శతకములు భాస్కర శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
ఉ. స్థానముఁ దప్పివచ్చునెడఁ దానెటువంటి బలాఢ్యుఁడున్‌ నిజ
స్థానికుఁడైన యల్పుని కతంబున నైనను మోసపోవుఁగా;
కానల లోపలన్‌ వెడలి గంధగజం బొకనాఁడు నీటిలోఁ
గానక చొచ్చినన్‌ మొసలి కాటుకు లోఁబడదటోటు భాస్కరా!
101
చ. సిరిగలవాని కెయ్యెడలఁ జేసిన మేలది నిష్ఫలం బగున్‌
నెఱిగుఱి గాదు పేదలకు నేర్పునఁ జేసిన సత్ఫలంబగున్‌
వఱపున వచ్చి మేఘుఁడొక వర్షము వాడిన చేలమీఁదటం
గురిసినఁగాక యంబుధులఁ గుర్వఁగ నేమి ఫలంబు భాస్కరా!
102
చ. సిరివలెనేని సింహగుహ చెంత వసించినఁ జాలు సింహముల్‌
కరుల వధింపఁగా నచటఁ గల్గును దంతచయంబు ముత్యముల్‌
హరువుగ నక్కబొక్క కడ నాశ్రయమందిన నేమి గల్గెడుం
గొరిసెలు దూడతోఁకలును గొమ్ములు నెమ్ములుఁగాక భాస్కరా!
103
చ. స్థిరతర ధర్మవర్తన బ్రసిద్ధికి నెక్కినవాని నొక్క ము
ష్కరుఁ డతినీచవాక్యములఁ గాదని పల్కిన నమ్మహాత్ముఁడుం
గొఱఁత వహింపఁడయ్యెడ; నకుంఠిత పూర్ణసుధాపయోధిలో
నరుగుచుఁ గాకి రెట్ట యిడినందున నేమి కొఱంత భాస్కరా!
104
చ. స్ఫురతర కీర్తిమంతులగు పుత్త్రుల గాంచినఁగాక మూఢము
ష్కరులఁ గనంగఁ దేజములు గల్గవుగా; మణికీలితాంగుళా
భరణము లంగుళంబుల శుభస్థితిఁ బెట్టినఁగాక గాజు టుం
గరములు పెట్టినందున వికాసము గల్గునటయ్య? భాస్కరా!
105
ఉ. సేనగ వాంఛితాన్నము భుజింపఁగలప్పుడు కాక లేనిచో
మేనులు డస్సియుంట నిజమేకద దేహుల కగ్నిహోత్రుఁడౌ
నే నిజభోజ్యముల్‌ గుడుచు నేనియుఁ బుష్టి వహించు లేనిఁనా
డూని విభూతిలోనడఁగి యుండఁడె తేజము తప్పి భాస్కరా!
106
ఉ. హాళి నిజప్రబుద్ధి తిరమైన విధంబునఁ బెట్టుబుద్ధులా
వేళలకంతె కాని మఱి వెన్కకు నిల్వవు; హేమకాంతి యె
న్నాళులకుండుఁ గాని యొకనాడు పదంపడి సానఁ బట్టినన్‌
దాళియు నుండునే యినుప తాటకఁ జాయలు పోక భాస్కరా!
107
ఉ. హీనకులంబునందు జనియించినవారికి సద్గుణంబు లె
న్నేనియుఁ గల్గియున్న నొక నేరము చెందకపోదు; పద్మముల్‌
భూనుతిఁ గాంచియు\న్‌ బురదఁ బుట్టుట వల్ల సుధాకరోదయం
బైన నసహ్య మొందవె ప్రియంబునఁ జూడఁగ లేక భాస్కరా!
108
ఉ. ఇంచుక నేర్పు చాలక విహీనతఁ జెందిన నా కవిత్వము\న్‌
మించు వహించె నీకతన మిక్కిలి యెట్లనఁ దోలుబొమ్మలు\న్‌
మంచివివేకి వాని తెరమాటున నుండి ప్రశస్తరీతి నా
డించిన నాడవే జనుల డెందము నింపవె ప్రీతి భాస్కరా!
109
AndhraBharati AMdhra bhArati - shatakamulu - bhAskara shatakaM - mAravi veMkayya ( telugu andhra )