నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
౫-వ స్థలము. విశాఖపట్టణంలో.
(మధురవాణి యింటి యదటివీధికొసను కరటకశాస్త్రి, శిష్యుడూ ప్రవేశింతురు.)
కరట నువ్వు ఆకంటె వాళ్లనెత్తిని కొట్టకుండా లేచిరావడంనుంచి, యీ ముప్పంతా వొచ్చినట్టు కనపడుతుంది.
శిష్యుడు మధురవాణికంటె మధురవాణికి యివ్వడం తప్పాఅండి?
కరట తప్పుకాదా? నువ్వు యిచ్చావని, మరి అదివొప్పుకుందా? "తే, ధగిడీకే కంటెతెస్తావా, చస్తావా?" అని రావఁప్పంతుల్ని పీకిపిండెట్టింది. దానిబాధపడలేక, ఆరావఁప్పంతులు కూనీకేసని యెత్తు యెత్తా`డు. ఆముసలాడికి సిక్ష అయిపోయిందంటే, బ్రహ్మహత్య నామెడకి చుట్టుకుంటుంది. నువ్వు అంటూ ఆకంటె వాళ్లయింట వొదిలేస్తే, నాకు యీ చిక్కు లేకపోవునుగదా?
శిష్యుడు వెధవముండ గూబగదలేస్తూంటే కంటె గింటె యవడికి జ్ఞాపకం వొస్తుందండి? చెయికరిచి, పెట్టెతీసి, మొహురు అంకించుకుని, చెంగున గోడగెంతా`ను. పజ్యండువొందలు మీరుపట్రాగా, నాకు పెళ్లిలోపెట్టిన కంటె నేను తెచ్చాననా`, తప్పుపట్టుతున్నారు? ఆకంటె అయినా దక్కిందా? చూస్తూనే మధురవాణి లాక్కుంది.
కరట నేను హాస్యగాణ్ణేగాని, యీకూనీ గడబిడతో నాహాస్యం అంతా అణిగిపోయింది. గనక యిక హాస్యంమాను - నేను తీసుకున్న రూపాయలు, లుబ్ధావధాన్లుకి యప్పటికైనా పంపించడానికే తలచాను! అంతేగాని అపహరిద్దామని అనుకోలేదు -మధురవాణిని యలాగైనా లయలేసి, కంటె యరువుపుచ్చుకుని, ఆకంటా, యీ రూపాయలూ, బంగీకట్టి అవుధాన్లుకి పంపించేస్తే, కూనీ నిజం కాదని పోల్చుకుంటారు. నాకు యీ బ్రహ్మహత్య తప్పిపోతుంది.
శిష్యుడు మీనా`స్తులు సౌజన్యారావు పంతులుగారితో నిజంచెప్పెయ్యరాదా అండి?
కరట వెఱ్ఱి కుదిరింది, రోకలి తలకి చుట్టమనన్నాట్ట! వెనకటికి యవరో పోలీసు, తల్లి కూరగాయలు పుచ్చుకుంటే జుల్మానా వేశాట్ట; సౌజన్యారావు పంతులు అలాటివాడు. ఆయనతో మనం వున్నమాట చెప్పావఁంటే, ఆయన నిజం కోర్టులో చెప్పేస్తాడు. ఆపైని లుబ్ధావధాన్లు పీకవురి, మన పీకకి తగులుకుంటుంది.
శిష్యుడు "మన" అంటున్నారేవిఁటి?
కరట మాట పొరపాటురా. రావఁప్పంతులు వూరికి వెళ్లినమాట నిజవేఁనా?
శిష్యుడు నిజవేఁ.
కరట వాడికంట పడ్డావఁంటే-
శిష్యుడు పడితే?
కరట మరేంలేదు. మధురవాణిగాని కంటె మనకి యెరువుయివ్వడానికి వొప్పుకుంటే ఆంజనేయస్వామికి పదిశేర్లునెయ్యి దీపారాధనచేస్తాను.
శిష్యుడు కడుపులోకి వెళ్లవలసిననెయ్యి కాల్చెయ్యడం నాకేవీఁ యిష్టంలేదు. అమృతగుండీ మొక్కుకొండి.
కరట హాస్యంచాలించు బెడిసిగొడుతుంది.
(నిష్క్రమింతురు.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)