నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
౬-వ స్థలము. మధురవాణి బసలోగది.
(మధురవాణి కుర్చీమీద కూచునియుండును. కరటకశాస్తుల్లు, శిష్యుడూ, ప్రవేశింతురు. మధురవాణి నిలబడును.)
మధు గురువుగారికి పదివేలదండాలు; శిష్యుడికొక చిన్నముద్దు. (శిష్యుని ముద్దుబెట్టుకొనును.)
కరట నీపుణ్యం వుంటుంది. నా అల్లుణ్ణి చెడగొట్టకు.
మధు అల్లుడెవరు?
కరట మాపిల్లని యితగాడికి యిచ్చి, కన్యాదానంచేస్తాను.
మధు జెయిలునుంచి వొచ్చినతరవాత పెళ్లా`? లేక, పెళ్లిచేసుకుని, మరీ మఠప్ర`వేశవాఁ?
శిష్యు జయిలేవిఁటండోయి?
కరట వొట్టినే హాస్యానికంటూంది.
మధు పాపం ఆపసిపిల్లవాడికి వున్న నిజస్థితి చెప్పండి. తనవాళ్లని వెళ్లిచూసైనావస్తాడు.
శిష్యు (కరటక శాస్త్రితో) కొంపముంచారో?
మధు ముంచడం అంటే అలాగా యిలాగానా?
కరట నీపుణ్యంవుంటుంది. హాస్యంచాలించు. లేకపోతే కుఱ్ఱవాళ్లకి పెద్దలయందు భక్తి చెడుతుంది.
శిష్యు నేనేంతప్పుచేశాను? గురువుగారు చెప్పినపనిచేశాను. ఆతప్పూ వొప్పూ ఆయందే.
మధు యవరేమిచేసితిరో, నాకు తెలియదుగాని, మీయిద్దరికోసం హెడ్‌ కనిష్టీబు గాలిస్తున్నాడు. దొరకగానే మఠప్ర`వేశం చేస్తాడట. యీమాటమట్టుకు నాకు రూఢిగా తెలుసును.
శిష్యు యిదేనా మీరు నాకు చేస్తానన్న పెళ్లి?
కరట యేమైనా జట్టీవస్తే, నీప్రా`ణానికి నాప్రాణం అడ్డువెయ్యనట్రా?
మధు వొస్తే జట్టీ గురుశిష్యులకు యిద్దరికీ వొక్కమారే వస్తుందిగాని, ఒకరికి రావడం ఒకరు అడ్డుపడడం అన్నమాట వుండబోదు. యెప్పుడైనా మీయిద్దరి ప్రా`ణాలకీ నేను కనికరించి, అడ్డుపడాలిగాని, మరియవడికీ సాధ్యంకాదనుకుంటాను.
శిష్యు మాగురువుగారి మాటకేం; ఆయనపెద్దవారు; యేవొఁచ్చినా సర్దుకోగలరు. నేను పాపం పుణ్యం యెరగని పసిపిల్లవాణ్ణి, నాప్రాణానికి నీప్రాణం అడ్డువేశావంటే, కీర్తివుండిపోతుంది.
మధు నీగురువుని వొదిలేసి నాదగ్గిర శిష్యరికం చేస్తావా?
శిష్యు యిదిగో- యీనిమిషం వొదిలేస్తాను. (బుగ్గలుగాలితో పూరించి పిడికిళ్లతో తట్టి గురువుతో) మీనేస్తం యీవేళతోసరి. మరి ఆడవేషం యీజన్మంలో వెయ్యను.
మధు నాటకంలోకూడా వెయ్యవా?
శిష్యు మరి నాటకం గీటకం నాకొద్దు.
మధు నాదగ్గిర శిష్యరికం అంటే యేవేఁంజెయ్యాలో తెలుసునా?
శిష్యు నీళ్లుతోడుతాను, వంటచేస్తాను. బట్టలువుతుకుతాను. గాని బ్రాహ్మణ్ణిగదా, కాళ్లుపట్టమనవుగద?
మధు (విరగబడినవ్వి) యిదా నీగురువుదగ్గిర చేసే శిష్యరికం?
శిష్యు మరిచిపోయినాను. చిడప్పొక్కులుకూడా గోకుతాను.
మధు (నవ్వి) పెంకా`?
