నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
౪-వ స్థలము. లుబ్ధావధాన్లు బస.
లుబ్ధావధాన్లు (ప్రవేశించి) ఏమి దురవస్థ వచ్చిందీ! నా అంత దురదృష్టవంతుడు లోకంలో యవడూలేడు. యేల్నాడి శనిరాగానే కాశీకి బయల్దేరి పోవలిసింది. బుద్ధి తక్కువపనిచేశాను. యిలా రాసివుండగా యెలా తప్పుతుంది. సౌజన్యరావుపంతులు దేవుఁడు. ఆయనలాంటివాళ్లు వుండబట్టే వర్షాలు కురుస్తున్నాయి. ఆయన శలవిచ్చినట్టు తప్పంతా నాయందు వుంచుకుని విధిని నిందించడవెఁందుకు? ఇంతడబ్బుండిన్నీ, డబ్బుకి లోభపడి ఒక్కగా నొక్కకూతుర్ని ముసలివాడికి అమ్మా`ను. నా జీవానికి ఉసురుమంటూ అదికానితిరుగులు తిరిగిందంటే దానితప్పా? బుద్ధితక్కువ వెధవని, ముసలితనంలో నాకు పెళ్లేం? దొంగముండా కొడుకని తెలిసిన్నీ ఆ రావఁప్పంతుల్ని నేన్నమ్మడవేఁవిఁ? ఆ మాయగుంట పారిపోవడవేఁవిఁ? కంటెకి, ఆ అల్లరేవిఁ? ఆయినసిపికటరు కూనీ చేశావఁని మమ్మల్ని సలపెట్టడ వేఁవిఁటి? అంతా ఘోరకలి; కలి నిండిపోతూంది. ఒక్క సౌజన్యారావు పంతులు సత్యసంధుడు నాకు కనపడుతున్నాడు. కడవఁంతా వకీళ్లూ, పోలీసులూ, పచ్చిదొంగలు.- ఆయనచక్రం అడ్డువేసి మమ్మల్ని యీ ఆపదలోంచి తప్పించారంటే కాసీవాసంపోతాం.- యేమి చిత్రాలు! వెధవలకి మఠం కట్టా`రట! యన్నడూ వినలేదు. అమ్మినివెళ్లి ఆమఠం చూడమంటాను. దానికి యిష్టం కలిగిందా, దానికి కావలిసిన డబ్బు యిస్తాను. ఆ మఠంలో వుంటుంది. లేకుంటే, నాతోపాటు కాసీవాసం.
(రామప్పంతులు ప్రవేశించును.)
లుబ్ధా కంటె, గింటె అని నాతో మీరు ప్రశంసించి కార్యంలేదు.
రామ ఆకంటెమాట ప్ర`శంసించడానికి రాలేదు మావాఁ. ఆకంటె`మధురవాణిది, మీరెరగరా? అదీ, మీరూ యేం జేసుకుంటారో నాకేం కావాలి? కంటె సిగకోసిరిగాని, మీకు ఓ గొప్ప సాయంచెయ్యడానికి వొచ్చాను. మీ అవస్థ చూస్తే నాగుండె నీరైపోతూంది.
లుబ్ధా

మహప్రభో! నీకు పదివేల నమస్కారాలు. యిక, యీ పకీరు వెధవని వదిలెయ్యి.

"రామనామ తారకం ।
భక్తిముక్తిదాయకం । జానకీమ" -

రామ రామ! రామ! యంతమాట అంటివయ్యా! మీరు ఆపదలోవుండి విరక్తిచేత యేమి మాటలన్నా అవి పడి, పనిచెయ్యడం నాకువిధి. చెప్పేమాట చెవిని బెట్టండి. ముందూ వెనకా చూడడానికి యిహ టైములేదు. వ్యవహారం అంతా సూక్ష్మంగా పొక్తు పరుచుకు వొచ్చాను. రెండు సంచులతో, కూనీకేసంతా మంచు విడిపోయినట్టు విడిపోతుంది. ఒక్క యినస్పెక్టరుతో కుదరలేదు. డిప్టీ కలక్టరికి కూడా చెయ్యి తడిచెయ్యాలి - మీదగ్గిర యిప్పుడు సొమ్ము లేదంటిరా, ఒకచోట వ్యవహారంకూడా పొక్తుపర్చాను. ప్రాంసరీ నోటుమీద యెన్ని రూపాయలు కావలిస్తే అన్నిరూపాయలిస్తారు.
లుబ్ధా

నేను వకదమ్మిడీ యివ్వను.

"రామనామతారకం । భక్తిముక్తిదాయకం । జానకీమనోహరం । సర్వలోకనాయకం" ॥

రామ నామాటవిను. యంతో ప్రయాసంమీద యీఘట్టం కుదిర్చాను. తాసీల్దారు మీదగ్గిర లంచం పుచ్చుకుని కూనీకేసు కామాపు చేశాడని, యినస్పెకటరు, డిప్టీకలక్టరికి గట్టిగా బోధపర్చాడు. కలక్టరు సలహామీద యినస్పెక్టరు చాలా పట్టుదలగా పనిచేసి, సాక్ష్యం అంతా రడీచేశాడు. కేసు రుజువైనట్టాయనా యావౌఁతుందో ఆలోచించుకోండి.
లుబ్ధా నీకెందుకు నాయేడుపు?
రామ డిప్టీకలక్టరు బ్రహ్మద్వేషి - తాసిల్దారు తాడు ముందుతెగుతుంది. తరవాత మిమ్మల్నీ, మీనాక్షినీ కమ్మెంటు కట్టేస్తాడు - వురిసిద్ధం. నాకూ యినస్పెక్టరికీ వుండే స్నేహంచేత యీఘట్టానికి వొప్పించాను. గనక నామాటకి చెవొగ్గి యీ ఆపద తప్పించుకోండి.
లుబ్ధా నన్ను బాధపెట్టక నీ మానాన్న నువ్వుపోదూ. "రామనామతారకం । భక్తిముక్తిదాయకం॥"
రామ నీ అంత కర్కోటకుణ్ణి యక్కడా నేనుచూడలేదు. నీమాటకేం పెద్దవాడివి - పసిపిల్ల, కడుపునకన్న మీనాక్షికి వురిసిద్ధం అయితే, ముండా డబ్బుకి ముందూ వెనకా చూస్తావు! తలుచుకుంటే నాహృదయం కరిగిపోతూంది.
(సౌజన్యారావు పంతులు ప్రవేశించును.)
రామ తమరు ధర్మస్వరూపులు. లుబ్ధావధాన్లుగారియందు అకారణమైన దయచేత యీకేసులో పనిచేస్తున్నారు. కేసంతా వట్టి అన్యాయమండి. ఒక్కపిసరైనా నిజంలేదు. శలవైతేగట్టి డిఫెన్సుసాక్ష్యం-
సౌజన్యా నీసంగతి నాకు తెలుసును. అవతలికి నడువు.
రామ తమరు యోగ్యులూ, గొప్పవారూ అయినా, ఏకవచనప్రయోగం-
సౌజ నడువు!
(రామప్పంతులు నిష్క్రమించును.)
సౌజ ఈదౌల్బాజీని తిరిగీ యెందుకు రానిచ్చారూ?
లుబ్ధా పొమ్మంటే పోడుబాబూ.
సౌజ యేవొఁచ్చాడు?
లుబ్ధా యినస్‌పికటరికీ డిప్టీకలకటరికీ లంచం యిమ్మంటాడు.
సౌజ డిప్టీకలక్టరుగారు లంచంపుచ్చుకోరు. ఆయన నాకు స్నేహితులు; నాకు తెలుసును. లంచాలూ పంచాలూ మీరు యిచ్చినట్లయితే, మీకేసులో నేను పనిచెయ్యను.
లుబ్ధా తమశలవు తప్పినడుస్తే చెప్పుచ్చుకు కొట్టండి. నాకు భగవంతుడిలాగ తమరు దొరికా`రు - "పాలనుముంచినా మీరే, నీళ్లనుముంచినా మీరే" అని మిమ్మల్నే నమ్మి ఉన్నాను.
సౌజ మీరు నేరంచెయ్యలేదని నాకు పూర్తిఅయిన నమ్మకంవుంది. నిజం కనుక్కోడానికి చాలాప్రయత్నం చేస్తున్నానుగాని ఆగుంటూరుశాస్తుల్లు యవడో భేదించలేకుండా వున్నాను. మీరు జ్ఞాపకం మీద చెప్పినచహరా గుంటూరు వ్రాసి పంపించాను. అక్కడ అలాటిమనిషి యవడూలేడని జవాబువొచ్చింది.
లుబ్ధా అదేంమాయోబాబూ! మీసాయంవల్ల యీగండంగడిచి, నాపిల్లా నేనూ యీ ఆపదలోంచి తేలితే, నాడబ్బంతా, మీపాదాలదగ్గిర దాఖలుచేసి కాసీపోతాను.
సౌజ మీడబ్బు నాకక్కరలేదని మీతో మొదటే చెప్పాను. నేచెప్పినమాటలు మీకు నచ్చి, ముసలివాళ్లు పెళ్లాడకూడదనీ, కన్యాశుల్కం తప్పనీ, యిప్పటికైనా మీకు నమ్మకం కలిగితే, యిలాంటి దురాచారాలు మాన్పడానికి రాజమహేంద్రవరంలో వక సభవుంది, ఆసభకి కొంచవోఁగొప్పో మీకు తోచిన డబ్బుయివ్వండి. వితంతువులమఠానికి మీపిల్లని పంపడం నాసలహా.
లుబ్ధా తమచిత్తం, తమశలవు. చేసినతప్పులు, తప్పులని శల్యాల్ని పట్టిపోయింది. బుద్ధివొచ్చింది బాబూ.
సౌజ ఆగుంటూరు శాస్తుల్లుకి పరవఁటదేశపు యాసవుండేదా? బాగా జ్ఞాపకం చేసుకు చెప్పండీ.
లుబ్ధా (ఆలోచించి) లేదండి.
సౌజ బాగా జ్ఞాపకం తెచ్చుకోండీ.
లుబ్ధా లేదండి.
(తెరదించవలెను.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)