శతకములు ఆంధ్రనాయక శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
సీ. శ్రీమదనంత లక్ష్మీ యుతోరః స్థల- చతురాననాండ పూరిత పిచండ
ధర చక్ర ఖడ్గ గదా శరాసనహస్త- నిఖిల వేదాంత వర్ణిత చరిత్ర
సకల పావన నదీ జనక పాదాంభోజ- దమణీయ ఖగకులోత్తమ తురంగ
మణి సౌధవ త్ఫణామండ లోరగతల్ప- వరకల్పకోద్యాన వన విహార
 
తే. భాను సితభాను నేత్ర సౌభాగ్యగాత్ర-యోగిహృద్గేయ భవనైక భాగధేయ
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
1
సీ. వైజయంతీధామ వర్ణిత సుత్రామ- శోభననామ లోకాభిరామ
కువలయశ్యామ వికుంఠపట్టణధామ- శ్రుతిహితనామ దైవతలలామ
కృత్యదైత్య సంగ్రామ గీతార్థ పరిణామ- యదుకులాంబుధిసోమ అఘవిరామ
సంగర జిత భౌమ రంగద్గుణస్తోమ- త్రిభువన క్షేమ వర్ధిష్ణుకామ
 
తే. దాసులము గామ? నీ పేరు దలఁచుకోమ?-కొసరితిమి ప్రేమ కోరిన కోర్కు లీవ?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
సీ. మానుషహర్యక్ష మార్తాండ సోమాక్ష- త్రిభువనాధ్యక్ష కౌంతేయపక్ష
మదనకోటివిలాస మంజుల దరహాస- శ్రీహృన్నివాస కౌశేయవాస
శార్ఙ్గకోదండ పిచండ భృతాజాండ- వినుతవేదండ రవిప్రచండ
దీనశరణ్య విద్విట్భేద నైపుణ్య- భక్తానుగణ్య దిక్ప్రభువరేణ్య
 
తే. సిద్ధసంకల్ప అవికల్ప శేషతల్ప-నిష్కలంక నిరాతంక నిరుపమాంక
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
3
సీ. గోవింద ముచికుంద సేవిత పాదార- వింద నిత్యానంద విశ్వతుంద
శ్రీమంత విజయలక్ష్మీకాంత నిర్మల- స్వాంత భక్తోద్యాన వనవసంత
అఘనాశ కోటిసూర్యప్రకాశ వరేశ- విజితాశ సన్మనోంబుజ నివేశ
సద్గుణ గేహ వాసవనీల సమదేహ- బంధురోత్సాహ సువర్ణవాహ
 
తే. పండితస్తోత్ర చారిత్ర పద్మనేత్ర-మధుర మంజులభాష సమస్తపోష
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
4
సీ. శ్రీకాకుళము భక్తలోక చింతామణి- శ్రీకాకుళము సుకృతాకరంబు
శ్రీకాకుళము ధరాలోక వైకుంఠంబు- శ్రీకాకుళము మర్త్యసేవితంబు
శ్రీకాకుళము వేదసిద్ధాంత మహిమంబు- శ్రీకాకుళము హతవ్యాకులంబు
శ్రీకాకుళము మహాక్షేత్రావతంసంబు- శ్రీకాకుళము సర్వసిద్ధికరము
 
తే. తెలియ శ్రీకాకుళంబు నీ దివ్యదేశ-మాంధ్రనాయక నీవె శ్రీహరివి నిజము
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
5
సీ. ఇంద్రనీలచ్ఛాయ లీను నెమ్మేనిపైఁ- గనకాంబరప్రభ గ్రందుకొనఁగఁ
బర్వసుధాంశు శోభసముజ్జ్వలవక్త్ర- మున నూర్ధ్వపుండ్రము ముద్దు గుల్క
నెగుభుజంబుల ధగద్ధగితాంగద ద్యుతుల్‌- మూర్ధరత్నకిరీటమునఁ జరింప
వర్ణితోరస్థలి వైయంతిక కౌస్తు- భాంతర శ్రీదేవియంద మమర
 
తే. రమ్ము దర్శన మిమ్ము ఘోరములఁ జిమ్ము-మభయ మిమ్ము భవత్తత్త్వ మానతిమ్ము
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
6
సీ. కలిగినప్పుడె కన్న తలిదండ్రు లెన్న నే- నిసువు మాటాడంగ నేర్చె జగతి
జయలిజగంబు లంబకు నిజోదరమునం- దేబిడ్డ చూపించె నిద్ధరిత్రిఁ
దొడలపై ముద్దుగా నిడుకొన్న జనని కే- పసిపిల్ల కొండంతబరువు దోఁచెఁ
దల్లిచెంగటనుండి యిల్లిల్లుఁ జొచ్చి యే- కుఱ్ఱఁ డింతుల బల్మిఁ గూడ నేర్చె
 
తే. నాబుడత వీవెరా యబ్బ! యబ్బురంపు-కతలమారివి నీ వెఱుంగనివి గలవె?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
7
సీ. వరమిచ్చినట్టి శంకరుని కెగ్గు దలంచు- భస్మాసురుని పేరుఁ బాపినావు
తనయిల్లుఁ గాచు నుగ్రుని బోరుటకుఁ బిల్చు- బాణుచేతులు తెగఁ బఱికినావు
తొలుమిన్కు లజుని మ్రుచ్చిలి గొన్న సోమకుఁ- జంపి విద్యలు ధాత కంపినావు
బలిమి దైత్యులు సుధాకలశము న్గొన వారి- వంచించి సురలకుఁ బంచినావు
 
తే. నిఖిలదైవత కార్యముల్‌ నిర్వహించు-నీకు నిజకార్యము భరంబె నిర్వహింప!
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
8
సీ. అచట లే వని కదా యరచేతఁ జఱచెఁ గ్రు- ద్ధత సభా స్తంభంబు దానవేంద్రుఁ
డచట లే వని కదా యస్త్రరాజం బేసె- గురుసుతుం డుత్తరోదరమునందు
నచట లే వని కదా యతికోపి ననిచెఁ- బాండవు లున్నవనికిఁ గౌరవకులేంద్రుఁ
డచట లే వని కదా యాత్మీయసభను ద్రౌ- పది వల్వ లూడ్చె సర్పధ్వజుండు
 
తే. లేక యచ్చోటులను గల్గలేదె ముందు-కలవు కేవల మిచ్చోటఁ గల్గు టరుదె
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
9
సీ. అంచితాఖండ దీపారాధనల చేత- దీపించు నెప్పుడు దేవళంబు
అగరుసాంబ్రాణి ధూపార్పణంబులచేత- భవనం బ దెప్పుడుఁ బరిమళించు
నతినృత్యగీత వాద్యస్వనంబులచేత- నెప్పుడుఁ గోవెల యెసక మెసఁగు
నఖిలోపచార సమర్పణంబులచేత- మెఱయు నెప్పుడుఁ దిరుమేను కళల
 
తే. నిపు డొకించుక లోభిత్వ మెనసి నట్లు-దోఁచుచున్నాఁడ విట్టియద్భుతము గలదె
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
10
AndhraBharati AMdhra bhArati - shatakamulu - AMdhranAyaka shatakamu ( telugu andhra )