కవితలు రుధిరజ్యోతి
శ్రీరంగం నారాయణబాబు
ప్రస్తావన

ఆధునిక కవితను, భావ, వాస్తవిక కవిత్వాలని రెండు విధాలుగా విభజించి మనం చెప్పుకొన వచ్చును. భావ కవులలో రాయప్రోలు, దేవులపల్లి మున్నగు కవులు శిష్టులు. ద్వితీయ వర్గమునకు చెందిన కవులలో శ్రీశ్రీ ప్రభృతులు విశిష్టులు. ఇట్టి విశిష్టులలో శ్రీ శ్రీరంగం నారాయణబాబు ఒకరు. తెలుగునాట కవిగా బ్రతుకుతూ, ఖ్యాతి నార్జించిన వాస్తవికుడు. ఆయన రచించిన గీతాలకు, రుధిరజ్యోతి అని నామకరణం చేసుకున్నాడు.

శ్రీశ్రీ పేరు వినగానే, నారాయణబాబు, నారాయణబాబు పేరు వింటే శ్రీశ్రీ మనకు చటుక్కున స్ఫురిస్తారు. దీనికి కారణం ఏమయినా, వీరి కవిత్వపు పోకడలు మాత్రం వేర్వేరు. స్వీకరించిన కవితా వస్తువు ఒక్కొక్కచో ఒకటే కావచ్చును. కాని వారు దర్శించే పద్ధతులు, వ్యక్తీకరించే రీతులు మాత్రం విభిన్నములు. ఇందులో ఇరువురికీ ఏమాత్రం పోలికలు కనిపించవు. ఉద్రేకజనితాలయిన శక్తులు, స్వీకరించిన దృక్పథం విభిన్నాలు. పరిగ్రహించిన అలంకారాలలో, శబ్ద ప్రయోగంలో ఎవరిత్రోవ వారిది, ఎవరిపోకడ వారిది. శ్రీశ్రీ స్థూల దృష్టికికూడా దొరుకుతాడు. నారాయణబాబు కొన్ని తావులలో సూక్ష్మదృష్టికి వినా స్పష్టంకాడు. నోటికి పట్టే ఛందస్సులతో శ్రీశ్రీ పరుగులు తీస్తాడు. తన లక్ష్యాన్ని ప్రత్యక్ష పద్ధతిని వ్యక్తం చేస్తాడు. నారాయణబాబు పరుగులో శ్రీశ్రీకి గల ఉద్వేగం లేదు. అతనిది పరోక్ష పద్ధతి. ఇద్దరూ పాశ్చాత్య కవితాసంప్రదాయాలను మననం చేసుకొనినవారే. కాని భారత సంప్రదాయం నారాయణబాబు కవితలో చక్కగా జాలువారుతూ వుంటుంది.

పాశ్చాత్య దేశాలలో, పారిశ్రామిక విప్లవానంతరం, కవితారంగంలో కొన్ని వినూత్న పరిణామాలు జనించాయి. ఈ ప్రభావం, ఆంధ్ర సాహిత్యంపై ప్రసరించక పోలేదు. అంతటితో, వస్తువుకు గల ఇతఃపూర్వమున్న విలువలు తారుమారు కాజొచ్చాయి. వ్యక్తి ప్రధానమైన వాదమొకవంకను సంఘ ప్రధానమైన వాదము మరియొక ప్రక్కను నిరంతర సంఘర్షణతో, అపూర్వ కావ్య సృష్టికి కారణ భూతములయాయి. సామాన్య మానవుని అనునిత్యం వేధిస్తున్న ఆకలి, నిరుద్యోగం, అకాలమరణం, మొదలుగా గల సమస్యలకొక వ్యక్తీకరణ అవసర మొచ్చింది. ఈ దృష్ట్యా, వ్యక్తి ప్రధానవాదులు మానవునకు సంతృప్తి నీయలేక పోయారు. వాస్తవిక పరిస్థితులనుంచి తప్పించుకు తిరుగుతూ జీవితాని కతీతంగా, ఇసుకలో తలదూర్చిన ఉష్ట్ర పక్షులకు మల్లే, కవితాగానం చేస్తారని, ఆ పద్ధతి పరిత్యాజ్యమని, వాస్తవికవాదుల మతం. ఎవరు ఏమి చెప్పినా 'అత్మాశ్రయ కవుల'లో ఒక విశిష్టత లేకపోలేదు. మానవ జీవితాన్ని అనేక దృక్కోణాలనుంచి దర్శించ వచ్చును. అందులో భావ కవుల పద్ధతి ఒకటి. ప్రకృతిలోగల రామణీయకతను, ప్రణయ మాధుర్యమును, ప్రేమ మహత్తును, భావ కవిత్వం రసమయం చేస్తుంది. అయితే ఇదీ పాక్షికమైనదే కాని సమగ్రమైనది కాదు. జీవితం ఒక గనివంటిదే అయితే, అందులో ఒకమూలను మాత్రమే ఇది స్పృశిస్తున్నది. కాని అదే సర్వస్వ మనుకొని, జీవిత పరిశోధన ముగించు కోవడం, అనాదరణీయం. కావ్య వస్తువులో వైవిధ్యం లేకపోవడం, వున్నది పునరుక్తి దోషమునకు గురికావడం, విముఖతను కలిగిస్తుంది; విసుగు పుట్టిస్తుంది. ఈ విముఖతపట్ల విముఖతా ఫలితమే వాస్తవికవాద జననం. భావకవితకిది ప్రతిచర్య, ఇంతటితో మాత్రమే ఆగిపోక, సమాజంలోని క్రౌర్యం, కౌటిల్యం, వ్యగ్రత, జీవితంలోని అనునిత్య సమస్యలను వాస్తవికవాదులు గ్రహించగలిగారు. మానవుణ్ణి కలవరపెట్టే ప్రతీ విషయము, వారి కవితా వస్తువులు కావాలనే తహతహ జనించింది. అయితే ఇది మాత్రం పాక్షికదృష్టి దాకా అని ఎవరైనా ప్రశ్నిస్తే 'అవున'నే సమాధానం.

