శతకములు భాస్కర శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
చ. ఫలమతి సూక్ష్మమైనను నృపాలుడు మంచిగుణాఢ్యుడైనచో
నెలమి వివేకులాతని కపేక్షయొనర్తు; రదెట్లు చంద్రికా
విలసనమైనఁ దా మనుభవింపఁ జకోరము లాసఁ జేరవే
చలువ గలట్టివాఁడగుటఁ జందురు నెంతయుఁ గోరి భాస్కరా!
71
ఉ. బంధుర సద్గుణాఖ్యుఁ డొక పట్టున లంపట నొందియైన దు
స్సంధిఁ దలంపఁ డన్యులకుఁ జాల హితం బొనరించుఁ గాక, శ్రీ
గంధపుఁ జెక్క రాగిలిచుఁ గాదె శరీరుల కుత్సవార్థమై
గంధములాత్మఁ బుట్టఁ దఱుఁగంబడి యుండుటలెల్ల భాస్కరా!
72
చ. బలము దొలంగు కాలమునఁ బ్రాభవసంపదలెంత ధన్యుఁడున్‌
నిలుపుకొనంగనోపఁ; డది నిశ్చయ మర్జునుఁడీశ్వరాదులం
గెలిచినవాఁడు బోయలకు గీడ్పడి చూచుచుఁ గృష్ణభార్యలు
బలువుర నీయఁడే నిలువఁ బట్ట సమర్థుఁడు గాక భాస్కరా!
73
చ. బలయుతుఁ డైన వేళ నిజ బంధుఁడు తోడ్పడుఁ గాని యాతఁడే
బలము తొలంగెనేని తన పాలిటి శత్రు; వదెట్లు పూర్ణుఁడై
జ్వలనుఁడు కానఁ గాల్చు తఱి సఖ్యముఁ జూపును వాయుదేవుఁడా
బలియుఁడు సూక్ష్మదీపమగు పట్టున నార్పదె గాలి భాస్కరా!
74
ఉ. బల్లిదుఁడైన సత్ప్రభువు పాయక యుండినఁగాని రచ్చలోఁ
జిల్లరవారు నూఱుగురు సేరినఁ దేజము గల్గదెయ్యెడన్‌
జల్లని చందురుండెడసి సన్నపుఁ జుక్కలు కోటియున్న
జిల్లునె వెన్నెలల్‌ జగము జీఁకటులన్నియుఁ బాయ భాస్కరా!
75
చ. భుజబల శౌర్యవంతులగు పుత్త్రుల గాంచిన వారి కెయ్యెడన్‌
నిజహృదయేప్సితార్థములు నిక్కము చేకుఱుఁ గుంతిదేవికిన్‌
విజయబలాఢ్యుఁ డర్జునుఁడు వీరపరాక్రమ మొప్ప దేవతా
గజమును దెచ్చి తల్లి వ్రతకార్యము దీర్పఁడె తొల్లి భాస్కరా!
76
ఉ. భూనుతులైన దేవతలు పూర్వము కొందఱు వావివర్తనల్‌
మాని చరింపరో యనుచు మానవులట్ల చరింపఁబోల; దం
భోనిధులన్నియుం దనదు పుక్కిటఁ బట్టె నగస్త్యుఁడంచు నా
పూనిక కెవ్వఁడోపు నది పూర్వమహత్త్వము సుమ్ము భాస్కరా!
77
ఉ. భూపతి కాత్మబుద్ధి మది బుట్టనిచోఁట బ్రధానులెంత ప్ర
జ్ఞాపరిపూర్ణులైనఁ గొనసాగదు కార్యము; కార్యదక్షులై
యోపిన ద్రోణ భీష్మ కృప యోధులనేకులు గూడి కౌరవ
క్ష్మాపతికార్యమేమయినఁ జాలిరె చేయఁగ నాడు భాస్కరా!
78
ఉ. భూరి బాలాఢ్యుఁడైనఁ దలపోయక విక్రమశక్తిచే నహం
కారము నొందుటల్‌ తగవు గాదతఁడొక్కెడ మోసపోవుఁ గా
వీరవరేణ్యుఁ డర్జునుఁడు వింటికి నే నధికుండ నంచుఁ దా
నూరక వింటినెక్కిడఁగ నోపడు కృష్ణుఁడు లేమి భాస్కరా!
79
ఉ. భ్రష్టున కర్థవంతులగు బాంధవులెందఱు గల్గినన్‌ నిజా
దృష్టము లేదు గావున దరిద్రతఁ బాపఁగలేరు; సత్కృపా
దృష్టిని నిల్పి లోకుల కతిస్థిరసంపద లిచ్చు లక్ష్మి యా
జ్యేష్ట కదేటికిం గలుగఁజేయదు తోడనె పుట్టి భాస్కరా!
80
AndhraBharati AMdhra bhArati - shatakamulu - bhAskara shatakaM - mAravi veMkayya ( telugu andhra )