శిష్యు యేనౌఖరీ చెయ్యమంటే ఆనౌఖరీ చేస్తాను.
మధు నన్ను ముద్దెట్టుకొమ్మన్నప్పుడల్లా ముద్దెట్టుకోవాలి.
శిష్యు ముద్దెట్టుకుంటాను.
కరట వాడు కుఱ్ఱవాడు - వాణ్ణెందుకు చెడగొడతావు? ఆశిష్యరికం యేదో వాడి తరఫునా, నాతరఫునాకూడా నేనే చేస్తాను. చాతనైతే చక్రంఅడ్డెయి.
మధు "గురువూ శిష్యుడాయె శిష్యుడూ గురువాయె" మీరు శిష్యులు కావాలంటే యిస్కూలు జీతం యిచ్చుకోవాలి.
కరట పిల్లికి చెలగాటం; యలక్కి ప్రాణపోకటా!
మధు మీరా యలక?
కరట అవును.
మధు మీరు యలకకారు, పందికొక్కులు, మీశిష్యుడు యలక.
కరట పోనీ - వాణ్ణయినా కాపాడు.
మధు అదే ఆలోచిస్తున్నాను.
కరట బుద్ధీ బుద్ధీ కలిస్తే రాపాడుతుంది. నీ ఆలోచన యేదో కొంచం చెబితివట్టాయనా నా ఆలోచనకూడా చెబుతాను. కలబోసుకుందాం.
మధు మీ ఆలోచన ముందుచెప్పండి.
కరట మరేమీలేదు నేపుచ్చుకున్న పజ్యండువొందల రూపాయల నోట్లూ, ఆకంటా, పోస్టుద్వారా భీమాచేసి గుంటూరు శాస్తుల్లుపేరట, లుబ్ధావధాన్లుకి పంపిస్తాను. దాంతోటి కూనీకేసు నిజంకాదని సౌజన్యారావు పంతులుగారు పోల్చుకుంటారు. ఆపైని దైవాధీనం!
మధు మీకుకంటె యలా వొస్తుంది?
కరట నువ్వు అనుగ్రహిస్తేను.
మధు (ముక్కుమీద వేలువుంచుకుని) చిత్రం! బ్రాహ్మలు యంతకైనా తగుదురు.
కరట యేవిఁ అలా అంటున్నావు?
మధు నాకంటె తిరిగీ నేను కళ్లచూడడం యెలాగ?
కరట సౌజన్యారావు పంతులుగారు నీవస్తువ నీకు యిచ్చేస్తారు. ఆయన బహున్యాయమైన మనిషి.
మధు అంత మంచివాడా?
కరట అందుకు సందేహవేఁమిటి?
మధు యెంత మంచివాడు?
కరట అంత మంచిమనిషి మరి లోకంలోలేడు.
మధు ఆయన్ని నాకు చూడాలనుంది. తీసికెళ్తారా?
కరట నా ఆబోరుంటుందా? ఆయన సానివాళ్లని చూడరు.
మధు ఆం`టీ నాచ్చి కాబోలు?
కరట యింగిలీషు చదువుకున్నవాళ్లకి కొందరికి పట్టుకుంది యీ చాదస్తం! అయినా అందులోనూ దేశకాలాలనుబట్టి, రకరకాలు లేకపోవడంలేదు.
మధు సౌజన్యారావు పంతులుగారిది యేరకం? గిరీశంగారిది యేరకం?
కరట యేమి సాపత్యంతెచ్చావు? కుక్కకి గంగిగోవుకూ యెంతవారో, వాడికీ ఆయనకు అంతవార. సౌజన్యారావు పంతులుగారు కర్మణా, మనసా, వాచా, యాంటీనాచి. "వేశ్య" అనేమాట, యేమరి ఆయనయెదట పలికితివఁట్టాయనా, "అసందర్భం!" అంటారు. ఆయనలాంటి అచ్చాణీలు అరుదు. మిగిలినవారు యధాశక్తి యాంటీనాచులు. ఫౌఁజు ఫౌఁజంతా, మాటల్లో మహావీరులే. అందులో గిరీశం అగ్రగణ్యుడు. కొందరు బంట్లు పొగలు యాంటీనాచి, రాత్రి ప్రోనాచి; కొందరు వున్నవూళ్లో యాంటీనాచి, పరాయివూళ్లో ప్రోనాచి; కొందరు శరీరదాఢ్ర్యం వున్నంతకాలం ప్రోనాచి, శరీరం చెడ్డతరవాత యాంటీనాచి; కొందరు బతికివున్నంతకాలం ప్రోనాచి, చచ్చిపోయినతరవాత యాంటీనాచి; కొందరు అదృష్టవంతులు చచ్చినతరవాతకూడా ప్రోనాచే. అనగా యజ్ఞంచేసి పరలోకంలో భోగాలికి టిక్కట్లు కొనుక్కుంటారు. నాబోటి అల్పప్రజ్ఞకలవాళ్లు, లభ్యం కానప్పుడల్లా యాంటీనాచె.
మధు మీయోగ్యత చెప్పేదేమిటి! గాని, హెడ్డుగారి మాటలుచూస్తే, సౌజన్యారావు పంతులుగారు లుబ్ధావధాన్లుగారిని కాపాడడానికి, విశ్వప్రయత్నం చేస్తూ వున్నట్టు కనబడుతుంది. యేమికారణమో?
కరట చాపలు యీదడానికి, పిట్టలు యెగరడానికి యేంకారణమో అదేకారణం.
మధుర పరోపకారం ఆయనకు సహజగుణమనా`?
కరట కాకేవిఁ?
మధుర మీరెందుకు, కొంచెం ఆయీదడం, యెగరడం నేర్చుకోకూడదు?
కరట నీమాట అర్థంకాలేదు.
మధుర యీ కేసులో నిజవేఁదో సౌజన్యారావు పంతులుగారితో చెప్పి మీరుకూడా - కొంచం లోకోపకారం చెయ్యరాదా?
కరట మామంచి సలహా చెప్పా`వు! తనకు మాలిన ధర్మమా? "స్వయంతీర్ణః పరాంస్తారయతి" అన్నాడు. నిజంచెబితే పంతులు యేవంటాడో నీకు తెలుసునా? "శాస్తుల్లుగారూ మీరు నేరంచేశారు. నేనేమిచెయ్యగలను? మిమ్మునుగురించి నాకుచాలా విచారంగా వున్నది" అని వగుస్తూ, పోలీసువాళ్లతోచెప్పి, జైయిలులోకి వప్పచెప్తాడు. జైయిలునుంచి తిరిగీ వచ్చిందాకా మాత్రం నెలకో పాతికో, పరకో కనికరించి నాభార్యాకు యిస్తూవుంటాడు. అలాంటి ప్రమాదం లేకుండా కార్యసానుకూలం కావఁడంకోసమే యీయెత్తు` యెత్తాను.
మధుర సరె, సౌజన్యారావు పంతులుగారు మంచివారు గనక ఆయనదాకావస్తే నాకంటె నాకు యిప్పించేస్తారు గాని, లుబ్ధావఁధాన్లు ఆరూపాయలూ, కంటా`, పెట్లో పెట్టుకుని ముంగిలా మాట్లాడకుండా వూరుకుంటేనో?
కరట దానిఖరీదు నేనిచ్చుకుంటాను.
మధు తమరు ఒకవేళ మఠంలో ప్రవేశిస్తే మరి నాకు కంటె ఖరీదుయిచ్చేవారెవరు? అందుచేత ఆకంటె నాకు తిరిగీ వచ్చేవరకూ మీశిష్యుణ్ణి నాదగ్గిర తాకట్టువుంచండి.
కరట అలాగనే.
శిష్యుడు మీసొమ్మేంబోయింది. నాపెళ్లో?
కరట నాలికా`, తాటిపట్టెరా?
శిష్యుడు మీరోవేళ- జయిల్లోకివెళితే,-
మధు గురువుకు తగిన శిష్యుడివౌదువు!
కరట అంత ఉపద్రంవొస్తే, నీపెళ్లిమాట నాపెళ్లాంతో యరేంజిమెంటుచేసి మరీవెళతాను.
శిష్యుడు యేమో! ఘోరవైఁనప్రమాణం చేశారుగదా?
కరట మధురవాణీ, కొంచంశ్రమచేసి కంటెతేవా?
మధు యేవొఁచ్చింది తొందర?
కరట హెడ్డుగాని, రావఁప్పంతులుగాని, వొచ్చారంటే నాకొంప ములుగుతుంది.
మధు ములిగితే తేలుస్తాను.
కరట అంత చాకచక్యం నీకులేదనికాదు.
(మధురవాణి లోనికివెళ్లును.)
కరట అది చెప్పిందల్లాచెయ్యక. కొంచంపై ఒచ్చేదికాని, మరీ నడుస్తూవుండు. యేవైఁనావుంటే, నాచెవిని పడేస్తూండు.
శిష్యుడు యవరిదగ్గిర వున్నప్పుడు వారు చెప్పిందల్లా చెయ్యడవేఁ, నా నిర్ణయం. మీరు యేం పైకాని, నాచేత ఆడవేషంవేయించి పెళ్లిచేశారో?
కరట ప్రమాదో ధీమతామపి. యంతటివాడికైనా ఒకప్పుడు కాలుజారుతుందిరా!
(మధురవాణి కంటె పట్టుకు ప్రవేశించి.)
మధు తాకట్టువస్తువ తప్పించుకు పారిపోతేనో? కుక్కా, నక్కా, కాదుగదా గొలుసులువేసి కట్టడానికి?
కరట నీ వలల్లో పడ్డప్రాణి మరి తప్పించుకుపోవడం యలాగ? వాటికి వున్న పటుత్వం యేవుక్కు గొలుసులకూ వుండదు.
మధు వలలో ముత్యపు చిప్పలుపడితే లాభంగాని, నత్తగుల్లలుపడితే మోతచేటు.
కరట యంతసేపూ డబ్బు, డబ్బేనా? స్నేహం, వలపూ, అనేవి వుంటాయా?
మధు స్నేహం మీలాటివారిచోట; అందుచేతనే, కష్టపడి ఆర్జించిన కంటె మీపాలు చేస్తున్నాను. మాతల్లిచూస్తే భవిష్యంవుంచునా? యిక వలపో? బతుకనేది వుంటే, వలపువన్నెతెస్తుంది. అంగడివాడికి మిఠాయిమీది ఆశా, సానిదానికి వలపూ, మనస్సులోనే మణగాలి; కొద్దికాలంవుండే యవ్వనాన్ని జీవనాధారంగా చేసుకున్న మా కులానికి వలపు ఒక్కచోటే.
కరట యక్కడో?
మధు బంగారంమీద. శృంగారం వన్నెచెడిన దగ్గిరనుంచీ, బంగారంగదా తేటుతేవాలి? ఆ బంగారం మీకు ధారపోస్తూవున్నప్పుడు నా స్నేహం యెన్ననేల?
కరట నీ స్నేహం చెప్పేదేవిఁటి! గాని నీ యౌవ్వనం, నీ శృంగారం దేవతా స్త్రీలకువలె శాశ్వతంగా వుంటాయి.
మధు మాతల్లి ధర్మవాఁ అని, ఆమె నాచెవిలో గూడుకట్టుకుని బుద్ధులు చెప్పబట్టిగాని, లేకుంటే మీలాంటి విద్వాంసుల యిచ్చకాలకి మైమరచి, యీపాటి వూళ్లో సానులవలె చెడివుండనా?
కరట మీతల్లి అనగా యెంత బుద్ధివంతురాలు! దానితరిఫీదుచేతనే నువ్వు విద్యాసౌందర్యాలు రెండూ దోహదంచేసి పెంచుతున్నావు!
మధు అంతకన్న కాపుమనిషినైపుట్టి, మొగుడిపొలంలో వంగమొక్కలకూ, మిరపమొక్కలకూ దోహదంచేస్తే, యావజ్జీవం కాపాడే తనవాళ్లన్నవాళ్లు వుందురేమో?
కరట యేమి చిన్నమాట అన్నావు! మధురవాణి అంటూ ఒక వేశ్యాశిఖామణి యీ కళింగరాజ్యంలో వుండకపోతే, భగవంతుడి సృష్ఠికి యంతలోపం వచ్చివుండును?
మధు సృష్ఠికి లోపం వచ్చినా రాకపోయినా, యిప్పటి చిక్కులలో మీకుమట్టుకు కించిత్‌లోపం వచ్చివుండును.
కరట మమ్మల్ని తేల్చడానికి నీ ఆలోచన యేదో కొంచం చెప్పావుకావుగదా?
మధు నన్ను సౌజన్యారావు పంతులుగారి దగ్గిరకి తీసుకువెళ్లడానికి వొప్పా`రు కారుగదా?
కరట ఆయన నిన్నూ, నన్నూ యింట్లోంచి కఱ్ఱపుచ్చుకు తరుముతారు.
మధు కోపిష్టా?
కరట ఆయనకి కోపవఁన్న మాటేలేదు.
మధు ఐతే భయమేల?
కరట చెడ్డవారివల్ల చెప్పుదెబ్బలు తినవచ్చునుగాని, మంచివారివల్ల మాటకాయడం కష్టం.
మధు కొత్తసంగతి వకటి యీనాటికి నాకు తెలిసింది. సృష్టికల్లా వన్నె తెచ్చిన మధురవాణి అనే వేశ్యాశిఖామణి గిరీశంగారివంటి కుక్కలపొత్తుకే తగివున్నదిగాని, సౌజన్యారావు పంతులుగారివంటి సత్పురుషులను చూడడమునకైనా అర్హత కలిగివుండలేదు. గిరీశంగారు దానియింట అడుగుబెట్టగానే, మీచెల్లెలుగారియింట, అడుగుపెట్టడానికి ఆయనకు యోగ్యత తప్పిందని మీ నిర్ణయం. తమలాంటి పండితోత్తములుమాత్రం కార్యావసరం కలిగినప్పుడు వూరూవాడా వెతికి, మధురవాణిదగ్గర లాచారీపడవచ్చును. అయితే డిప్టీకలక్టరూ కుక్కేనా?
కరట లంచం తినడుగాని ఆయనకు స్త్రీవ్యసనంకద్దు. పెద్ద వుద్యోగస్థుడు గనుక, సీమకుక్క అని అందాం, ఆయన్నిగానీ వలలోవేశావా యేవిఁటి?
మధు వేస్తే?
కరట బతికా`నన్నమాట! ఆయన సాయంవుంటే, కేసు మంచులావిడిపోతుంది. తెలిసింది. యిదా, నువుచేసిన ఆలోచన? యెంత గొప్పదానివి!
మధు ఆయన నాయుడుచేత రాయభారాలు పంపుతున్నారు.
కరట వెళ్లు, వెళ్లు, వెళ్లు, వెళ్లు, యింకా ఆలోచిస్తావేవిఁటి? నీ అదృష్టం నా అదృష్టం యేవఁని చెప్పను!
మధు వెళ్లతలచుకోలేదు.
కరట చంపిపోతివే! ఆయన ఒక్కడే మమ్మల్ని కాపాడగలిగినవాడు.
మధు యిటుపైని వూరకుక్కలనూ, సీమకుక్కలనూ దూరంగావుంచడానికి ఆలోచిస్తున్నాను.
కరట ఆయనని హాస్యానికి సీమకుక్క అని అన్నానుగాని, యెంత రసికుడనుకున్నావు? చేతికి యెమికలేదే! హెడ్డుకనిస్టీబుపాటి చేశాడుకాడా?
మధు పట్ణంవొదిలి పల్లెటూరు రాగానే, మీదృష్టిలో, పలచనైతినో? హెడ్డును నౌఖరులా తిప్పుకున్నానుగాని అధికంలేదే? ఆ నాలుగురోజులూ, సర్కారు కొలువుమాని అతడు నాకొలువుచేశాడు. అతడిసాయం లేకపోతే, మీరు ఆవూరి పొలిమేరదాటుదురా? యీదాసరి దాటునా? లోకం అంతా యేమి స్వప్రయోజకపరులూ?
కరట అపరాధం! అపరాధం! కలక్టరుని చూడనంటే, మనస్సు చివుక్కుమని అలా అన్నాను. నువ్వు ఆగ్రామం గ్రామం సమూలం రాణీలాగ యేలడం నేను యీ కళ్లతో చూడలేదా?
మధు నేను కలక్టరును చూడనంటే, మీమనస్సు చివుక్కుమనడం యెట్టిది? యేమి చిత్రం! సౌజన్యారావు పంతులుగారు యీమాటవింటే సంతోషిస్తారు కాబోలు?
కరట పీకవుత్తరిస్తారు.
మధు అదేదో చూస్తాను.
కరట బ్రహ్మహత్య కట్టుకుంటావా యేమిఁటి?
మధు అహా! యేమి బ్రాహ్మలూ!- అయినా పోలిశెట్టి చెప్పినట్టు, యెంత చెడ్డా బ్రాహ్మలుగదా? యిందండి; (కంటెయిచ్చును) తిలోదకాలేనా?
కరట యెంతమాట? పువ్వులలోపెట్టి మళ్లీరాదా? నీయెదట అనవలిసిన మాట కాదు. నీలాంటి మనిషి మరిలేదు. కించిత్‌ తిక్కలేకుంటేనా!
మధు ఆతిక్కేగదా యిప్పుడు మీకు వుపచరిస్తూంది?
కరట యేం వుపచరించడం? చంపేశావు! ఆ డిప్టీకలక్టర్ని ఒక్కమాటుచూసి యీ బీదప్రాణిని కాపాడితే-
మధు చాలించండి. యిక విజయంచెయ్యండి. (వెళ్లిపొమ్మని చేతితో సౌజ్ఞచేయును. కరటకశాస్తుల్లు, శిష్యుడు నిష్క్రమించుచుండగా) శాస్తుల్లుగారూ!
(కరటకశాస్తుల్లు తిరిగీ ప్రవేశించును.)
మధు మీపిల్లని మహేశానికి యిస్తారా?
కరట యిస్తాను.
మధు అయితె నాకో ఖరారు చేస్తారా?
కరట చేస్తాను.
మధు యిక అతణ్ణి నాటకాలాడించీ, ముండలిళ్లతిప్పీ చెడగొట్టకండి.
కరట యిటుపైని చెడగొట్టను - నాకుమాత్రం అక్ఖర్లేదా? (పొడుంపీల్చి) నీది గురూపదేశం, మధురవాణీ!
మధు బ్రాహ్మలలో ఉపదేశంలావూ, ఆచరణతక్కువా. ఖరారేనా?
కరట ఖరారే.
మధు బ్రాహ్మలుకాగానే, దేవుఁడికంట్లో బుగ్గిపొయ్యలేరు అనుకుంటాను.
కరట చివాట్లకి దిగా`వేఁవిటి?
మధు చిత్రగుప్తుడికి లంచం యివ్వగలరా? అతడిదగ్గిరకి మధురవాణిని పంపి, చేసిన పాపాలు అన్నీ తుడుపుపెట్టించడానికి వీలువుండదుకాబోలు?
కరట మధురవాణీ! జరూరు పనివకటుంది. మరిచిపోయినాను - వెళ్లి, రేపు మళ్లీ వస్తాను.
మధురవాణి (నవ్వుచేత కుర్చీమీద విరగబడి, తరవాత నవ్వు సమాళించుకొని) ఒక్కనిమిషం ఆగండి. శిష్యుడా! (శిష్యుడు ప్రవేశించును) యేదీ, నాడు నువ్వు రామచంద్రపురం అగ్రహారంలో, రామప్పంతులు యింటి బైటనూ, నేనూ మీనాక్షమ్మా తలుపు యివతలా అవతలా ఖణాయించి వుండగా, తెల్లవారఝావుఁన నిశ్శబ్దంలో ఆకాశవాణిలాపాడిన చిలక పాటపాడి నీమావఁగారికి బుద్ధిచెప్పు. తమమూలంగా ఒక ముసలిబ్రాహ్మడికి ముప్పువస్తూవుంటే తమశరీరం దాచుకుంటున్నారు.
శిష్యుడు (పాడును) "యెఱ్ఱనిముక్కుగలది రామచిలుక । దాని."
మధు (బెత్తముతో కొట్టబోయినట్టు నటించి) చెప్పినపని చెయ్యకపోతే జయిలుసిద్ధం.
(శిష్యుడు- "యెన్నాళ్లు బ్రతికినా" అను పాటపాడును. రెండు చరణములు పాడిన తరవాత.)
కరట అతిజరూరు పనివుంది మధురవాణీ మరోమాటువస్తాను. (నిష్క్రమించుతూ) తల వాయగొట్టింది. తెల్లవెంట్రుకలు లావయినాయి - మనసు కొంచం మళ్లించుకుందాం.
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)