ఒకే వస్తువును సందర్శించిన, భావ కవులొక పద్ధతిని వాస్తవికులు మరి ఒక పద్ధతిని అవలంబించి, తమ భావాల నభివ్యక్తం చేస్తారు. దీనికి తెనుగు కవితనుంచి ఒక ఉదాహరణ నిస్తున్నాను. రాత్రి, ఆకాశంలో మెరసే నక్షత్రాలు కృష్ణశాస్త్రిగారికొక రీతిగాను, నారాయణబాబుకు మరిఒక రీతిని స్ఫురించాయి. అందుకే శ్రీశాస్త్రిగారు -

    "నింగి మూలల
    నీలి పందిళ్ళు వైచి
    వింత చిరుమల్లెతోట
    వేయించినాను."

అనేటప్పుడు వారి భావన సముజ్జ్వలమే. మరి దీనినె నారాయణబాబు ఉత్ప్రేక్షించిన విధం గమనించండి -

    "నల్లని త్రాచు కోరలు
    తెల్లని మశూచి కుండలు
    గగనమ్మున చుక్కలు."

లోకంలో ఎటు పరికించినా, బీభత్సమే కనిపిస్తున్న కవికి ఆకాశంలో చుక్కలు ఆనందాన్నీయవు. నక్షత్రాలొకేసారి త్రాచు కోరలవలె మశూచి కుండలవలె భయంకరంగా గోచరించడం కవికి సహజం. లోకంలో విశ్వమానవ కల్యాణం, విశ్వశాంతి నెలకొల్ప బడాలని, జీవితం మంగళప్రదం కావాలని అతి ప్రాచీన కాలంనుంచీ, కవులంతా వాంఛిస్తూనే వున్నారు. కావ్యాలలోని వస్తువులను మంగళ ప్రదాలుగా భావించి మంగళాంతం చేసినంత మాత్రాన ఇది సిద్ధించదు. కంటికి కనిపించేదంతా బాగానే వున్నదనుకొని అందులోని చెడుగును తలపెట్టక, మంచిని మాత్రమే అభివర్ణించితే అది దోషమే. చెడుగును గ్రహించి, దానిని ఎదిర్చి, చూపాలి. జీవితంలో కాఠిన్యమును బయట పెడుతున్నప్పుడు, బీభత్సతను స్ఫురించే పై గీతాలవంటివి రచియింపక తప్పదు. మాలిన్యాన్ని కప్పిపుచ్చు కోవడంలో, అది మటుమాయం కాదు. దానిని బహిర్గతం కావించాలి. వస్తువును సామాజిక విమర్శనా దృష్టితో తరచి తరచి చూడవలసి వుంటుంది. సమాజాన్ని ఎక్కడి కక్కడ విమర్శించడం, వాస్తవికవాద లక్షణం.

ఈ లక్షణం నారాయణబాబు కవిత్వంలో ప్రస్ఫుటం. భావకవిత్వంపై తిరుగుబాటు, వస్తు వ్యాకరణాలతో ఆగక, విప్లవ పథాలను పడుతుంది. రీతిలోను వస్తువులోను సరిక్రొత్తదనం కనిపిస్తుంది. ఎవరూ చెప్పని పద్ధతిని చెప్పడం అతనికి సరదా. 'ఇమేజిస్టు' కవితకు ఇతను ప్రాణం పోస్తాడు. శబ్దార్థాలతో కుదించి సొగసైన విగ్రహాలను నిర్మించే శిల్పి. క్లుప్తత ఇతని పద్ధతి. ఒకమాటలో చెప్పవలసినది పదిమాటలలో చెప్పడు. పది మాటలలో చెప్పవలసినది ఒకమాటలో చెప్తాడు. ఈ శిల్పం సాధారణులకు అలవడేదికాదు. పరిపూర్ణాకృతిలో అతని వర్ణ్యమాన వస్తువులు కనుల ఎదుట మసులుతాయి. 'దేశమాత' అనే గీతంలో -

    "ఎండాకాలం
    ఎండాకాలం
    పగళ్ళు నెగళ్ళు
    మండే రోడ్డు
    పన్నెండు గంటలు
    కాలం
    కాలిన గుడ్డ పీలికై
    ధూళి రేగినది."

గ్రీష్మర్తువు తీక్ష్ణత 'పగళ్ళు నెగళ్ళు'గా కవి చెప్పడంలో బలంగా వ్యక్తమవుతున్నది. కాలం కాలిన గుడ్డపీలికై ధూళిరేగడంతో, వర్ణన ఉజ్జ్వలవంతం. అలాగే -

    "కరువే రూపందాల్చి
    కడుపే చెరువై ఏడ్చె"

అనేచోట బిచ్చగత్తె దీనావస్థ తెనుగు నుడికారంలో ప్రతిబింబితం. ఎండ ప్రచండంగా కాస్తున్నప్పుడు తలుపులు బిగించుకుని భవంతుల మధ్య నివసిస్తున్న వారికీ దీనాలాపం వినిపించదు. ఎండకు మాడి పాపం, ఆమె -

    "అసువులువీడి
    చచ్చిన దేశమాతయై
    చాప చుట్టగ
    నేలకు వ్రాలింది."

కాని ఆర్చేవారూ తీర్చేవారూ కనిపించరు. తమ జాతికి చెందిన బిచ్చగత్తెను చూసి మానవులకే జాలి కలుగని సాంఘిక వాతావరణ మేర్పడింది. 'వీధికాలువ' బురదనీటిలో శ్రమించిన శ్వనాథుడొక్కడు నిట్టూర్పుతో వాపోతాడు. అలాగే ఋషిపక్షి, గాడిద కరుణను ప్రకటిస్తాయి. ఇక్కడ శ్వనాథ శబ్ద ప్రయోగం సాభిప్రాయం. మనుష్యులచే నీచంగా చూడబడే కుక్క, మనిషి చనిపోయి పడి ఉన్నప్పుడు సంతప్త హృదయంతో వుండడం. అందుకే గౌరవవాచకమైన శ్వనాథ ప్రయోగం. ఇలాగే మరొకచోట గార్ధభస్వామి అనే ప్రయోగం కనిపిస్తుంది. సామాన్యురాలైన బిచ్చగత్తెను కవి దేశమాతగ దర్శిస్తాడు. 'ఆకలి దీర్పని మానం కప్పని దేశంకోసం, మట్టిప్రమిదలో వత్తయికాలిందీ, మానిని ఈనాడు' అని సాధారణీకృతిని కావిస్తాడు. కవితోపాటు మనం కూడా నిట్టూర్చుతాము. తెలుగువారి సంప్రదాయాలను, ఆచారాలను, ప్రకృతి సహజ దృశ్యాలను చూస్తూ, వాటిలో వ్యక్తం చేస్తాడు. తెలుగునాట కనిపించే పేదవారి దుస్థితిని తెనుగు రాత్రిలో వర్ణిస్తున్నాడు.

    "పేదవాని కడుపుమంట
    కాలి పేలిపోవు కోర్కె
    గగనమ్మున చుక్క"

