కవితలు రుధిరజ్యోతి
శ్రీరంగం నారాయణబాబు
ప్రేయసితో నరకానికి
ప్రేయసితో నరకానికి
(భారతి - మార్చి 1959)
రా!
నాతో నరకానికి
స్వాహావల్లభు
పూజించే
సోమయాజుల మాటలు
బ్రతుకె మరచి
బంభరములట్లు తిరుగు
భావకవుల పాటలు
విని మోసపోయిన
వనిత!
వనత!
నత!
స్వర్గం అంటూఉంటే
ఎపుడైనా చూడొచ్చు
నరకం ఇఖఎన్నాళ్ళో ఉండదట!
రా
నాతో నరకానికి
ప్రేయసీ!
నాతో నరకానికి
నీవే వస్తే
వైతరణిలో
ఫినైల్‌ వర్షం
కురిపిస్తా
డిడిటి పౌడరుతో
సికతాతలాల
ఘంటాపథాలు వేయించి
ఊరేగించి
స్వైర విహారం చేయిస్తా
గట్లమీద యూకలిప్టస్‌
పాదపాలు నాటించి
వనమహోత్సవం
చేయిస్తా
కర్పూర తైలంతో
కాళ్లు కడిగి
నీళ్ళు మస్తకాన
జల్లుకుంటా
నెలకు
వజ్రానికి
వంక ఎన్నిన
కవులు
కంపుకు తలవంపులు
లేకుండా చేయగలర?
పాపాత్ములు
పయనించేందుకు
పడవలు; క్షీరపుకడవలు
గోవుల
తోకలు తెగకోసి
పాలుపితికి
కాఫీ కలిపిస్తా
కఫస్తంభాన్నే
కాప్‌స్టన్‌ సిగరెట్టుగ
వెలిగిస్తా
నా ఈ ప్రాసక్రీడలకే
స్వస్తి చెప్పి
నురుగు గ్రక్కి మరుగుతున్న
నూనెలోన
రాసక్రీడలు చేయిస్తా
చిత్రగుప్తుని
చిట్టాలన్నీ చింపి
పత్రాలు పకోడీల సుబ్బయ్య
పొట్లాలకు యిస్తా
యముని మహిషానికి
ఏరుపూసి
బంజరు భూములు దున్నించి
పంటలు పండిస్తా.
లే! పద! వేళై పోతున్నది
వనితా వనతానతానన!
అనర్ధం
స్వార్ధం
నాకం!
పరార్థం
యథార్థం
నరకం!!
AndhraBharati AMdhra bhArati - kavitalu - rudhirajyOti - prEyasitO narakAniki - SrIraMgaM nArAyaNabAbu Srirangam Narayana babu Sriramgam NarayaNababu rudhira jyothi rudhirajyothi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )