శతకములు భాస్కర శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
ఉ. తాలిమితోఁడ గూరిమిఁ గృతఘ్నునకెయ్యెడ నుత్తమోత్తముల్‌
మేలొనరించినన్‌ గుణము మిక్కిలి కీడగుఁ, బాముపిల్లకున్‌
బాలిడి పెంచిన న్విషము పాయఁగ నేర్చునె దాని కోఱలం
జాలఁగ నంతకంత కొక చాయను, హెచ్చును గాక భాస్కరా!
51
చ. తెలియని కార్యమెల్లఁ గడతేర్చుట కొక్క వివేకిఁ జేకొనన్‌
వలయు నటైన దిద్దుకొనవచ్చు ప్రయోజన మాంద్య మేమియుం
గలగదు; ఫాలమందుఁ దిలకం బిడునప్పుడు చేత నద్దముం
గలిగినఁ జక్కఁ జేసికొనుఁ గాదె నరుండది చూచి భాస్కరా!
52
ఉ. దక్షుడు లేని యింటికిఁ బదార్థము వేఱొక చోటనుండి వే
లక్షలు వచ్చుచుండినఁ బలాయనమై చనుఁ, గల్ల గాదు ప్ర
త్యక్షము; వాగులున్‌ వఱదలన్నియు వచ్చిన నీరు నిల్చునే
అక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా!
53
ఉ. దానపరోపకారగుణ ధన్యత చిత్తములోన నెప్పుడున్‌
లేని వివేకశూన్యునకు లేములు వచ్చినవేల సంపదల్‌
పూనినవేళ నొక్కసరి పోలును; జీఁకున కర్థరాత్రియం
దైననదేమి పట్టపగలైన నదేమియు లేదు భాస్కరా!
54
ఉ. దానము సేయఁ గోరిన వదాన్యున కీయఁగ శక్తి లేనిచో
నైనఁ బరోపకారమునకై యొక దిక్కునఁ దెచ్చి యైన నీఁ
బూనును; మేఘుడంబుధికిఁ బోయి జలంబులఁ దెచ్చి యీయఁడే
వాన సమస్త జీవులకు వాంఛిత మింపెసలార భాస్కరా!
55
ఉ. దానముఁ జేయనేరని యధార్మికు సంపద యుండి యుండియున్‌
దానె పలాయనంబగుట తథ్యము; బూరుగు మ్రాను గాచినన్‌,
దాని ఫలంబులూరక వృథాపడిపోవవె యెండి గాలిచేఁ
గానలలోన నేమిటికిఁగాక, యభోజ్యములౌట భాస్కరా!
56
చ. నడవక చిక్కిలేమి యగునాఁడు నిజోదర పోషణార్థమై
యడిగి భుజించుటల్‌ నరుల కారయ వ్యంగ్యముకాదు; పాండవుల్‌
గడు బలశాలులేవురు నఖండవిభూతిఁ దొలంగి భైక్ష్యముల్‌
గుడువరె యేకచక్రపురిఁ గుంతియుఁ దారొకచోట భాస్కరా!
57
చ. నుడువుల నేర్పు చాలని మనుష్యుఁడెఱుంగక తప్పనాడినం
గడుఁ గృపతోఁ జెలంగుదురు కాని యదల్పరు తజ్ఞులెల్లఁ; ద
ప్పటడుగులు వెట్టుచు న్నడుచునప్పుడు బాలుని ముద్దు చేయఁగా
దొడుగుదు రింతెకాని పడఁద్రోయుదురే యెవరైన భాస్కరా!
58
ఉ. నేరిచి బుద్ధిమంతుఁడతి నీతివివేకము దెల్పినం జెడం
గారణమున్నవాని కది కైకొనఁగూడదు నిక్కమే; దురా
చారుఁడు రావణాసురుఁడసహ్యమునొందఁడె చేటుకాలముం
జేరువయైననాఁడు నిరసించి విభీషణు బుద్ధి భాస్కరా!
59
చ. నొగిలిన వేళ నెంతటి ఘనుండును దన్నొక రొక్క నేర్పుతో
నగపడి ప్రోదిసేయక తనంతట బల్మికిరాడు నిక్కమే;
జగమున నగ్నియైనఁ గడు సన్నగిలంబడియున్న, నింధనం
బెగయగఁ ద్రోచి యూదక మఱెట్లు రవుల్కొన నేర్చు భాస్కరా!
60
AndhraBharati AMdhra bhArati - shatakamulu - bhAskara shatakaM - mAravi veMkayya ( telugu andhra )