వలె కవికి స్ఫురించింది. చిన్నతనం లోనే గర్భిణి అయి, శక్తి సన్నగిల్లిన తెలుగు పడుచు 'చేతిగాజు'వలె 'నెలవంక' కనిపించింది. 'శస్త్రమ్మట్టు, బిలుకుమార్ప' మాసిపోని గాజుముక్క నెలవంక, సంఘంవంక! సంఘంకేసి చూడడమేకాక, పగదీర్చుకునే శస్త్రం వలె కనిపిస్తున్నది. సమాజంలో ఎంతటి తీవ్రాందోళన చెలరేగినా బాల వితంతువుల దుస్థితి నేటికికూడా మారలేదు. ఈ దురన్యాయ సాంఘిక విధానాన్నే పురస్కరించుకొని కవి 'పసితనమున పెండ్లి, భర్త పరమపదముచేర, విధవ మసక మసక యవ్వనమున కుసుమించే తల్లి తలపు, గుండెల్లో పాలపాట, ఆకాశపు పాలబాట'గా పాడిన ఈ చరణాలు తెలుగు కవితకొక పాలబాట. నారాయణబాబు కవనం మన్ను నుండి మానవులను సృష్టిస్తుంది. ఈవింత సృష్టికి, భారతీయ పౌరాణికదృష్టి కవికి బలమిచ్చింది. పౌరాణిక ఇతివృత్తాలతో సంప్రదాయపు మెలకువలను ఆకళించుకుని, పఠితకు కవితను ఆస్వాదయోగ్యం కావిస్తాడు. ఒక్కొక్కసారి శరీరం జలదరింపచేసే మెరుపులు కురిపిస్తాడు. శబ్దం కొత్త పలుకుబడితో ధ్వనిస్తుంది. ఈ దృష్టితో రచించిన అతని గేయావళిలో కపాల మోక్షం, ఎన్నదగినది, భగత్సింగు దేశభక్తుడు; వీరుడు. అతనిని ఉరితీసే ఘట్టం భారతీయ చరిత్రలో మరుద్దామన్నా మరుపుకురానిది. ఈ దుస్స్వప్నం కవిని కలవర పెట్టింది. విషాద సంఘటనను వీరరస ప్రధానం గావించి భగత్సింగును పౌరాణిక వీరుల కులపతిగా కీర్తిస్తాడు. అడుగడుగునా ఆవేశం, తొణికిసలాడుతుంది. ఆదిశంకరుడు తపస్సమాధినుంచి చైతన్యావస్థను పొందుతాడు. తిరిపెమెత్తుకునేందు కతనికి కపాలం కావలసి వచ్చింది. 'ఫాలాక్షుని, హస్తాలలో పడేభాగ్యం యే కపాలానికి పడుతుంది?

    తురకల గోరీలందున
    క్రైస్తవుల సమాధులందున
    హిందూ శ్మశాన వాటుల
    కపాలములు
    వికవిక నవ్వినవి
    పునుకలు
    పులకరించినవి
    కంకాళమ్ములు
    ఘల్లున మ్రోగినవి'

కాని శివుని హస్తస్పర్శ భగత్సింగ్‌ కపాలానికి తప్ప, ఇతరుల కెలా లభిస్తుంది? దేశభక్తుని కపాలం త్రినేత్రుని హస్తయుగళిని చేరుతుంది. అప్పుడు -

    "శేషుని ఫణాల మెత్తని శయ్య
    పుడమి ఒత్తిగిలింది.
    ఎడారి పుష్పించింది!

    అండ పిండ బ్రహ్మాండమంతయు
    తాండవనృత్యం చేసింది

    ఎందరు పుట్టలేదు
    ఇంకెందరు గిట్టలేదు
    అందరికీ లభియిస్తుందా
    హాలాహల మంటిన
    హస్తస్పర్శ!
    పెదవుల చుంబనం!
    కపాలమోక్షం!
    కపాలమోక్షం!!"

భగత్సింగ్‌వంటి యోధానుయోధుల జీవితం ఉదాతం చేస్తున్నపుడీ పద్ధతి పౌరాణిక సంప్రదాయం కవికి అత్యవసరం, ఇతనిరీతి విచిత్రమైనది. దేనినీ వాచ్యం చేయడు; ధ్వనిస్తాడు. వ్యంగ్య వైభవోపేతమైన పంక్తులన్నీ అమృతపేశలమే. పూర్వగాథలను భావంతో పొదుగుతూ నాటి ఛాయలమధ్య రసోదయం కావిస్తాడు. ఆ పౌరాణిక కథలను అవగాహన చేసుకుని, వానిని కవి, తన యితివృత్తానికెలా అన్వయించుకుంటున్నాడో గ్రహించిన పాఠకునికి నారాయణబాబు గీతం మరీ హృదయంగమమవుతుంది. 'గడ్డిపరక' అనే గీతంలో ఈ సూత్ర రచన అంతటా కనిపిస్తుంది. సమాజంలో పతితులై పడియున్న పేదలకు ప్రతినిధిగా 'గడ్డిపరక' గొంతును వినిపిస్తుంది. పేదలు, వారి జీవితాలపై సాగిపోతున్న ధనికులు, వీరి సంఘర్షణను మధురంగా చిత్రిస్తాడు. నిత్యం మనకాళ్ళ క్రిందపడి నలిగిపోతున్న 'గడ్డిపరక' ఏమంటుందో చూడండి -

    "పల్లకీ దిగినట్టి
    పెళ్ళికొడుకులు మీరు
    పట్టుతివాసీని నేను
    నడవండి, నడవండి!
    నామీంచి నడవండి!!"

అంటూ తాను 'పశువుల నోటికి పాయసాన్నని' చెప్పుకుంటుంది. కాని నిజానికి తన ఆత్మశక్తిని అది గ్రహించు కుంటుంది. 'మాతృవర్గం వాడు, మా అన్న పన్నగమ్ముల రసన లుత్తరించిన మిన్న' అని, గరుత్మంతుని కథాకథనం కావిస్తుంది. పన్నగాల నాలుక లుత్తరించిన విధంగా మీ నాలుకలు తెగకోస్తానని ధ్వని. అంత మాత్రంతో ఊరుకోక, 'మీకు ఉత్తమగతులు కల్పిస్తున్నానని' కూడా చాటుకుంటుంది. ఇంతటితో మానవుడూరుకొన వచ్చుకదా! ఇంక గడ్డిపరకను కాళ్ళక్రింద అణచి పెడుతున్నాడు.

