కవితలు రుధిరజ్యోతి
శ్రీరంగం నారాయణబాబు
తత్వమసి
తత్వమసి
(భారతి - నవంబరు 1944)
ఎవరా అతను?
చంద్రునిలో మచ్చను
మందులా నాకేసిన
మహానుభావుడు!
చలించే చుక్కల
చూపులతో తన
చూపులు కలిపి
తారల చలనాన్నే
బంధించిన
హృదయ బాంధవుడు!
నా శరీరంలో
నెత్తుటి బంధూక వనాన్ని
గాలై కదిపి
పాటలు పాడించిన
పరంజ్యోతి!
నా కలల ఆసీలు
మెట్టదగ్గర
కైఫీయత్‌ చెల్లించి
హృదయ హజారానికి
వజ్ర వైడూర్యాల
జాలకాలు నిర్మించి
వాటికి సేద్యగాని
చెమటలతో ముత్యాల
తోరణా లల్లి
నా నరాల తీగల
వరాల పాటలు పాడ
హృదయ గర్భాలయంలో
కంచుగంట మ్రోగించి
నా వెన్నెముకనే
శివధనుస్సుగా విరిస్తే
కూడలిలో అవ్యక్తం
జగమంతా నిండితే
సముద్రమే సంజీవ పర్వతమైంది!
ఘటమంటూ
లేకుండానే
గట్లుదాటిన ఆత్మ
సూర్యభగవానుడు
తన కిరణాల బంగారు
సూదుల ఆకాశం జోలిలో వేసి
నరుడై నల్లబడి
అమ్మడానికి వస్తే
చెన్నపట్నం వాడవదిన
జగమంతా కమ్మరివీధి
అని చెప్పింది.
నీవే హంసవైతే
నల్లగా ఉన్నామేమన్నా
పిచ్చివాడా! తెలియదా?
దీని తత్వం మసి!
గరళకంఠుడు నిద్రబోతే
గళమే నల్లకలువకాడని
కొరికా అంచేత!
అయితే ఎప్పుడు
తెల్లబడతా వన్నా
ఎప్పుడు ఈ విశ్వమానవ
సహస్రారం అర్పిస్తే
అప్పుడు అంది!
AndhraBharati AMdhra bhArati - kavitalu - rudhirajyOti - tatvamasi - SrIraMgaM nArAyaNabAbu Srirangam Narayana babu Sriramgam NarayaNababu rudhira jyothi rudhirajyothi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )