భాష బాల వ్యాకరణము కృదంత పరిచ్ఛేదము
1. కృత్తుల కర్థంబులు యథావ్యవహారంబుగ గ్రాహ్యంబులు.
ధాతువునకు విహితంబు డుఞ్భిన్న ప్రత్యయంబు కృత్తునాఁబడు.
కృత్తులకు వక్ష్యమాణంబులకు భావకర్తృ కర్మాద్యర్థంబులు మహాజన వ్యవహారానుసారిగా నెఱుంగునది.
ఆఁక - బంధనము - మొలక - నవోద్భిదము - ఏలిక - పాలకుఁడు.
కోరిక - వాంఛయు - వాంఛితంబును.
మూఁక - సంఘము. ఆడిక - నింద. ఓడిక - స్రోతస్సు.
2. ఇటం గృత్కగతపవేములు పరంబులగునపుడు క గ చ య వ ల కు లోపంబగు.
కృత్సంబంధులగు కాదులు పరంబు లగునపుడు ధాతువునంతంబులగు కగచయవలకు లోపంబగు.
మీఁది లక్ష్యంబులం జూపంబడు.
3. కవర్ణకం బలుగ్వాదుల కగు.
అలుగు - అలుక, ఆఁగు - ఆఁక, ఎఱుఁగు - ఎఱుక.
ఇట బిందు లోపంబు. ఇట్లు కొన్నింట గ్రహించునది.
కడఁగు - కఁడక, కలఁగు - కలఁక, కాఁగు - కాఁక, తునుఁగు -తునుక, నడచు - నడక, నలఁగు - నలఁక, పోవు - పోక, మడఁగు - మడక, మలఁగు - మలఁక, మునుఁగు - మునుక, మూఁగు - మూఁక, మొలచు - మొలక, వచ్చునకు రా - రాక, వంగు - వంక, వీఁగు - వీఁక.
ఇఁక క పులు పరంబులగునపుడు కనునకు దీర్ఘంబగు - కానుక.
కినియు ముదియుల కుత్వంబునగు.
కినియు - కినుక. ముదియు - ముసుక. ఇత్యాదు లలుగ్వాదులు.
4. ఇమివర్ణకంబు కలుగ్వాదుల కగు.
కలుగు - కలిమి, ఓరుచు - ఓరిమి, కూరుచు - కూరిమి, నేరుచు - నేరిమి, వ్రేలుచు - వ్రేలిమి, బడియు - బడిమి, బ్రదుకు - బ్రదిమి, ఒడ్డు - ఒడ్డిమి, తాలు - తాలిమి.
5. తృఙ్వర్ణకంబు చేయ్వాదుల కగు.
చేయు - చేఁత, అలయు - అలఁత, కూయు - కూఁత, కోయు - కోఁత, గీయు - గీఁత, నేయు - నేఁత, పూయు - పూఁత, పోయు - పోఁత, మూయు - మూఁత, మేయు - మేఁత, మ్రోయు - మ్రోఁత, రోయు - రోఁత, లాయు - లాఁత, వ్రాయు - వ్రాఁత, వ్రేయు - వ్రేఁత.
6. కువర్ణకం బడంగ్వాదుల కగు.
అడఁగు - అడఁకువ, ఎఱుఁగు - ఎఱుఁకువ, కలఁగు - కలఁకువ, నలుఁగు - నలఁకువ, పెనఁగు - పెనఁకువ, పొలయు - పొలకువ, మఱచు - మఱకువ, మెలఁగు - మెలఁకువ, లోగు - లోఁకువ, వేగు - వేకువ.
7. టవర్ణకం బాడ్వాదులకగు నగుచో నంతలోపం బగు.
ఆడు - ఆట, ఊరు - ఊట, ఊఱడు - ఊఱట, ఏఁకరు - ఏఁకట, ఓడు - ఓట, తివురు - తివుట, తేరు - తేట, త్రిమ్మరు - త్రిమ్మట, పండు - పంట, పాడు - పాట, మండు - మంట, వండు - వంట, వేసఱు - వేసట.
అనుప్రయుక్తంబయిన యాటశబ్దంబు ప్రాయికంబుగాఁ గ్లీబసమంబగు.
కోలాటము - పోరాటము - మండ్రాటము ఇత్యాదులు.
8. టు వర్ణకంబు పడ్వాదుల కగుచో నవి యాద్యక్షరశేషంబు లయి దీర్ఘంబు నొందు.
పడు - పాటు, చెడు - చేటు, అడుచు - అటు, కఱచు - కాటు, పొడుచు - పోటు, వయిచు - వాటు, ఏయు - ఏటు, ఓడు - ఓటు, వ్రేయు - వ్రేటు.
9. ప వర్ణకంబు తిరియ్వాదుల కగు.
తిరియు - తిరిపము.
కలియున కత్వంబు నగు - కలపము.
పొలయు - పొలపము, మురియు - మురిపము, సొలయు - సొలపము, వలియు - వలిపము.
10. త వర్ణకం బావులించు లోనగు వాని కగు.
ఆవులించు - ఆవులింత, ఇగిలించు - ఇగిలింత, ఓకిలించు - ఓకిలింత, కుళ్ళగించు - కుళ్లగింత, కుసిలించు - కుసిలింత, కొక్కరించు - కొక్కరింత, కొప్పరించు - కొప్పరింత, గిలిగించు - గిలిగింత. ఇత్యాదులెఱుంగునది.
11. పు వర్ణకంబు మాయ్వాదుల కగు.
మాయు - మాపు, మేయు - మేపు, అడుచు - అడుపు, ఇంచు - ఇంపు, ఏఁచు - ఏఁపు, ఏచు- ఏపు, కను - కానుపు, కాచు - కాపు, చూచు - చూపు, తలఁచు - తలఁపు, తోఁచు - తోఁపు, త్రేఁచు - త్రేఁపు, త్రోచు - త్రోపు, పూఁచు - పూఁపు, పెనచు - పెనుపు, పొలుచు - పొలుపు, ప్రోచు - ప్రోపు, మెచ్చు - మెప్పు, మోచు - మోపు, వలచు - వలపు, వాచు - వాపు. ఇత్యాదులు మాయ్వాదులు.
12. ఇక వర్ణకం బంజ్వాదుల కగు.
అంజు - అంజిక, అమరు - అమరిక, అరయు - అరయిక, అలయు - అలయిక, ఆడు - ఆడిక, ఓడు - ఓడిక, ఓపు - ఓపిక, కను - కానిక, కూడు - కూడిక, కోరు - కోరిక, పొందు - పొందిక, పోలు - పోలిక, తూను తూఁగునకగు - తూనిక.
ఇత్యాదు లంజ్వాదులు.
13. అప్పాదులకు నఙి యగు.
అప్ప - అప్పన, ఉజ్జ -ఉజ్జన, ఒప్ప -ఒప్పన, గట్ట - గట్టన, గడ -గడన, దట్ట - దట్టన, దీవ - దీవన, పాట - పాటన, మన్న - మన్నన, వీచు - వీవన.
14. బడి యేల్వాదుల కగు.
ఏలుబడి - కట్టుబడి - కనుబడి - కొనుబడి - గిట్టుబడి - చెల్లుబడి - చేరుబడి - తగులుబడి - తీఱుబడి - పెట్టుబడి - పోబడి - మ్రొక్కుబడి - వచ్చుబడి - సాగుబడి.
15. గడ చేర్వాదుల కగు.
చేరుగడ - తిరుగడ - తీఱుగడ - తేఱుగడ - తేగడ - మనుగడ - విడుగడ - వీడుగడ.
16. ఇకి కోర్వాదుల కగు.
కోరికి - పూనికి - పోలికి - మనికి - వినికి - చూడు చూచు నకగు - చూడికి.
17. వు వర్ణకంబు మన్వాదుల కగు.
మను - మనువు, కాచు - కాపు, కొలుచు - కొలువు, చచ్చు - చావు, తడయు - తడవు, నిలుచు - నిలువు, నొచ్చు - నోవు, పూచు - పూవు, ప్రుచ్చు - ప్రువ్వు.
18. అ వర్ణకంబు గీఱ్వాదుల కగు.
గీఱ - ఊఁద - ఎండ - కాయ - చదియ - తునియ - పరియ - పాయ - పిడుచ - మీట - ముడియ - వరద - వ్రయ్య.
19. అక వర్ణకంబు మాఱ్వాదుల కగు.
మాఱు - మాఱకము, అమ్ము - అమ్మకము, అంపు -అంపకము, పంచు పంపు - పంపకము, వండు (డకారంబు టకారంబగు) వంటకము, త్రోము - త్రోమకము, అద్దు -అద్దకము.
20. డు వర్ణకం బాఱ్వాదుల కగునపుడు పకారంబు చయల కగు.
ఆఱు - ఆఱుడు, అమ్ము - అమ్ముడు, అల్లు - అల్లుడు, ఎక్కు - ఎక్కుడు, క్రుమ్ము - క్రుమ్ముడు, చోపు - చోపుడు, త్రొక్కు - త్రొక్కుడు, త్రోచు - త్రోపుడు, దంచు - దంపుడు, దాఁచు - దాఁపుడు, దిగు - దిగుడు, దోఁచు - దోఁపుడు, పెంచు - పెంపుడు -ప్రేపుఁడు, ప్రాఁకు - ప్రాఁకుడు, మాయు - మాపుడు, రాచు - రాపుడు. ఇత్యాదులు
21. ఉ వర్ణకం బడుక్వాదుల కగు.
అడుకు - అంటు - ఒప్పు - ఒఱుగు - ఒసఁగు.
22. వడి ప్రభృతు లిట్లెఱుంగునది.
వడి: కొలువడి - గెలువడి - నడవడి. వ్యతిరేకంబున లేవడి.
వి: తనివి - తెలివి - విరివి.
అవు: తగవు - నగవు - ఉఱవు.
ఇ: చేయి - వ్రాయి.
కలి: కనుకలి - వినుకలి. ఇత్యాదులు.
మహాజన వ్యవహారంబుల నెఱుంగునది.
AndhraBharati AMdhra bhArati - bhAshha - bAla vyAkaraNamu - kR^idaMta parichchhEdamu - chinnaya sUri - andhra telugu tenugu ( telugu andhra )