    "నేటికి మీ పితృకార్యంనాడు
    పారణమీద మీ చేతిమీద
    మరకత
    అంగుళీకమ్ము!"

ఇంత సగర్వంగా అత్మాభిమానాన్ని ప్రకటించుకుంటున్నా మనిషి ఊరుకోడు. కనుకనే మిన్ను విప్పిన రక్తపతాకం, గడ్డిపరక పుట్టిన మన్ను సత్తువ తెలపగా 'కాకాసురుని కథ' జ్ఞప్తికిరాగా, 'ఆగండి ఆగండి' అని హెచ్చరిస్తుంది. సాధారణమైన గడ్డిపరకను చూసి వర్గ సంఘర్షణ నూహించడమేగాక గరుత్మంతుని కథ, కాకాసురుని కథ, పారణమీద పితృకార్యంనాటి సంప్రదాయము భావించి వానిని కవి వాడుకుంటున్న విధం ఎంతో గొప్పగా వుంది. సంప్రదాయాన్ని మరచిన రచనను నారాయణబాబు చేపట్టడు. ఈ సుగుణమే కవితకు క్లాసికల్‌ స్వభావాన్ని ప్రసాదిస్తుంది.

బీభత్స, వీర రస ప్రధానాలయిన రచనలనే కాక కొన్ని గీతాలలో హాస్యోక్తి, చమత్కృతులతో కవి వస్తువును విస్తరిస్తాడు.

కవిత్వాన్ని, సంఘాన్ని విమర్శిస్తూ తన కవితా పటిమను ప్రదర్శిస్తాడు. ఈ ప్రదర్శనలలో ఫ్రెంచి, ఆంగ్ల సంప్రదాయాల ప్రభావం కనిపిస్తుంది. 'ఊరవతల' అనే కావ్యం ఇందు కుదాహరణ. భావకవిత్వపు పోకడలమీద, ఫాషన్లమీద ఇది ఒక యెదురుదాడి.

    "కలల పొదరిళ్ళలో
    సౌఖ్యంపు నిదురలో
    కనిపించి
    ఒక తన్వి
    మేనక నా పేరు
    మేఘాలకు వెనుక ప్రక్క
    మా ఊరని మాయమయ్యె

    చిరునామా తెలిసికూడ
    చేసేదేమీ లేక
    ఊహాగానం శాయగ
    ఊరవతల కెళ్ళాను."

ప్రకృతిలో స్థూలచక్షువులకు కనిపించే రమణీయ దృశ్యాలు ఈ కవికి సౌందర్యా న్నందీయవు. అందరకుమల్లే సౌందర్యగానం చేయడు. అతని దృష్టి వేరొక విధమైనది. ఉదయ సంధ్యతో కూడిన ఆకాశం. నోరు తెరచిన కాకిపిల్ల. ఏ మూలనుంచో అరచే కాకిపిల్ల ఆకలి అరుపులు, ఆకాశం ఘోషిస్తున్నట్లే కవి భావిస్తాడు. ఈ పద్ధతి రచనను పాశ్చాత్యులు ఇమేజిస్టు పొయిట్రీగా పేర్కొంటారు. ఈ కృతి అట్టి పోకడ రచనకు తలమానికం. ఇందులో కవి భావించినవన్నీ దుశ్శకునాలే. ఇనోదయం పాముకాటుగాను, భూమికి శివజ్వరం, ఎదుట నీడనీయలేని మ్రోడు మ్రానులజంట. వెంటనే మృత్యువును జ్ఞప్తికితెస్తూ, యముని దింపివచ్చిన ఎనుబోతు, ఇవన్నీ కవి భావనలు. మరొక అడుగు వేయగా, కనిపించేవే గాక, వినిపించేవి సహితం దుశ్శకునాలే.

    "ప్రేతలతో
    ఇల్లట్టుల
    బూరుగ వృక్షంమీద
    కళ్ళజోడు పెట్టుకున్న
    గరుడ పురాణ బ్రాహ్మడు
    కంఠమెత్తె ఘూకమ్ము!"

మనిషి మరణించగా, బాధోపశమనార్ధం గరుడ పురాణ పఠనం కావించడం హైందవ సంప్రదాయం. అలాగే కవికి

    "కాటకంపు తాటకిలా
    ఊరుబయట మిల్లు"

కనిపించి 'విశ్వకర్త హృదయంలో దుస్వప్నంలా భుగభుగమను పొగగొట్టం' పొగలు చిమ్ముతున్నది. ఈ దుస్వప్నపు ఫలితమే ప్రకృతి కవికి దుశ్శకునాల మయంగా కనిపించడానికి హేతువు. మిల్లులలో ఉత్పత్తి సాగుతున్నా, ఆ సంపద ప్రజలపరం కాలేదు; సరికదా, ఆకలికి నిరుద్యోగానికి కారకమై, మానవులను యంత్రాల పగిదిగ మారుస్తున్నది. ఈ యాంత్రిక స్వభావం, జీవితంలోని రక్తం పీల్చి పిప్పిచేసి అవతలకు నెట్టి వేస్తున్నది. అందుకే కాబోలును, మిల్లు దరినున్న ఎండిన సెలయేరును కవి ఉత్ప్రేక్షిస్తున్నాడు.

    "జీవనమ్మె తీసినారు
    జలమంతా మిల్లుకెత్త
    పాడలేని గులకరాళ్ళ
    పాతవడ్డ సెలయేరు"

ఈ సెలయేరు ఒకప్పుడు గలగల నవ్వేది. ఆ నవ్వు 'జలమంతా మిల్లు కెత్తిన' కారణంగా ఇంకిపోతుంది.

    "పోయిన ఆ యేటినవ్వె
    పుక్కిట నెమరేసుకుంటు
    గండశిల నీడలోన
    కనుమోడ్చెను
    గార్దభస్వామి!!!"

గతించిన వైభవమంతా నేడు మానవుడు తలచుకొని కనుమోడ్చిన గార్ధభంవలె భరిస్తున్నాడే కాని, కారణాల నన్వేషించుకొనడు. సంఘాని కెంతో ఉపకార హేతు వవుతున్న గార్ధభం మానవ దృష్టిలో అతిచులకన. కాని ఈ చులకనను క్షమిస్తున్న దాని సహనశక్తి స్థాణురూపమైన దేవునకుండే ఓర్పువంటిది. కనుకనే మామూలు 'గార్ధభం' గార్ధభస్వామిగా కవికి గోచరించింది. పుక్కిట నెమరువేసుకొనే గుణం దానికి సహజ సిద్ధమైనదికాదు. కాని పాత తలంపులను తిరగపోసుకునే స్వభావా న్నారోపించి, దాని నోటి నురగను పాతవడ్డ సెలయేటి నవ్వు నురగతో కవి ఉపమిస్తున్నాడు. మీద నుదాహృతమైన గీతం ఇమేజిస్టు కవిత కొక అలంకరణ. ఆధునికాంధ్ర సాహిత్యాని కొక శిఖరం. పాశ్చాత్యపు కవు లిట్టి పోకడల పోహళించిన రచనను కనుల కద్దు కుంటారు.

    "బ్రహ్మచెముడు
    కంచెమధ్య
    పూర్ణిమ సంధ్యల్లోన
    ఘడియైనా ఉదయాద్రిని
    రుధిరజ్యోతై వెలిగే
    జాబిల్లి!
    మృతశరీర
    ఆక్రమణ
    ఘటాకాశ
    అరుణారుణ
    రక్త సిక్త-
    మోముతోడ
    'మా అమ్మె చంపింది!
    మా అమ్మె చంపింద'ను
    మౌనముగ
    గాజుకళ్ళ
    పురిటిపిల్ల!"

హఠాత్తుగా కనిపించే, త్రోవను నడిచేవారిని నిలబెట్టి ఆశ్చర్యపరుస్తుంది; శరీరం జలదరింప చేస్తుంది. ఆకాశంలో అపుడే ఉదయించే చంద్రుని ఎర్రని మోమువలె, కుండలో నిక్షేపించబడిన శిశువు మోము పాలిపోయి కనిపిస్తుంది. కవికి దారిపొడుగునా, తననీడ, వెంటాడే మృత్యువువలె భయంకర మవుతుంది. ఈ గీతం కాలజ్ఞానులకు కత్తి పదును వంటిది. జీవితం సుఖమయం కావాలని మానవుని ఈప్సితం: జీవితంలో చెడుగు లేదనుకుని, సర్వత్ర మోదాన్నే భావించి కీర్తించడం వల్ల ఈ మనోరథం సఫలీకృతం కాదు. ఉన్న ఖేదాన్ని ఉన్నదని అంగీకరించి, ఎదుర్కొని, బయటకు నెట్టి, జీవితం మోదమయం చేసుకోవాలి. ఇదే వాస్తవిక దృష్టి. వస్తువులో చెడుగును పరిహరించి, మంచిని నిర్మించే వారిని విలియం జేమ్స్‌ అనే అమెరికన్‌ మేధావి twice born అని పేర్కొన్నాడు.

మానవు డనేక రాగద్వేష సహితుడు, జీవికి, శారీరక మానసిక వాంఛలు నెరవేరనిదే సంతృప్తిలేదు. ఈ వాంఛ లనేకం. ఆకలి ఒకటే కాక, అది కాస్త తీరగానే సుఖమైన నిద్ర కావాలి.

