల్‌ఖలేజ్‌
గురజాడ ప్రసాదించిన ముత్యాల సరం
హాప్కిన్సును అర్ధించి తెచ్చిన స్ప్రంగు రిదిమ్‌
అన్నీపోయా' యన్నాడు నత్తిగ
ఇక పాట ఎలాగు?
పక్కను పడివున్న శేషునికోర పెరికి
ఆడ గండభేరుండ పక్షిరెక్కమీద
డాలీ శ్రీశ్రీ రచించిన చిత్రపఠానికి
మా శ్రీనారాయణ బాబు తీసిన ఛాయాచిత్రం!
పఠం!
రెండు అస్థిపంజరాలు
అస్థిపంజరాలకు
అందం లింగభేదం అనవసరం
అయినా ఒకటి స్త్రీ అస్థిపంజరం
రెండవది మగవానిది.
స్త్రీ అస్థిపంజరం చేతిలో ఒకగులాబి అత్తరపుబుడ్డీ
మెడలో మెరిసిపోతున్న కోహినూరు వజ్రం!
పక్కను నిలబడిన మొగ అస్థిపంజరం ఏడుస్తూ
నల్లబడిన ఎముకలతో వేడెక్కిన ఎముకలతో
చేతిలో
వజ్ర వైడూర్యాలు పొదివిన
బంగారపు గునపంతో
తాజమహల్‌ తవ్వేస్తూ!
ఇంతలో ఒక ఆడ గండభేరుండ పక్షి
దగ్గరకువచ్చి
శ్రీశ్రీని ముక్కుతో అంకించుకొని
విమానంలా లేచిపోతూవుంటే
నేను ఎక్కడికన్నా
మాటలురాని మూగ శ్రీశ్రీ
ఒక హస్త విన్యాసం పట్టి
గరుడలోకానికని చూపించాడు
నాలోమాటల మరుపు ప్రారంభించింది
మరచిపోకుండా
మననం చేసుకుంటున్నా.
ఇంతలో
తొలినిశనుండి నేటివరకు
మానవజాతి కన్న కలల సిమెంటుతో
కట్టిన గోడల తాకి
కాలప్రవాహం ఘూర్ణిస్తున్నాది
కొంతసేపు కాలాంతంలోకి
కాళ్ళు చాపుకొని కూచున్నా
ఎల్లలు కలిసిపోతున్నాయి
దిక్‌భిత్తికలపెల్లలు రాలిపోతున్నాయి
లేచా!
రజతా చలం కనబడితే
ఎక్కా!
కొండలోయలో పూలతోట
చెట్లులేవు! అన్నీ పూవులే
ఉపనిషత్తులు తుమ్మెదలై
ఝంకారం చేస్తున్నాయి
పార్వతి నగ్నంగా నిలబడి
పూలు కోస్తున్నాది.
ఈశ్వరుడు నిద్రపోతున్నాడు
పార్వతీ దర్శనమయ్యేసరికి
నా బట్ట అంటుకున్నాది
నే కాలిపోతున్నాను
మూగనై నిలుచున్నా
దగ్గరగా ఒక మౌనశంఖం తోచింది
మౌనశంఖం స్పృశించా!
నాగుండె అంతా హంసయై
సోహం అని అరచింది!
నా చైతన్యమంతా
సప్తసముద్రాల సహస్రకోటి బాహువుల
మెరిసే నురుగై ఛుయ్యిమంది
నా ఎముకల మూలుగులో
చంద్రోదయమైంది
నా శరీరం
కాశ్యప భస్మరాశియై తరళించింది
నాప్రాణం భగీరధుడైంది-
నావెన్నెముకమీద
ఆకాశగంగా జలపాతం వర్షించింది
నా పొత్తికడుపు
హిమాచల తనయ
తన చల్లని మంచు హస్తాలతో నిమిరింది
రవం నీరవానికి Diminutive!!!
AndhraBharati AMdhra bhArati - kavitalu - rudhirajyOti - mauna SaMkhaM - SrIraMgaM nArAyaNabAbu Srirangam Narayana babu Sriramgam NarayaNababu rudhira jyothi rudhirajyothi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )