వచన సాహిత్యము | వ్యాసములు | రంగనాథుని శివకవిత్వము శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి |
రంగనాథుని శివకవిత్వము
శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి
చాటుపద్యమణిమంజరి
రంగనాథుఁడను కవీశ్వరునిఁ గూర్చి యిటీవల చెలరేగిన వాద దావాగ్నిలోఁ జిక్కువడి నే నొడలు కాల్చుకొనఁజాలను. ప్రాచీన కావ్యలక్షణ శాస్త్ర కవి చరిత్రాది పరిజ్ఞానము గొల్పుటలో నాకుఁ బ్రాచీన లక్షణ గ్రంథకర్తలు పితృతుల్యులు. ఉహ్వని యువ్వెత్తున వారి పరిజ్ఞానము నుత్తుత్తిదానిఁగా నే నూఁదివేయఁజాలను. వారు భ్రమప్రమాదములు లేనివారనఁ గాదు. ప్రబల ప్రమాణములచే నట్టి వట్టి సరకును నిరూపించి కొట్టివేయుట లగ్గు. రంగనాథునిఁ గూర్చి యుపలబ్ధాంశముల నెత్తిచూపుటకే నాయీ యుపక్రమము. ఇందు ప్రామాణ్య చర్చను ప్రాజ్ఞులు కావింపఁగలరు గాక!
౧
కర్ణాటక కవియగు తొంటెదార్యకవి 'పాల్కురికి సోమేశ్వర పురాణము'న రంగనాథుని విషయము నిట్లు చెప్పినాఁడు. చక్రపాణి రంగనాథుఁడను వైష్ణవునితో సోమనాథునకు మతవిషయమునఁ దగవు వాటిల్లెను. అశైవుని దర్శింపఁడుగాన సోమనాథుఁడు తెరచాటున నుండి వాదముచేయ నంగీకరించెను. కాని యావైష్ణవుని జయించుటకు సోమనాథుని పుత్రుఁడగు చతుర్ముఖ బసవేశ్వరుఁడే తలపడెను. వారిర్వురకు గొప్ప వాదము జరిగెను. రంగనాథుఁ డోడిపోయెను. పరాజయదుఃఖముతో నారంగనాథుఁడు శ్రీశైల మార్గముననే తిరిగి పోయెను. శ్రీశైల మల్లికార్జునిఁ జూడక ద్వేషబుద్ధితోనే యరిగెను. ఆ శివద్వేషముచే నాతనికిఁ గన్నులు గ్రుడ్డివయ్యెను. అహోబలమున కరిగి యాతఁడు నరసింహస్వామిని బ్రార్థించెను. ఆ స్వామివలన స్వప్నమున శివాధిక్యబోధమును బడసి లజ్జితుఁడై తిరిగి శ్రీశైలమునకు వచ్చి మల్లికార్జునుని బహువిధములఁ బ్రస్తుతించెను. ఒక కన్ను వచ్చెను. పదపడి పాలుకురికికి వచ్చి సోమనాథునిఁ దర్శించి యపచారము క్షమింపఁ బ్రార్థించెను. సోమనాథుఁ డనుగ్రహించెను. రెండవ కన్నును వచ్చెను. రంగనాథుఁడు శైవదీక్ష నొసఁగుమని సోమనాథునిఁ బ్రార్థించెను. పుత్రుఁడగు చతుర్ముఖ బసవేశ్వరుని చేత సోమనాథుఁ డాతని శివదీక్షితుని జేయించెను. రంగనాథుఁ డప్పుడు వీరభద్ర విజయ శరభ చరిత్రాదులను రచియించి గురుపాదముల కర్పించెను.
౨
పాల్కురికి సోమనాథపురాణమే కాక కర్ణాటకకృతి యగు గురురాజచరిత్రము గూడ నీ చక్రపాణి రంగనాథుని చరిత్రమును జెప్పుచున్నది. తొంటెదార్యకవి చెప్పినట్టే యా గురురాజ చరిత్రకర్త సిద్ధనంజేశకవియు రంగనాథుని యోటమిని జెప్పినాఁడు. 'వీరభద్ర విజయము', 'శరభలీల' యను గ్రంథములనే కాక యాతఁడు శ్రీగిరినాథ విక్రమ మని యేనూఱు సీసపద్యముల తెలుఁగు గ్రంథమును గూడ రచించెనట! దానినే సంస్కృతమునఁ గూడ రచించెనట!
ఆ కవి యిట్లు చెప్పుచున్నాఁడు.
'శ్రీశైల భర్తకును సీసంగ ళేనూఱు
లే సప్ప పద్యంగ ళెంటు సావిరగళుం
భాసురద దండకం సాహస్ర తారావళియు నాల్కు లయగ్రాహియు
ఆశతక వృత్తగళు దోధకం సావిరవు
భాసురద తోటకం నూఱు రగళెగ ళేడు
భాషిసిద మత్తకోకిల మూఱుసాసిరం గీతియం తాఱునూఱు
సరస మంజెర వెంటు కందంగ ళైనూఱు
విరచిసిద కృతియు మూవత్తాఱు గద్యగళు
నిరువ మూవత్తాఱు వుభయశతకం వొప్పు మిగిలు సర్వేశనిమగె' 226
ఇందు 'శ్రీగిరినాథ విక్రమము' అను పేర శ్రీశైల మల్లికార్జునుని పై నైదువందల సీసపద్యములను, నెనిమిదివేల పద్యములు గల మరొక గ్రంథమును, వేయిపాదములు గల దండకమును, నొక తారావళిని, నాలుగు లయగ్రాహులను, నొక వృత్తశతకమును, వేయి దోదక వృత్తములను, నూఱు తోటక వృత్తములను, నేఁడు రగడలను, మూఁడువేల మత్తకోకిలలను, నాఱు వందల గీత పద్యములను, నెనిమిది మంజరులను, నైనూఱు కందములను, ముప్పదియాఱు గద్యములను, ముప్పదియాఱు ఉభయశతకములను చెప్పినట్లు ఈ పద్యమునందున్నది. ఇతని యీ కృతులెల్ల నిప్పుడు మనకు గానరావు.
౩
కాని శివదూషణచేఁ గన్నులుపోఁగా శివస్తుతిచేఁ గన్నులు తెచ్చికొన్నట్లుగా రంగనకవి రచించినట్లుగా శ్రీగిరి మల్లికార్జునునిమీఁద రగడ యొకటి యున్నది. 'శివభక్తిదీపిక' యని దానికిఁబేరు. దానికే 'నయనరగడ' యని నామాంతరము.
౪
నేఁడు 'శివమంత్ర వర్ణనము' అనుపేర మఱియొక రగడ రంగనాథుఁడు రచించినదిగానే దొరకినది. 'నమశ్శివాయరగడ' యని దీనికి నామాంతరము. దీని కడపట నీ క్రింది పద్యమున్నది.
'అని మన? (మును?) రంగనాథుఁడు దయానిధి శ్రీగిరినాథుమీఁద జె
ప్పిన శివమంత్రవర్ణనము చిత్తసముద్గత భక్తియుక్తి వ్రా
సినఁ గొనియాడిన\న్ వినినఁ జెల్వెసలారఁ బఠించిన\న్ జగ
జ్జనులకుఁ బుణ్యసంపద లసంఖ్యములై సమకూఱు నిమ్మహి\న్.' 227
ఈ పద్యమును రంగనాథుఁడే రచించెనో లేక తర్వాతికాలమున నితరుఁడే రచించెనో! ఈ రెండు రగడల నిప్పుడిక్కడఁ బ్రకటించినాఁడను. సిద్ధనంజేశ కవి పద్యములో లెక్కింపఁబడిన రంగనాథుని రగడ లేడింటిలో నిప్పటికి రెండు రగడలు దొరకిన వనవచ్చును. 1. శివభక్తిదీపిక యను నయనరగడ 2. శివమంత్రవర్ణన మను నీ నమశ్శివాయ రగడ.
౫
శివభక్తిదీపిక వ్రాఁతప్రతిలో కడపట నిట్లున్నది.
'వైష్ణవ చక్రపాణి రంగనాథుఁడు శైవ దీక్షాధారణమైన తర్వాతను చేసిన నయన రగళ'
౬
ఏకశిలానగర వృత్తాంతము'లో రంగనాథుని గూర్చి యిట్లున్నది.
'రంగనాథుఁడు ఆందోళికపై నెక్కి చనుదెంచునప్పుడు
త్రిపురాంతక దేవుని గోపురంబు జూచి "అదియేమి" యని యడిగిన నావివరాలు
త్రిపురాంతక గోపురంబని పలుకుటయు నాశివభవనంబు జూడనొల్లక మైనపుజడ్లు
కప్పించుకొనియె. అప్పుడు రంగనాథుని నేత్రంబులు గానరాక జాత్యంధుని
వలెనే మగిడి శ్రీరంగానకు పోయి యద్దేవుని బ్రసన్నుని జేసికొని నేత్రంబులు
పోయెనని మొఱయాడుటయు, నద్దేవుండు కరుణించి త్రిపురాంతక దేవుణ్ణి
వేడుకొమ్మనుటయు రంగనాథుండు మళ్ళీ త్రిపురాంతకమున కేతెంచి
యద్దేవునకు నమస్కరించి తనయెత్తు కృతులు సమర్పింతునని
వ్రతంబుచేసి భక్తిమయంబగు రగడ చెప్పిన నద్దేవుండు ప్రసన్నుండై
రంగనాథునకు నిరుకన్నుల నొసగుటయు రంగనాథుఁడు పాలకూర్తికింజని
సోమనాథునిచే శివదీక్ష గైకొనియె. ఆయయ్య వద్ద శైవరహస్యంబులు
తెలిసికొనుచుండె. అంత నిక్కడ ప్రతాప రుద్రుండు రంగనాథుని
ప్రభావంబు విని యాశ్చర్యంబు నొందెను'. రంగనాథుని గూర్చిన
పై కథ నిన్ననో నేఁడో యెవరో సృష్టించిరని యుజ్జగింప వీలులేనిది.
౭
శ్రీనాథుని సమకాలపువాఁడగు కొలని గణపతి దేవుఁడు తన 'శివయోగ సారము' న చక్రపాణి రంగనకవి నిట్లు స్తుతించినాఁడు.
'అసమ శివభక్తి రసమా
నసునిం బాల్కురికి సోమనాథుని, గవిరా
జ సమున్నత యశు సద్యః
ప్రసాది యగు చక్రపాణి రంగనఁ గొలుతు\న్' 228
౮
గురురాజకవి పద్యమున రంగనాథుఁడు నూఱు తోటక వృత్తములను గూడ రచించినట్లు కలదు. ఛందో గ్రంథములలో రంగనాథుని తోటకములివి రెండు కానవచ్చినవి.
బాలబోధ చ్ఛందస్సులో -
తోటకము.
ఉపవాసము లెల్లను నుండుట నీ
కృప వచ్చుటకా యది రిత్త సుమీ
యపవిత్రునిఁ బుల్లని యంబలికై
సుపవిత్రునిఁ జేయుట సుద్ది గదే. 229
హనుమచ్ఛందస్సులో -
తోటకము.
చెలువార గజాజిన చేలముతో
గళనీలిమతో నహి కంకణుఁడై
తలఁ జంద్రకళం గల దైవము మా
కులదైవము దైవత కోటులలో\న్. 230
వీనినిబట్టి సిద్ధనంజేశ కవి చెప్పిన తోటకవృత్తములను రంగనాథుఁడు రచించుట సమర్థిత మగుచున్నది.
రంగనాథుని యనుకరణము కావచ్చును, కాశీఖండమున శ్రీనాథుఁడు కూడ తోటక వృత్త రచనము చేసినాఁడు.
*౯
బాలబోధచ్ఛందమున రంగనాథునిదిగా నీక్రింది కందపద్యము కలదు.
క॥ ఫాలతల భస్మరేఖలు -- 231
౧౦
ప్రయోగరత్నాకరములో రంగనాథుని మిత్రవిందాపరిణయము లోనిదిగా క్రింది పద్య భాగమున్నది.
"వనమాలి గొలుచు నందుననె యెల్లప్పుడు" 233
౧౧
పలువురు శివకవులు కవిస్తుతిలో రంగనాథుని శివకవినిగా స్తుతించినారు. మచ్చుకు ఒకటి.
భద్రకవి లింగకవి రంగనాథ ప్రశంస.
'దండితోఁ బండితత్రయముఁ గీర్తించి
సకలవేదపురాణ శాస్త్రేతిహాస
నికరార్థములు ప్రమాణించి సద్భక్తి
శ్రీమతి నుద్ధరించిన పాలకుఱికి
సోమనాథేశ్వరు సొంపుతోఁ గొలిచి
రంగద్విశాలాంతరంగంబునందు
రంగనాథునిఁ గవిరాజన్యుఁ దలఁచి
యసమాన చరితుఁ బ్రత్యగ్ర కల్యాణ
బసవేశుఁ బిడుపర్తి బసవేశుఁ గొలిచి' (సానందోపాఖ్యానము) 234
౧౨
వైష్ణవుఁడైన చక్రపాణి రంగనాథుఁడు శైవుఁడై రంగనకవి యయినాఁడు. ఇట్లే శైవుడైన తెనాలిరామలింగ కవి వైష్ణవుఁడై రామకృష్ణుఁడయినాఁడు.
౧౩
అదలని తేరు తేరికిని నాదరువై తగువిల్లు వింటికిం
గుదురగు నారి నారిపయిఁ గూన్కు శరంబు శరంబు బొడ్డునం
బొదలిన యంత యంతముఖముల్ నిజవాసములైన గుఱ్ఱముల్
చెదరక నీకు నెట్టి పని సేయు నయా! గిరిజాధినాయకా! 235
ఓజు చేముట్టక యొగ్గానఁ బట్టక
చక్కఁగా దివిఁ బాఱు చక్రములును
లాయానఁ గట్టక లలి మేఁత వెట్టక
వర్ణహీనంబైన వారువములు
తపనవెట్టక జీవితము కాసు ముట్టక
సత్త్వసంపదఁ జూపు సారథియును
కడచీలఁ దట్టక ఘనముగా మెట్టక
గంభీర సంపద గలుగునిరుసుఁ
గలిగి తనరారునరదంబుఁ గడఁక నెక్కి
త్రిపురవిజయంబుఁ జేకొన్న దేవదేవుఁ
డిందుశిఖరుఁ డానంద మందిరుండు
మనలఁ గరుణావిధేయుఁడై మనుచుఁగాత! 236
గోశతపంచవార్ధులును గోయుగవార్ధులు గోత్రివార్ధులు\న్
గోశరవార్ధులు\న్ విదితగోశర (వార్ధులు) పంచవార్ధులా
కేశవతల్ప పద్మభవ కేకిపవాహన దానవేశ దే
వేశుల కిచ్చునట్టి పరమేశ్వరుఁ డీవుత మా కభీష్టముల్. 237
౧౪
పొత్తపి వెంకటరమణకవి రచించిన లక్షణశిరోమణి యను లక్షణ
గ్రంథములో 'అచ్చవెల్లి రంగన్న గారు' అను పేర రంగనాథ రామాయణ
ద్విపద లుదాహరింపఁబడినవి. 'అచ్చవెల్లి' యను గ్రామము నేఁడు
కడపజిల్లా పులివెందల తాలూకాలో నున్నది.
౧౫
ఒకానొక లక్షణ గ్రంథమున నిట్లున్నది.
రంగనాథయ పద్యము:-
ఉ.
మంచెన చూచితే శివసమాహిత చిత్తులు పద్మవాసనా
కుంచన చంచదున్మిషిత కోమలమూల సరోజకర్ణికా
భ్యంచిత బిందునాదరస భవ్యనిరంతర శబ్దవల్లి శీ
లించు తెఱంగు శ్రీగిరిఁ జలింపని మర్త్యనిలింపు లింపున\న్. 238
*ఈ పట్టున శ్రీ ప్రభాకరుల నోట్సులో క్రింది యంశము కలదు.
ఎఱ్ఱాప్రెగడ - వనక్రీడపట్టు.
తోదకం.
"తాలిమి దూలిన తాపసపత్నుల్
వ్రీళమనంబున వీడ్కొని చేరన్
లోల మదాలసలోచన పంక్తిన్
జాలఁగ నొప్పెను శంకరలీలన్" 232
కృతజ్ఞతలు: |
శ్రీమతి జ్యోత్స్న ఆదూరి వారి విలువైన సమయమును వెచ్చించి ఎంతో ఓపికతో ఈ వ్యాసమును Transliterate చేసి యిచ్చినారు. వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. |
రంగనాథుని రగడలను యిక్కడ చదువగలరు. |
![]() |
![]() |