నిద్రనుంచి లేవగానే, ఆనందమిచ్చే వస్తుసముదాయ మవసరం. దుఃఖం, కామోద్రేకం ఇవన్నీ సహజాలే. ప్రకృతి పుట్టినదాదిగా ప్రాణి జీవితంలో ఈ లైంగిక సంబంధాలు మరింత బలపడుతూ వచ్చాయి. మతంలో, మతోత్సవాలలో, దేవాలయాల శిల్పాలలో పిండివంటలలో దీని ప్రభావం ప్రతిబింబిత మవుతున్నది. ఈ కామేచ్ఛను మొగ్గలోనే త్రుంచి, అణచిపెట్టడం మానసికారోగ్యాన్ని చెడగొడుతుంది. ప్రబల మైన ఈ శక్తిని ఇతర మార్గాలలోనికి మళ్ళించినపుడు జీవిత సౌధం చక్కగా నిర్మింపబడుతుంది. నిగ్రహం నిగ్రహం కోసమేనని దీనిని అణచ బూనడం ప్రమాదం. ప్రయోజనంతో ఇతర కార్యాలలో దీనిని వ్యక్తం చేయాలి. అప్పుడే అట్టి నిగ్రహం అర్థవంత మవుతుంది. ఈ దృష్టి లోపించిన వారికి, కవి ప్రకృతి అంతా సెక్సుమయంగా గోచరింప చేస్తున్నాడు. 'లెండోయ్‌ ఋషులు' అనే గీతం మెరుపు యుద్ధంవంటిది.

    "కనురెప్పల సెజ్జమీద
    కళ్లజోడు ముక్కుతోడ
    వ్యభిచరించె!
    నట్టింట్లో చిల్లుపడిన
    మజ్జిగకుండ, కవ్వం
    చీకటితప్పే చేశాయి!"

ఈ లైంగికేచ్ఛ ఇంత ప్రబలంగా పెనవేసుకు పోతున్నప్పుడు అట్టిది సహజం కాదని చూపులకు మడిగట్టుకోవడం వాస్తవికతకు దూరమేకదా.

    "కుళ్ళిపోయిన కూరగాయలు
    కునికిపాట్లు పడుతుంటే
    టమాటాపండు మాంసంముక్క
    కలసి అఖండ
    సంధ్యారాజ్యం చేస్తున్నాయి!"

అనేదికూడా కాచుకోలేని ఎదురుదెబ్బ. ప్రకృతిలో లైంగిక సంబంధాలు అసహజవాంఛలకు హేతువులనీ; వాటిని పరిత్యజించడమే ధర్మమని బోధించేవారిని -

    "ఈ సముద్రం తీసికెళ్ళి అవతల పారపొయ్యండి!
    ఆపోశనం పట్టండి!
    పత్తిగింజలు చుక్కలు, గోళ్ళతో నొక్కండి
    సుర విలాసవతులు చూచుకొనే
    అద్దం, చంద్రుని బద్దలకొట్టండి"

అని హాస్యం చేస్తున్నాడు, పైవన్నీ ఎంత వీలుకానివో, సెక్సుని అణచడం కూడా అట్టిదేనని కవి తాత్పర్యం.

ఇతను రచించిన గీతాలలో, 'విశాఖపట్టణం' అనేది పేర్కొన దగినది. వచనంలా కాక, వచన ధోరణిలో నడచిన గీతం. ఇమేజిజము, సామాజిక విమర్శనతోపాటు ప్రస్ఫుట మవుతుంది.

    "ప్రేమకు ప్రాణాలిచ్చే స్త్రీలు
    ఉరికొయ్యల్లాంటి మగాళ్ళు

    ... ... ...

    గుమస్తాలంతా గుల్లగాళ్ళు
    బీదవాళ్ల నెత్తురు
    బీరులాగ తాగేస్తారు

    ... ... ...

    ధర్మాన్ని పశువునిచేసి
    పట్టపగలు కోర్టులోన
    వధచేసి, సాయంత్రం
    సురాపానంలో చప్పరించి
    నంచుకుంద్రు"

అనే ఈ పంక్తుల మాధుర్యం ఎనలేనిది. ఇది ఆధునిక స్థలపురాణం.

