శతకములు భాస్కర శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
ఉ. చక్కఁదలంపఁగా విధివశంబున నల్పుని చేతనైనఁ దా;
జిక్కి యవస్థలం బొరలుఁ జెప్పఁగరాని మహాబలాఢ్యుఁడున్‌
మిక్కిలి సత్త్వ సంపదల మీఱిన గంధగజంబు మావటీఁ
డెక్కి యదల్చి కొట్టి కుదియించిన నుండదె యోర్చి భాస్కరా!
41
చ. చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం;
బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా!
42
ఉ. చాలఁ బవిత్రవంశమున సంజనితుండగునేని యెట్టి దు
శ్శీలునినైనఁ దత్కుల విశేషముచే నొక పుణ్యుఁడెంతయుం
దాలిమి నుద్ధరించును; సుధానిధిఁ బుట్టగఁగాదె శంభుఁడా
హాలాహలానలంబు గళమందు ధరించుట పూని భాస్కరా!
43
ఉ. చేరి బలాధిపుం డెరిఁగి చెప్పిన కార్యము చేయకుండినన్‌
బారము ముట్టలేఁడొక నెపంబున దాఁజెడు నెట్టి ధన్యుఁడున్‌
బోరక పాండుపుత్రులకు భూస్థలిభాగము పెట్టుమన్న కం
సారిని గాకుచేసి చెడఁడాయెనె కౌరవభర్త భాస్కరా!
44
ఉ. చేసిన దుష్టచేష్ట నది చెప్పక నేర్పునఁ గప్పిపుచ్చి తా
మూసిన యంతటన్‌ బయలు ముట్టక యుండ దదెట్లు; రాగిపైఁ
బూసిన బంగరుం జెదరిపోవఁ గడంగిన నాఁడు నాటికిన్‌
దాసిన రాగి గానఁబడ దా జనులెల్ల రెఱుంగ భాస్కరా!
45
చ. తగిలి మదంబుచే నెదిరిఁ దన్ను నెఱుంగక దొడ్డవానితో
బగఁగొని పోరుటెల్ల నతిపామరుడై చెడుటింతెగాక తా
నెగడి జయింపనేరఁడది నిక్కము తప్పదు; ధాత్రిలోపలన్‌
దెగి యొక కొండతో దగరు ఢీకొని తాఁకిన నేమి భాస్కరా!
46
చ. తడవగ రాదు దుష్టగుణుఁ దత్వ మెఱుంగక యెవ్వరైన నా
చెడుగుణ మిట్లు వల్వదని చెప్పిన గ్రక్కున గోపచిత్తుఁడై
కడుఁ దెఁగఁ జూచుఁగా; మఱుగఁ గాగిన తైలము నీటిబొట్టుపై
బడునెడ నాక్షణంబెగసి భగ్గున మండక యున్నె భాస్కరా!
47
చ. తనకు ఫలంబు లేదని యెదం దలపోయఁడు కీర్తి గోరు నా
ఘన గుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మే
లనుకొని పూను; శేషుఁడు సహస్ర ముఖంబుల గాలి గ్రోలి తా
ననిశము మోవఁడే మఱి మహాభరమైన ధరిత్రి భాస్కరా!
48
చ. తనకు నదృష్టరేఖ విశదంబుగఁ గల్గిన గాని లేనిచో
జనునకు నెయ్యెడన్‌ బరుల సంపదవల్ల ఫలంబు లేదుగా;
కనుగవ లెస్సఁగా దెలివి గల్గిన వారికి గాక గ్రుడ్డికిన్‌
కనఁబడు నెట్లు వెన్నెలలుఁ గాయగ నందొక రూపు భాస్కరా!
49
ఉ. తాలిమితోడుతం దగవు దప్పక నేర్పరి యొప్పుదప్పులం
బాలన సేయఁ గాకట నుపాయ విహీనుఁడు సేయనేర్చునే?
పాలను నీరు వేఱు పరుపంగ మరాళ మెఱుంగుఁగాని మా
ర్జాలమెఱుంగునే తదురు చారురసజ్ఞత బూన భాస్కరా!
50
AndhraBharati AMdhra bhArati - shatakamulu - bhAskara shatakaM - mAravi veMkayya ( telugu andhra )