నాటకములు వరవిక్రయము (1923) కాళ్లకూరి నారాయణరావు
తృతీయాంకము - రెండవ రంగము.

(ప్రదేశము: లింగరాజుగారి కచేరిచావడి.)
(ప్రవేశము: పురుషోత్తమరావుగారు, లింగరాజుగారు, బసవరాజు, పేరయ్య, వీరయ్య - చాపలపైఁ గూరుచుండి.)
లింగ:- విన్నారా?మున్నంగివారికిని, మాకును మూడుతరములనుండి సంబంధ మవిచ్ఛిన్నముగా సాగుచున్నది. మూర్తిరాజు పంతులుగారా సంగతు లన్నియు నెత్తుకొని మూరెఁ డుత్తరము వ్రాసినారు. అందుచేత నింతదూర మాలోచింపవలసి వచ్చింది.
వీర:- మూడు తరాలనాటి సంబంధ మొకటేనా? మూడువేల రూపాయల కట్నమో?
పేర:- వీరయ్యా! నీగొడవ మావిపరీతంగా వుందే! మూడువేలు మూడువేలని యిక్కడికి ముప్ఫయిసార్లన్నావు. ముష్టి మూడువేలు మీరేకాని మే మివ్వలే మనుకున్నావా? లింగరాజుగారు! ఆమొత్తం మేమే యిస్తాము. మాకింద ఖాయం!
వీర:- అదేమన్నమాట? మీరధికంగా అన్న దేముంది?
పురు:- అట్లయిన నింకొక యైదువంద లధికముగా నిచ్చెదము.
వీర:- మా పంతులుగారు మఱి యైదువందలు.
పేర:- వొయ్యోయ్‌! వొద్దుసుమా వొద్దు! మా పంతులుగారి సంగతి తెలియక మాజోరుగా వస్తున్నావు! మాట దక్కదుసుమా.
వీర:- పేరయ్యా! నీ బెదిరింపులకు నేను జడిసేవాణ్ణి కాను! మా పంతులుగారు పెట్టమన్న మొత్తంవఱకూ పెట్టిమఱీ తీఱతాను.
పురు:- (రోషముతో) సరే కానిమ్ము నాలుగువేల నాలుగువందలు.
వీర:- అయిదువందలు.
పురు:- ఆఱు. రా! యెంతవఱకు రాగలవో రా!
వీర:- రాక విడిచిపెడతానా? యేడువందలు.
పురు:- ఎనిమిది.
బస:- (తనలో) బాగు బాగు! ఫార్సులాగునే యున్నదే!
గీ. పేకలో నోకులం బాడు - వీఁక నడి బ
జారులో గుడ్డలం బాడు - సరణి; పెండ్లి
కొడుకు నిటు మధ్య నిడి, కసి - గొన్న యట్లు
వేలముం బాడు టెన్నఁడు - విని యెఱుంగ!
లింగ:- వీరయ్యా! వీరిక్రింద ఖాయపరుప వచ్చునా?
వీర:- అప్పుడేనా? అయిదువేలు!
పేర:- (లేచి) బాబూ! యీబేరం మనకు కుదిరేదికాదు లేవండి!
పురు:- అయ్యా! సెలవు తీసుకొను మనెదరా?
లింగ:- సందర్భము లన్నియుఁ దమరు స్వయముగాఁ జిత్తగించుచు నన్ను నెపపెట్టుట న్యాయమా?
పురు:- సరే మీచిత్తము! (అని లేచి పేరయ్యతో బైట కేగును.)
వీర:- కొంపతీసి, బేరం గోవిందా కొట్టదుగద?
లింగ:- వెఱ్ఱివాఁడా! పేరయ్య అంత పెయ్యమ్మ యనుకొంటివా?
వీర:- నన్ను మెచ్చుకో రేం? నాపాఠం నే నెల్లా వప్పగించాను?
లింగ:- నిత్యముఁ గోర్టులలో బ్రతుకు ముండకొడుకవు, నీకిది లెక్కా? (అని యేదియో వ్రాయుచున్నట్లు నటించును.)
బస:- (తనలో) వీరి ప్రసంగమునుబట్టి వీరేదియో కుట్రసాగించునట్లు కనఁబడుచున్నది. వీరయ్య ఫాల్సు పాటగాడై యుండును.
పేర:- (బయటను) పంతులుగారు బహుదూరం వెళ్ళారు. ఇంతదూరం వెళ్ళడం నాకిష్టంలేదు. వెళ్ళక చేసేదీ కనపడలేదు. ఆ యేల్నాటి శనిముండాకొడుఁకు లేకపోతే యెంచక్క ఫయసలయ్యేది! చెరపడానికి చేటపెయ్యచాలును! నిజానికి నిలివెడు ధన మిచ్చినా యీపాటి పిల్లవాఁడు మాత్రం యిక సందర్భపడడు.
పురు:- పోనిం డింకను రవంత దూరము పోయి చూతమా?
పేర:- పోవుటకేం పోవచ్చును. ఆ సులువు బలుపు లాలోచించుకో వలసినవారు మీరు. అమ్మగారితో ఆలోచింతా మంటే- అవకాశంలేదు. మనం మళ్ళీ వచ్చేసరి కీముండాకొడుకు మంగళం పాడేస్తాడు.
పురు:- అనవసరమగు నాలస్యమెకాని అది మాత్ర మేమి చెప్పఁగలదు? ఇంకొకమాట యనిచూతము రండు.
పేర:- అయితే, వొకపని చెయ్యండి- ఆవెధవతో వేలంపాట నాకిష్టం లేదు, ఆఖరుమా టని యింకో అయిదువంద లమాంతంగా పెట్టండి, దానితో దిమ్మ తిరిగిందా తిరుగుతుంది. తిరక్కపోతే, తిన్నగా యింటికి చక్కాపోదాం, ఏమి శలవు?
పురు:- సరే రండు. (అని పేరయ్యతో మరల లోపలికేగి) లింగరాజుగారు! మఱియొకమాట యని పోవుదమని మఱల వచ్చినాను. ఇంకొక యైదువంద లిచ్చెదము. ఇష్టమున్న మాక్రింద స్థిరపఱుపుడు- లేదా, యింతటితో మాకు సెలవు.
లింగ:- మూర్తిరాజుగారి క్రింద స్థిరపఱిచిన ట్టుత్తరము వ్రాయుటకు మొదలుపెట్టినానే! సరే సమాప్తి కాలేదు. కనుక దోషములేదు. ఏమి వీరయ్యా! వీరిక్రింద స్థిరపఱుప వచ్చునా?
వీర:- వారు నాకిచ్చిన వర్దీ యెంతవఱకో అంతవఱకూ పాడాను. టిల్లిగ్రాఫిచ్చి తిరిగీ ఆర్డరు తెప్పించుకునేవఱకూ ఆగండి.
లింగ:- అదేమన్నమాట! అయిదునిముషము లాగను. పెద్దమనుష్యుల కడ పేచీలు పనికిరావు! అయ్యా తమక్రింద ఖాయము.
పేర:- తథాస్తు! పంతులుగారూ! తమవద్ద పదిరూపాయ లుంటే ప్రస్తుతము బజానాక్రింద జమకట్టించండీ!
పురు:- (రూపాయలు తీసి యిచ్చును.)
పేర:- తమరు కాస్త రశీదుముక్క వ్రాసి యిప్పించండి.
లింగ:- అభ్యంతర మేమీ? (అని రసీదు వ్రాసి చదువును.)

"బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారికి సింగరాజు లింగరాజు వ్రాసియిచ్చిన రశీదు. మీకొమార్తె చి॥ సౌ॥ కాళిందిని, నాకొమారుడు చి॥ బసవరాజునకు చేసికొనుటకు, అందులకై మీరుమాకు కట్నముక్రింద నైదువేలు యైదువందల రూపాయల రొక్కము, రవ్వలయుంగరము, వెండిచెంబులు, వెండికంచము, వెండిపావకోళ్ళు, పట్టుతాబితాలు, వియ్యపురాలు వియ్యంకుల లాంఛనములు యధావిధిగా నిచ్చుటకును, ప్రతిపూఁటఁ బెండ్లివారిని బ్యాండుతోఁ బిలుచుటకును, రాకపోకలకు బండ్లు, రాత్రులు దివిటీలు నేర్పాటు చేయుటకును, రెండుసారులు పిండివంటలతో భోజనములు, మూడుసారులు కాఫీ, సోడా, యుప్మా, యిడ్డెన, దోసె, రవ్వలడ్డు, కాజా, మైసూరుపాకాలతో ఫలహారములు చొప్పున మా యిష్టానుసార మైదుదినములు మమ్ము గౌరవించుటకును, అంపకాలనాడు మాకు పట్టుబట్టలు, మాతో వచ్చువారి కుప్పాడబట్టలు నిచ్చుటకును నిర్ణయించుకొని బజానాక్రింద పదిరూపాయ లిచ్చినారు గనుక ముట్టినవి.

సింగరాజు లింగరాజు వ్రాలు"

చాలునా?
పేర:- చాలు బాబూ! చాలు! మచ్చుకోసం దాచిపెట్టుకో వలసిన మతలబు! (అని రశీదు తీసికొని పురుషోత్తమరావుగారి కిచ్చును.)
పురు:- బావగారూ! మాకిఁక సెలవా?
లింగ:- చిత్తము. చిత్తము. తాతగారు పిల్లపేర వ్రాసియిచ్చిన దస్తావే జొకసారి పంపెదరా?
పురు:- అభ్యంతరమేమీ? అట్లే పంపెదను.
(తెరపడును.)
ఇది తృతీయాంకము.
AndhraBharati AMdhra bhArati - nATakamulu - varavikrayamu - kALlakUri nArAyaNarAvu - vara vikrayaM varavikrayam Kallakuri Narayana Rao Kallakuri Narayanarao kaallakoori naaraayana raavu telugu natakamulu telugu natakam telugu play telugu stage play ( telugu literature andhra literature)