    "నగ్నంగా స్త్రీ స్నానం చేసేటప్పుడు
    ఎదురుగుండా పరాయి మొగాడు
    ఏరాడకొండ
    ఆలీబాబా అబ్ధి"

పాశ్చాత్య కవితలోని ఆధునికత నారాయణబాబు పుణికి పుచ్చుకున్నాడు. దీనికి మనసంప్రదాయం రంగరించుకున్నాడు. నిష్పక్షపాత దృష్టితో విమర్శించే వారికి ఈ కవిత్వం ఆహ్లాదం కలిగించక మానదు. శబ్దాడంబరం కోసం వెతికేవారికి ఈ కవనం తృప్తినీయదు. కవిత్వంలో రెటరిక్కు వుండడం సల్లక్షణమని ఆంగ్లేయ విమర్శకు లంగీకరించరు. బైరన్‌లో రెటరిక్కు అనే దోషం వున్నదని వారంటారు. సంస్కృతాది హైందవ భాషలలోను, లాటిన్‌, తత్సంబంధ భాషలలోను ఈ రెటరిక్కును తప్పించుకొని కవనమల్లడం కష్టం. సభావేదికల మీద నుంచి వినిపించే ఉపన్యాస ధోరణి, కవిత్వం చెప్పేవారికి విసర్జనీయం. ఉపన్యాసం మంచి కవిత్వ పద్ధతికాదు. అందుకే ఒక ఆంగ్లేయ విమర్శకుడు "Poetry is overheard" అని వచించాడు. కవిగా నారాయణబాబులో వక్తృత్వధోరణి కనిపించదు; మరి వ్యక్తిగా అతను ఉపన్యాసకుడే. అతని కవిత చదివినపుడు సద్యఃస్ఫురణ కలుగదు, తరచిన కొద్దీ అమృతాన్ని చిలుకుతుంది.

    "బుద్ధి హృదయం
    ధ్యానబుద్ధులై
    నిమీలిత నేత్రాలతో నిద్రిస్తే
    వ్యక్తా వ్యక్తలోకంలోంచి
    వెలుగు బాటలు చూపించే
    నీ వెవరే!"

అంటూ కవి తన కవితాపద్ధతికి సూత్రంగా రచించుకున్న సిద్ధాంతాన్ని విడమరచిన పఠితకు, అతని గేయాలు సుబోధకా లవుతాయి. జ్ఞానం కోసం హృదయంలోనుంచి మానసికావస్థను పొందినపుడు అతని కవిత ఆనంద జనక మవుతుంది. చీర మడతలు విప్పి కొలిచినట్లు కవిత్వానికి దండాన్వయం చెప్పడం సులభం కాదు; అవ్యక్త మధుర భావాలను వ్యక్తం చేస్తూ, రసస్ఫూర్తి కలిగించడమే అతని లక్ష్యం.

    "హాయిగా అర్ధరాత్రి
    ఆడామగా
    తడిమినా తెలియని
    తాండ్ర పాపారాయడు
    తమస్సు!"

ఇక్కడ కవి ప్రయుక్తమైన 'తాండ్ర పాపారాయుడు, తమస్సు' అనేవి విశేషణ విశేష్యములా అని విమర్శించి ప్రయోజనం లేదు. దండాన్వయ వ్యాకరణ పరిధుల నధిగమించి భావన మనస్సులలో కొన్ని 'ఈవకేషన్స్‌'ను రేపుతున్నది.

    "భూమి పూతచుట్ట!
    నిశ్శబ్ద పురాణ సంవత్సర సంపుటముల దొంతి"

న్యాయానికి అతని కవిత్వమే నిశ్శబ్ద పురాణ సంపుటాల దొంతి. భావమొక పూతరేకు. కొన్ని నిగూఢ రహస్యాలు అతని కవితలో తొంగిచూస్తాయి. శిల్పం రహస్యంగా వుండిపోతుంది. ఇంద్రియాలు గ్రహించిన అనుభూతులను ఆ యా ఇంద్రియాలతో గాక, వానిని భిన్న భిన్న యింద్రియ సంపాదితములుగా పేర్కోవడం ఒక శిల్ప రహస్యం. 'తెల్లని రుచి' 'రజతరావ సంగీతం' అనే ఇతని ప్రయోగాలు యిలాటివి. అతి ధైర్యంగా ఇతను చేసిన 'ఐరావతపు పంది అర్ధచంద్రుడు' అనే ప్రయోగాలు నావంటి రసోన్మాదులను మరీ పిచ్చెత్తుస్తున్నవి.

    "రుధిరజ్యోతిర్‌
    జ్వలనా లలనా
    ప్రియుండ!
    విప్లవఋషిని
    విద్రోహ కవిని"

అని గుండె నిబ్బరంతో చాటుకున్న ఈ కవి ధన్యుడు.

రోణంకి అప్పలస్వామి
సెప్టెంబరు 1962

(నారాయణబాబు జీవితకాలంలోనే ఈ వ్యాసం 'రుధిర జ్యోతి - ఒక ప్రస్తావన' అనే పేరిట 'భారతి'లో అచ్చుపడింది.)

AndhraBharati AMdhra bhArati - kavitalu - rudhirajyOti - prastAvana - SrIraMgaM nArAyaNabAbu Srirangam Narayana babu Sriramgam NarayaNababu rudhira jyothi rudhirajyothi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )