నాటకములు వరవిక్రయము (1923) కాళ్లకూరి నారాయణరావు
తృతీయాంకము - మొదటి రంగము

(ప్రదేశము: లింగరాజుగారి పడక గది.)
సుభ:- (చదువుకొనుచుఁ బ్రవేశించి, చటుక్కునఁ బుస్తకము మూసి) సెబాసు! వివాహమన్న నీ విమలావిజయులదే వివాహము. సమాన వయోరూప సంపత్తిలేని దాంపత్య మేమిదాంపత్యము?
చ. ధనమె ప్రధానభూతముగ - దంతము లూడినవాని కేనియుం
దనయలఁ గట్టిపెట్టు తలి-దండ్రులు హెచ్చగుచున్న యిట్టి దు
ర్దినములలోన, నింతిగ, ధ-రిత్రిపయిం జనియించుకంటె ని
ర్జన వనవాటిలో, నజగ-రంబుగ నేని జనింపఁగా దగున్‌!

ప్రాయ ముడిగిన ప్రారబ్ధమునకు దోడు, పిసినిగొట్టుపీనుఁగుఁ గూడ నగుచో నిఁకఁ జెప్పవలసిన దేమున్నది! నాకుఁ బట్టిన యవస్థయే పట్టును! భగవంతుఁడా! తండ్రీ! నా భర్తవంటి భర్తను మాత్రము పగవారికైనఁ బ్రసాదింపకుము!

సీ. నగపేరు చెప్పిన - నవ్వులఁ బుచ్చును
    కోకలు కొనుమన్న - గొల్లుమనును
పొత్తంబు దెమ్మన - విత్తంబు లేదను
    కాగిత మడిగినఁ - గాకపడును
విడియ మొనర్చిన - విసవిసలాడును
    కాని పూవులు గొన్న - కస్సుమనును
వ్రత మొనర్చెద నన - వలవల యేడ్చును
    ముష్టి పెట్టిన నెత్తి - మొత్తుకొనును

పండుగకు పబ్బమున కైన - బిండివంట
మాట యెత్తిన బగ్గున - మండిపడును
కటకటా! యిట్టి మగనితోఁ - గాఁపురంబు
సలుప శక్యమె యెంతటి - సాధ్వికైన?

ఇంతటితోఁ దీఱినదా!

సీ. జడవైచుకొన, సాని - పడుచువఁటే యను
    చీరగట్టిన షోకు - మీఱె ననును
వంటవానిం బిల్వ - వెంట నేతెంచును
    పోలితో మాటాడఁ - బొంచి వినును
చదివిన, వ్రాసిన, - జగడమాడును, దొడ్డి
    లోని కేగిన నను-మానపడును
గడపదాఁటిన, వెన్కఁ - గొడుకు నంపించును
    పాడిన సతి కిది - కూడదనును

ఇంటి కెవరైన వచ్చిన - వెంటఁబడును
తగునె యీచేష్ట లన పెంకి-దాన వనును
కటకటా! యిట్టిమగనితోఁ గాపురంబు
సలుప శక్యమె యెంతటి - సాధ్వికైన?

ఇఁక సంసార సందర్భములు సరేసరి!

సీ. పుడకలుం బిడుకలు - బోషాణమున దాఁచి
    యెట్టకేలకు లెక్క - పెట్టియిచ్చు
ఉప్పును బప్పుఁ దా - నుండెడు గదినుంచి
    తులములచొప్పునఁ - దూఁచియిచ్చు
పెరటికూరల నెల్లఁ - బెరవారి కమ్మించి
    యేర్చి చచ్చుం బుచ్చు - నింటికిచ్చు
వండినదెల్లఁ దా - వడ్డించుకొని మెక్కి
    మిగతవారల కంట్లు - మిగులనిచ్చు

తిరుగుచుండగనే యింటి - దీప మార్చు
పలుకుచుండఁగనే గొంతు - పగుల నార్చు
కటకటా! యిట్టి మగనితోఁ - గాఁపురంబు
సలుప శక్యమె యెంతటి - సాధ్వికైన?
లింగ:- (తెరలో) మా వన్నెల విసనకఱ్ఱ యేమి చేయుచున్నది?
సుభ:- ఏమి చేయుచున్నదా? ఉసూరుమని యేడ్చుచున్నది!
లింగ:- (ప్రవేశించి) ఓసీ! యెప్పుడు చూచిన నెందులకో కొఱకొఱ లాడుచునే యుందువు. సంతోషముగా నుండు సమయ మెప్పుడే?
సుభ:- చచ్చిన మఱునాఁడు!
లింగ:- నీవా, నేనా?
సుభ:- మీకుఁ జా వేమిటి! ఎన్ని కట్నము లందుకొనవలసి యున్నదో, యెందఱి గొంతు లింకను గోయవలసి యున్నదో!
లింగ:- కట్నములమాట కఱకంఠుఁ డెఱుఁగును గాని పెన్నిధి వచ్చినను నేనిఁకఁ బెండ్లిమాత్రము చేసికొనను! బుద్ధివచ్చినది!
సుభ:- దాని కేమిలెండు! కలిమినిబట్టి యెవరికో గంగవెఱ్ఱు లెత్తక మానవు, సిగ్గు బుగ్గి చేసికొని మీరు సిద్ధపడక మానరు!
లింగ:- సరే, అంత యదృష్టము పట్టినప్పు డాలోచింపవచ్చును. గాని, నామీఁద నీ కింతకోప మెందులకే?
సుభ:- మీమీఁద నేమికోపము! నాతండ్రి మొఱ్ఱోయని మొత్తుకొనుచుండ ఆయన మెడలు విరిచి అన్యాయముగ నా గొంతుకోసిన మాయమ్మ మీఁదఁ దప్ప, నాకెవ్వరిమీఁదను కోపములేదు.
గీ. విద్యయు, వయస్సు, పరువును - విడిచిపెట్టి
భాగ్య మొక్కటియే చూచి - బతుకు పిసిని
గొట్టు పీన్గునకుం దన - కూఁతు నిచ్చు
తల్లి కుత్తుక తఱిగినఁ - దప్పు గలదె!
లింగ:- ఓసీ! భర్తయన భగవంతుఁడు గదా! భర్త నిట్టి పాడుమాట లనవచ్చునని యే పుస్తకములో నైన నున్నదా?
సుభ:- ఆలియన నర్ధాంగి గదా! అర్ధాంగి కన్నమైనఁ బెట్టక, కూడఁబెట్టిన ధనముకూడఁ గొంపోయినవా రెవ్వరైన నున్నారా?
లింగ:- ఆహాహాహాహా! అంటించినావే ముక్కకుముక్క! వెఱ్ఱిదానా! గడించినవాఁ డెవ్వఁడు కర్చుపెట్టి చచ్చినాఁడే? చూడు -
సీ. ప్రాయికంబుఁగఁ జెట్టు - పాఁతువాఁ డొక్కడు
    వరుసఁ బండ్లను మెక్కు - వాఁ డొకండు
కష్టపడి గృహంబు - గట్టువాఁ డొక్కఁడు
    వసతిగ నివసించు - వాఁ డొకండు
ఆస్తికై వ్యాజ్యెంబు - లాడువాఁ డొక్కఁడు
    వచ్చిన నది మ్రింగు - వాఁ డొక్కఁడు
కోరి ముండను బెట్టు - కొనెడి వాఁ డొక్కఁడు
    వలపుకాఁ డై పొందు - వాఁ డొకండు

అట్లె, ధనము కూర్చు-నట్టి వాఁ డొక్కఁడు
వడిగఁ, దగులఁబెట్టు - వాఁ డొకండు,
ఇది ప్రపంచధర్మ - మీనాఁడు పుట్టిన
లీలగాదు దీని - కేల గోల?
సుభ:- సరే కాని నా సమాధానము కూడ వినెదరా?
లింగ:- అక్కఱలే దక్కఱలేదు. ఈ వితండవాదమున కిప్పుడు తీఱికలేదు. నీకొక శుభవార్త చెప్పిపోవలెనని వచ్చినాను.
సుభ:- ఏమిటది? ఎవరైన బదులుకొఱకు వచ్చుచున్నారా యేమి?
లింగ:- బదులుఁగాదు బండలుఁగాదే. అబ్బాయికిఁ బిల్ల నిచ్చుటకై పెండ్లికొడుకు చూపులకు వచ్చుచున్నారు.
సుభ:- మనకుఁ బిల్ల నిచ్చునంతటి మతిమాలినవా రెవ్వ రబ్బా!
లింగ:- ఎవరా? పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారు.
సుభ:- ఏమిటీ? కాళిందినా? కమలనా?
లింగ:- కాళిందియో గీలిందియో నాకుఁ దెలియదు. పెద్దకొమార్తె.
సుభ:- పేరుతో మీకేమిపని! కట్నము మాత్రము గళ్ళున పెట్టెలోఁ బడిన జాలును! ఏపాటి?
లింగ:- ఏమో వారియిష్ట మే మిచ్చినను సరే.
సుభ:- అట్లయినఁ గాలమున కేదియో అంతరాయ మున్నదన్న మాటే! సరేకాని క్షౌరము చేయించుకొననే లేదుగద?
లింగ:- అబ్బా, అగపడినప్పుడెల్ల క్షౌరపుగోలయే కదా! నేను జావఁగానే, సర్వస్వము నీ క్షౌరముల క్రిందనే చెల్లుకాఁబోలును!
సుభ:- మీకా విచార మెందులకు? మీరు పోవునప్పుడు మీ యినుపపెట్టె మీనెత్తి కెత్తెదనులెండు!
లింగ:- ఆహా! అట్టి యవకాశమే యున్న నదృష్ట మేమనవచ్చును!
గీ. సంపద మహత్వ మెఱుఁగని - చవట బ్రహ్మ
చావు లేకుండగా నేని - సలుపఁ డయ్యె
చచ్చునప్పుడు వెనువెంట - సకలధనము
తీసికొనిపోవు విధమేని - తెలుపఁ డయ్యె.
(తెరపడును.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - varavikrayamu - kALlakUri nArAyaNarAvu - vara vikrayaM varavikrayam Kallakuri Narayana Rao Kallakuri Narayanarao kaallakoori naaraayana raavu telugu natakamulu telugu natakam telugu play telugu stage play ( telugu literature andhra literature)