భాష బాల వ్యాకరణము క్రియా పరిచ్ఛేదము
1. ధాతువునకు.
ఇది అధికార సూత్రంబు. ఇంక నెయ్యది యుపక్రమింపం బడునయ్యది ధాతువున కగునని యెఱుంగునది.
2. వర్తమానంబున ల ట్టగు.
వర్తమాన క్రియావృత్తియగు ధాతువునకు లడ్వర్ణకంబగు. వర్తమానంబు నాఁ బ్రారబ్ధాపరిసమాప్తంబుం - అప్పటికి ముగియకుండునది.
3. భూతంబున లి ట్టగు.
భూతక్రియావృత్తియగు ధాతువునకు లిడ్వర్ణకంబగు. భూతంబు నా విద్యమాన ధ్యంస ప్రతియోగి - ముందుండి యప్పటికి లేకుండునది.
4. భావిని లృ ట్టగు.
భావిక్రియావృత్తి యగు ధాతువునకు లృడ్వర్ణకంబగు. భావి నా విద్యమాన ప్రాగభావ ప్రతియోగి - అప్పటికిఁ బుట్టకుండునది.
5. తద్ధర్మాదులందు లా ట్టగు.
తద్ధర్మాతి క్రియావృత్తియగు ధాతువునకు లాడ్వర్ణకంబగు. తచ్ఛీల సంభావనా సంప్రశ్న సాతత్య వర్తమాన భావ్యాశీరాదులాదిపద గ్రాహ్యంబులు.
6. ఆశీశ్శాస సంప్రార్థనవిధులందు లూ ట్టగు.
ఆశీరాదులందు ధాతువునకు లూడ్వర్ణకంబగు.
7. వ్యతిరేకంబున లఙి యగు.
వ్యతిరేక విశిష్ట క్రియావృత్తియగు ధాతువునకు లఙివర్ణకంబగు.
8. లకారంబునకు డుఙ్రువురును ముఞ్ఞగు.
లడాది లకారంబులం దొక్కొక్కటికి డుజాదు లాదేశంబులగు.
ఇందు ఞాకారంబు ప్రత్యాహారార్థంబు.
9. అందు వరుసను రెండేసి ప్రథమమధ్యమోత్తమంబు లనంబడు.
డుఙ్‌ - రు - ప్రథమము, వు - రు మధ్యమము, ను - ము ఉత్తమము.
10. వానిలో రు ము లు బహువచనంబులు, పెఱ లేకవచనంబులు.
11. నామ యుష్మదస్మ దర్థములందుం బ్రథమమధ్యమోత్తమంబు లగు.
12. అమహదర్థంబునందు డుఙ్రులకు దు వు లగు, నున్నానుబంధంబు మీఁద దివియగు.
13. ఉదంతంబునకు లట్టు పరంబగునపు డున్నానుబంధం బగు.
ఉదంతంబయిన ధాతువునకు లట్టు పరంబగునపుడు - ఉన్న అను శబ్దంబనుప్రయుక్తంబగు.
14. ఉన్న శబ్దంబు పరంబగునపుడు చువర్ణకం బగు.
15. దివీతరం బగు డుఞ్ఞు పరంబగునపు డున్నానుబంధంబు నకు దీర్ఘం బగు.
ప్రథమము: వాఁడు వండుచున్నాడు - వారు వండుచున్నారు - అది వండుచున్నది - అవి వండుచున్నవి.
మధ్యమము: నీవు వండు చున్నావు - మీరు వండుచున్నారు.
ఉత్తమము: నేను వండుచున్నాను - మేము వండుచున్నాము.
16. లిడ్లాట్టుల డుఙ్ఙున కెను ను వర్ణంబు లగు.
లిడాదేశంబగు డుఙ్ఙునకు - ఎను - అనునదియు, లాడా దేశంబగు డుఙ్ఙునకు - ను అనునదియు నాదేశంబగు.
17. భూతంబునం దిగాగమం బగు.
భూతార్థ వృత్తియగు ధాతువున కిగాగమంబగు.
18. లిట్టు వుఙ్ఙు పరంబగునపుడు తి వర్ణకం బగు.
ఇకారంబు మీఁది కు - ను - వు క్రియా విభక్తుల యను సూత్రముచే రుఞ్ఞున కిత్వంబు.
ప్ర: వండెను, వండిరి.
మ: వండితివి, వండితిరి.
ఉ: వండితిని, వండితిమి.
19. కలఙ్యనుబంధంబు లృట్టు పరంబగునపు డగు.
లృట్టు పరంబగునపుడు ధాతువునకు - కలఙి అనునది యనుప్రయుక్తంబగు.
20. ఙీత్తు పరంబగునపు డుత్వంబున కత్వం బగు.
ఙీత్తు పరంబగునపుడు ధాతువు నుత్వంబున కత్వంబగు.
21. కలఙి పడుఙులు పరంబులగునపుడు నుగాగమం బగు.
ద్రుతకార్యంబు.
ప్ర: వండఁగలడు - వండఁగలరు - వండఁగలదు - వండఁగలవు.
మ: వండఁగలవు - వండఁగలరు.
ఉ: వండఁగలను - వండఁగలము.
22. లాట్టు రుఞ్ఞు పరంబగునపుడు దుగాగమం బగు.
ప్ర: వండును - వండుదురు.
మ: వండుదువు - వండుదురు.
ఉ: వండుదును - వండుదుము.

లాడర్థంబులయం దోలి నుదాహరణంబులు వక్కాణించెద.
తద్ధర్మంబు: కులాలుఁడు కుండలు వానును.
తచ్ఛీలంబు: జ్వలనజ్వాలంబు లుప్పరం బెగయును.
సంభావన: ఇప్పుడు వాడింటనుండును.
సంప్రశ్నము: ఉందునా - పోదునా.
సాతత్యము: సర్వంబునం దీశ్వరుఁడుండును - సర్వంబీశ్వరుని యందుండును.
వర్తమానంబు: మేననిప్పుడుం బులకలు వొడమెడును.

వక్ష్యమాణవిధిచేఁ బ్రాయికంబుగ వర్తమానంబునం దెడు గాద్యాగమంబులగు.
భావి: వాఁడు ఱేపు వచ్చును.
ఆశీస్సు: శుభం బగును.

వచ్యర్థంబుల కొకానొకచో భూతంబున లాట్టు గానం బడియెడును.
23. లాట్టు రుఞ్ఞు పరంబగునపు డెదగాగమంబును, బ్రథమ నువర్ణకంబు పరంబగునపు డెడు గెడి గాగమంబులును బహుళంబుగా నగు.
ప్ర: వండెడును - వండెడిని - వండెదరు.
మ: వండెదవు - వండెదరు.
ఉ: వండెదను - వండెదము.
24. లిడ్లాట్టుల వకారంబునకు లోపంబు విభాష నగు.
వండితి - వండితిని, వండుదు - వండుదువు, వండెదు - వండెదవు.
25. తిర్యగ్జడంబులు వాచ్యంబు లగునపుడు లిడ్లాట్టుల ప్రథమ బహువచనంబున కేకవచనం బగు.
చిలుకలు వలికెను - చిలుకలు వలుకును - చిలుకలు వలికెడును.
మేఘములు గర్జిల్లెను - మేఘములు గర్జిల్లును - మేఘములు గర్జిల్లెడును.
26. లూట్టు డుఞ్ఞున కెడు త వర్ణంబులు ద్రుతాంతంబులగు.
ఆశీస్సు: మీకు మేలు గలిగెడును - మీకు మేలు గలుగుతను.
శాపంబు: నీకు రాక్షసత్వంబు గలిగెడును - నీకు రాక్షసత్వంబు గలుగుతను.
సంప్రార్థనంబు: హరి ననుఁ గృపగాంచెడును - హరి ననుఁ గృప గాంచుతను.
27. విధియందు లూట్టునకు మాఱుగా నది యను తచ్ఛబ్దంబును ముందు నుగాగమంబు నగు.
మైత్రుండు నా నిర్దిష్ట కార్యంబు చేయునది. వానికి నీవు బాసటయయి యుండునది.
28. ఎడు త ల ద్రుతంబున కచ్చు పరంబగునపుడు మకారం బగు.
నీకు మేలు గలిగెడు మనియెను - నీకు మేలు గలుగుత మనియెను.
29. లూణ్మధ్యమ వు రు లకు ముడుఙ్ఙు లగు.
ఆశీస్సు: దీర్ఘాయువ వగుము - దీర్ఘాయులరగుఁడు.
శాపంబు: రాక్షసుఁడ వగుము - రాక్షసులరగుఁడు.
సంప్రార్థనంబు: నన్ను రక్షింపుము - నన్ను రక్షింపుఁడు.
విధి: నా చెప్పిన పని చేయుము - నా చెప్పిన పని చేయుఁడు.
30. ఉభయప్రార్థనంబునం దుగాగమంబున కత్వం బగు.
మనము వండుదము.
31. మధ్యమ ముడుఙ్ఙులు ముఙ్ఙులు నాఁబడు.
ఙీత్తుపరంబగునపు డుత్వంబున కత్వంబగునను సూత్రముచే లఙిపరంబగునపుడు డత్వంబు. ప్ర: వండఁడు - వండరు - వండదు - వండవు.
మ: వండవు - వండరు.
ఉ: వండను - వండము.
32. వ్యతిరేకంబున ముఙ్ఙు పరంబగునపుడు కుఙి యగు.
నీవు వండకుము - మీరు వండకుఁడు.
33. సంప్రార్థనంబుల ముఙ్ఙున కదాదులు విభాష ననుప్రయుక్తంబు లగు.
వండుమ - వండుమా - వండుమి - వండుమీ - వండుఁడ - వండుఁడా - వండుఁడి - వండుడీ.

అ - ఆ - ఇ - ఈ - ఎ - ఏ - ఒ - ఓ - అమ్మ - అయ్య ఇత్యాదు లదాదులు.
34. ఎదాదు లనుప్రయుక్తంబులగునపుడు ముఙ్ఙునకు వుఙి రుఙి యగు.
వినవె - వినవే - వినరె - వినరే - వినకువె - వినకువే - వినకురే.
35. ట వర్ణకంబు భావంబునం దగు.
భావంబనఁగా ధాత్వర్థంబు.
వండుట - పండుట - వినుట - కనుట.
36. కఙి వర్ణకంబు పురార్థయోగంబున విభాషను భావంబునం దగు.
వండక మునుపు - వండుటకు మునుపు - చేయక మునుపు - చేయుటకు మునుపు - మునుపు - ముందు - మున్ను - తొల్లి.
37. వ్యతిరేకభావంబున మిఙి యగు.
వ్యతిరేక విశిష్ట క్రియాభిదాయి ధాతువునకు మిఙియగు.
వండమి - పండమి.
38. సమానాశ్రయంబులం బూర్వకాలంబునం దివర్ణకంబగు.
ఏకాశ్రయంబులకు క్రియలలోపల నెయ్యెది పూర్వకాలికం బగుం దద్వాచియగు ధాతువున కివర్ణకం బగు. ఇదియె క్త్వార్థంబు నాఁబడు.
వండి - పండి - విని - కని.

సమాన కర్తృకంబులనక సమానాశ్రయంబులనుటంజేసి చైత్రునిచేత మైత్రుండు కొట్టంబడి మడిసె నిత్యాది సిద్ధంబయ్యె.
39. కఙి వ్యతిరేక క్త్వార్థంబునం దగు.
వండక - పండక - కొట్టక - తిట్టక.
40. తుమర్థ భావలక్షణంబులందు నుఙి యగు.
భావలక్షణంబు నా నన్యక్రియకు లక్షణ భూతంబగు క్రియ.
తుమర్థంబందును, భావలక్షణంబు నందును ధాతువునకు నుఙి వర్ణకంబగు.
తుమర్థంబు: చైత్రుండు వండను బోయెను. పాకక్రియార్థము పోయెనని యర్థము.
భావలక్షణము: చైత్రుండు వండ నతిథి వచ్చెను. ఇచట వంట లక్షణము, వచ్చుట లక్ష్యము.
41. చేదర్థంబునందు, వృత్తంబగు భావలక్షణంబునందు న వర్ణకంబు ద్రుతాంతం బగు.
వానలు గురిసినం బంటలు పండును. వాఁడు రమ్మనినఁ బోయితిని.
42. ఆనంతర్యంబున డు వర్ణకంబు ద్రుతాంతం బగు.
జాబిలి తోతెంచుడుం గువలయంబులు వికసిల్లె.
43. చువర్ణకంబు ద్రుతాంతంబు క్రియాస్వయంబున శత్రర్థంబునం దగు.
చూచుచుం బోవుచున్నాఁడు - చూచుచుం బోయెను - చూచుచుం బోవఁగలడు.
44. తృ వర్ణకార్థంబునం దెడి యెడు వన్నియ లగు.
ప్రవహించెడి వాఁడు - ప్రవహించెడు వాఁడు. ప్రహర్తయని యర్థము.
45. వానికి లోపంబు బహుళంబుగా నగు.
ప్రహరించువాఁడు. ప్రహర్తయని యర్థము.
46. ఉన్న కలఙి న వర్ణకంబులు భవద్భావి శతృక్త వదర్థంబులం దగు.
ఉన్న వర్ణకంబు వర్తమానార్థక శత్రర్థంబునందగు - కలఙి వర్ణకంబు భవిష్యదర్థక శత్రర్థంబునందగు - నవర్ణకం బుక్తవదర్థంబు నందగు.

ఇవి సత్వాభిధానంబునం దగునని యెఱుంగునది.
సుబంత వాచ్యంబు సత్వంబునాఁబడు.
వండుచున్నవాఁడు - వండఁగలవాఁడు - వండినవాఁడు.
47. వ్యతిరేకి తృ వర్ణకార్థంబున నిఙీ యగు.
వండనివాఁడు.

ఎడి ప్రభృతి వర్ణకాంతంబు లేడును ధాతుజ విశేషణంబులని ప్రాచీనులు వ్యవహరింతురు.
48. లకారాదులు సకర్మకంబునకుం గర్తృకర్మంబులందును లాఁతికిం గర్తయందు నగు.
సకర్మకంబు నాఁ గర్మకాంక్షోత్ణాపకంబు - అకర్మకంబు నాఁ గర్మా కాంక్షానుత్థాపకంబు.
49. పడుఙ్య నుబంధంబు కర్మంబు నందగు.
కొట్టఁబడుచున్నాఁడు - కొట్టఁబడుచున్నది - కొట్టఁబడుట - కొట్టఁబడనివాఁడు.
50. గురువిరహితంబు లయి యయాంతంబులయిన యేకస్వర ద్విస్వరంబుల యించుగ్వక్రంబుల కియుడాగమంబు విభాష నగు.
ఏకస్వరధాతు ద్విస్వరధాతువుల మీఁది యించుగ్వక్రంబుల కియుడాగమంబు విభాషనగు. గురుమంతంబగు ధాతువునకును, యాంతంబగు ధాతువునకును మీఁది యించుగ్వక్రంబుల కియుడాగమంబురాదు.
భుజ్‌ - ఇయ్‌ - ఇంచు - భుజియించు. పక్షంబున భుజించు.
గున - ఇయ్‌ - ఇంచు - గుణియించు - గుణించు.

ఇంచుగ్వ్యవధానంబునం జేసి సంస్కృతధాతువులు వక్రపరకంబులు లేవని యెఱుఁగునది.
యాచ్‌ - అర్థ - ఇత్యాదులు గురుమతంబులు. వ్యయ - ఇది యాంతము.
యాచించు - అర్థించు - వ్యయించు.

జి - ఇంచు - అనుచో నిత్యంబగుటం జేసి యయుగమంబు రాఁగా యాంతంబగుటంజేసి యియుడాగమంబులేదని యెఱుంగునది.

కృతాకృత ప్రసంగి నిత్యంబు నాఁబడు.
నగు - ఇయ్‌ - ఇంచు - నగియించు - నగించు.
నగు - ఇయ్‌ - ఎను - నగియెను - నగెను.
పడు - ఇయ్‌ - ఎను - పడియెను - పడెను ఇత్యాదు లెఱుంగునది.
51. పడ్వాదుల న వర్ణకంబున కత్వంబును, గడహల్లునకు ద్విత్వంబును విభాష నగు.
పడ్డ - పడిన - పడ్డను - పడినను.

పడు - ఇడు - చెడు - తగు - అను - కను - కొను - తిను - మను - విను - చను ఇవి పడ్వాదులు.
52. క్రియాఫలంబు కర్తృగామి యగుచోఁ కొను ధాతు వనుప్రయుక్తం బగు.
ఇదియె యాత్మనేపదార్థంబని వ్యవహరింతురు.
వండుకొనుచున్నాఁడు.
53. కొను ధాతువు పరంబగునపు డిగాగమంబు బహుళంబుగా నగు.
వండికొనియె - వండుకొనియె.

బహుళం బనుటచే యాంతంబునకు నిత్యంబు.
చేసికొనియె.
54. ఇకార వక్రంబు లుక్తంబులందలవి పరంబులగుచోఁ యాకు సకారం బగు.
చేయు - చేసిరి - చేసి - చేసికొను - చేసెను - చేసెడిని - ఇత్యాదు లెఱుంగునది.
55. చువర్ణకంబు పరంబగునపు డన్వాదుల కుత్వలోపంబేని, ను స్థానంబున బిందువేని విభాష నగు.
అన్చున్నాఁడు - అంచున్నాఁడు - అనుచున్నాఁడు - అన్చును - అంచును - అనుచును.

అను - కను - కొను - తిను - మను - విను - యివి యన్వాదులు.
56. ఉన్న శబ్దంబు పరంబగునపు డుండు ధాతువునకు లోపం బగు.
ప్ర: ఉన్నాఁడు - ఉన్నారు - ఉన్నది - ఉన్నవి.
మ: ఉన్నావు - ఉన్నారు.
ఉ: ఉన్నాను - ఉన్నాము. ఉన్నవాఁడు.
57. చేదాద్యర్థనాంతం బయిన యుండు న కున్నాదేశంబు విభాష నగు.
ఉన్నను - ఉండినను.
58. తి దు ట లు పరంబులగునపు డన్వాదుల నుస్థానంబున సున్నయు, నుండు డు లోపంబును విభాష నగు.
అందురు - అంట - ఉందురు - ఉంట.
పక్షంబున అనుదురు - అనుట - ఉండుదురు - ఉండుట ఇత్యాది.
59. ఇట బిందువుమీఁద త ద లకు నిత్యవైకల్పికంబు లయి ట డ లగు.
అంటిని - అనితిని - అండురు - అందురు.
ఉంటిని - ఉండితివి - ఉండురు - ఉండుదురు.
60. ముఙ్ఙు పరంబగునపుడు కో శబ్దంబు కొనునకు బహుళంబుగా నగు.
బహుళంబనుటచే దీనికి నొకానొకచో నతిచారంబని యెఱుంగునది.
61. ముఙ్ఙు పరంబగునపుడు దీర్ఘంబునకు హ్రస్వంబును, మువర్ణకంబునకు మాముడియు నగు.
కొమ్ము - కొనుము - కొండు - కొనుఁడు.
62. రు వర్ణకంబు పరంబగునపుడు సున్నమీఁది త ద డ ల యుత్వంబునకు లోపంబు విభాష నగు.
పోషింత్రు - పోషింతురు, కొంద్రు - కొందురు, కొండ్రు - కొండురు.
63. సంస్కృతంబున కంగలాదుల కించు క్కగు.
సంస్కృతధాతువుల కంగలాదుల కించు గాగమంబగు.
పచించు - వచించు - త్యజించు - భజించు - అంగలించు.

అంగల - అడక - ఆరగ - ఆవుల - ఉంక - ఉగ్గడ - ఓసర - కార - గాల - జాడ - తిలక - తులక - పంక - పరిక - పలవ - అప్ప - ఒప్ప - ఆల ఇత్యాదు లంగలాదులు.
64. ఇ ఉ ఋ ల కించుక్కు పరంబగునపు డ యు గ పు గరుక్కు లగు.
జి: జయించు. నీ: నయించు. ద్రు: ద్రవించు.
లూ: లవించు. ధృ: ధరించు. తౄ: తరించు.
65. నిర్జి నామంబుల కయుగాగమంబు గలుగదు.
నిర్జికి, నామధాతువుల కయుగాగమంబు గలుగదు.
నిర్జించు - నుతించు - స్తుతించు.

ఈ జ్ఞాపకంబుచేతనే నామంబులకు ధాతుత్వ వివక్షయం దించు గాగమంబగునని యెఱుంగునది.
శయనించు - పయనించు.
66. సంస్కృతంబునకు లఘూపధంబున కించుక్కు పరం బగునపుదు గుణం బగు.
ఆ - ఏ - ఓ. ఈ మూఁడును గుణంబులు నాఁబడు.
ఋ స్థానికంబగు గుణంబు ర పరంబయి యుండు.

సంస్కృతధాతూపధలకు ఇ - ఉ - ఋ అను వానికి సొరిదిని ఏ - ఓ - అర్‌ - అనునవి యించుక్కు పరంబగునపు డగునని యెఱుంగునది.
ఛిద్‌ - ఛేదించు, భిద్‌ - భేదించు, ఘుష్‌ - ఘోషించు, పుష్‌ - పోషించు, వృష్‌ - వర్షించు, హృష్‌ - హర్షించు.
67. స్పృశికి గుణంబు విభాషనగు.
స్పర్శించు - స్పృశించు.
68. లిఖ భుజ రుచ కృశంబులకు గుణంబు లేదు.
లిఖించు - భుజించు - రుచించు - కృశించు.

కుచధాతువునకు గుణంబులేదని యొకండు వక్కాణించె, నది గ్రాహ్యంబు గాదు.
69. సృజికి నిర్మితిని గుణంబు లేదు.
చతుర్ముఖుండు ప్రజలను సృజించె. అతండు విషయంబుల విసర్జించె.
70. సర్వంబునకుం బ్రేరణంబునం దించు క్కగు.
పచింపించు - వచింపించు - ఆవులింపించు - వండించు - పండించు.
71. రంజాదుల యించుక్క కారంబునకు సబిందుకంబున కప్రేరణంబున ద్విరుక్తలకారం బగు.
రంజిల్లు - భాసిల్లు - వర్ధిల్లు - విలసిల్లు - రాజిల్లు.

ఈ యాదేశయోగంబున భిదాదు లకర్మకంబులగు.
భేదిల్లు - కంపిల్లు - సంధిల్లు.
72. ఇంచుక్కు పరంబగునపుడు రంజాదుల యించుక్కునకు లోపం బగు.
లాదేశంబున కపవాదంబు.
రంజించు - భేదించు - సంధించు.
73. చుగాగమం బాచ్ఛికంబున కసంయుక్త న ల డ రాంతంబునకుం బ్రేరణంబున బహుళంబుగా నగు.
వూను - వూనుచు - వూనించు.
తేలు - తేలుచు - తేలించు.
మగుడు - మగుడుచు - మగిడించు.
కుదురు - కుదురుచు - కుదురించు.
విను - వినుచు.

వక్ష్యమాణంబు పుగాగమంబు.
వినిపించు.

బాహుళకంబుచేఁ గొన్నింటికిఁ జుగాగమంబు లేదు.
అను - అనిపించు, తిను - తినిపించు, కను - కనిపించు.

దీని యత్వంబునకు దీర్ఘంబునగు.
కానిపించు.
74. అట్లు పుగాగమంబును మాన్వాదుల కగు.
మాను - మానుపు - మానుచు, మను - మనుపు - మనుచు.

బాహుళకంబున దీని కించిక్కులేదు.
75. చుక్పువర్ణంబులు పరంబులగునపు డిత్వంబున కుత్వం బగు.
76. అట్లు చుక్పుగాగమంబు లడంగ్వాది మాయ్వాదుల కగునగుచో, వాని కడవ్రాలు లోపించు.
అడఁగు - అడఁచు - అడఁగించు, మాయు - మాపు - మాయించు.

అడఁగు - కరగు - కలఁగు - నలఁగు ఇత్యాదు లడంగ్వాదులు.
మాయు - ఉడుగు - కడగు - కుడుచు - బిగియు ఇత్యాదులు మాయ్వాదులు.
ఆఁగు ప్రభృతు లుభయగణంబులు.

బాహుళకంబునంజేసి కొన్నింటి కించుక్చుక్పుగాగమంబులు మూఁడును, గొన్నింటికందు యథా సంభవముగా రెండును, గొన్నింటి కొక్కటియు నగునని యెఱుంగునది.
ఆఁగు - ఆఁచు - ఆఁపు - ఆఁగించు.
రేఁగు - రేఁచు - రేఁపు - రేగించు.
పాయు - పాచు - పావు.
విఱుగు - విఱుచు.
చూచు - చూపు.
నేరుచు - నేరుపు.
మేయు - మేపు.
రేచు - రేపు.
కలియు - కలుపు.
తడియు - తడుపు.
తెలియు - తెలుపు ఇత్యాదు లెఱుంగునది.
77. ఇంచుక్చుక్పుగాగమంబులు పరంబులగునపు డాగమాదేశ లోపంబులు పెక్కు దెఱంగులం గానంబడియెడి.
ఆగు - కావించు. వచ్చు - రావింపు - రప్పించు.
విన్నపము - విన్నవించు. మోకాలు - మోకరించు. కేక - కేకరించు.
పలవ - పలవరించు - పలవించు. ఆల - ఆలకించు - ఆలించు.
ప్రక్క - ప్రక్కలించు. నొచ్చు - నొంచు - నొప్పించు.
ఉండు - ఉనుచు - ఉంచు. డిగు - డించు - డిగించు.
పెరుగు - పెనుచు - పెంచు. తునుఁగు - త్రుంచు.
మునుఁగు - ముంచు - మునుచు.
మొగుడు - మొగుడుచు - మొగుచు - మోడుచు - మొగిడించు.
చొచ్చు - చొనుపు - చొప్పించు.
చినుఁగు - చించు - చింపు. త్రెగు - త్రెంచు - త్రెంపు.
తిరుగు - త్రిప్పు. చచ్చు - చంపు.
నిలుచు - నిలువరించు - నిలుపు. కొను - కొలుపు.
పోవు - పుచ్చు. పనుచు - పంచు. పనుపు - పంపు.
అనుచు - అంచు. అనుపు - అంపు.

అనుప్రయుక్తంబగు పోవునకుం బుచ్చు మాత్రంబగు.
మోసపోవు - మోసపుచ్చు ఇత్యాదు లెఱుంగునది.
78. అన్వాదుల కించుక్కు పరంబగునపుడు పుగాగమం బగు, మానునకు విభాష నగు.
అనిపించు - అను - కను - తిను - విను. మానిపించు - మానించు.
79. అడ్డాదుల కించుక్కు పరంబగునపుడు గుగాగమం బగు, అప్పాదులకు విభాషనగు.
అడ్డము - అడ్డగించు.
అడ్డము - ఓర - చిత్తము - పంతము - పెల్ల - బోర - మట్టము - మెళము ఇత్యాదు లడాదులు.

అప్ప - అప్పగించు - అప్పించు.
అప్ప - ఒప్ప - పల్లము - కోపము ఇవి యుప్పాదులు.
80. ఆడోడు కూడుల డకారంబునకుం కుంజుక్కుపరం బగునపుడు రేఫం బగు.
ఆడు - ఆరుచు - ఆడించు.
ఓడు - ఓరుచు - ఓడించు.
కూడు - కూడుచు - కూడించు.
81. చెడునకుం జుక్పుగాగమంబులను డాకలఘు రేఫంబు నగు.
చెఱుచు - చెఱుపు.
82. పడునకుం జుక్కును డాకలఘు రేఫంబు నగు.
పఱుపు.
83. శబ్ద పల్లవం బగు పడున కించుక్కు విభాష నగు, నగుచో డాకలఘు రేఫం బగు.
వెలువడు - వెలువరించు - వెలువఱుచు. చొప్పడు - చొప్పరించు - చొప్పఱుచు.
84. ప్రేరణంబునం దించుక్కు మీఁద నించుక్కు లేదు.
ఇటనుటంజేసి ప్రేరణార్థంబయిన యితరాగమంబు మీఁదం బ్రేరణార్థేం చుగాగమంబగునని యెఱుంగునది.
నొచ్చు - నొంచు - నొంపించు. చచ్చు - చంపు - చంపించు.
85. ఇత్వంబుగాని యెత్వంబుగాని కూడుచో, ననాద్యంబయిన యుత్వంబున కిత్వం బగు.
నిగుడు - నిగిడి - నిగిడె. మగుడు - మగిడి - మగిడె.
ఉడుగు - ఉడిగి - ఉడిగె. మునుఁగు - మునిఁగి - మునిఁగె.
86. ముఙ్ఙీత్తులు ముత్తు నాఁబడు.
87. ప్రేరణేంచుక్కు పరంబగునపుడు పకారంబు చకారంబున కగు.
పచించు - పచింపించు. వచించు - వచింపించు.
పిలుచు - పిలిపించు. వలచు - వలపించు.

పత్వంబు హెచ్చునకుం గలుగదు. మెచ్చునకు విభాషనగు.
హెచ్చించు, మెప్పించు - మెచ్చించు.
88. ఆగమాన్య చకారంబుల కద్విరుక్తంబులకు ముత్తు పరంబగునపుడు పవ లగు.
ఆగమంబు: పచింపఁడు - పచింపుము, అడఁపఁడు - అడఁపుము, అన్యము: పిలువఁడు - పిలుపుము.
89. ఖండబిందువుమీఁది సిద్ధచకారంబునకు ముత్తు పరం బగునపుడు పకారంబు ప్రాయికంబుగ నగు.
తలఁపక - త్రేఁపక - తోఁపక.

ఏచునకు వైభాషికంబు.
ఏఁపక - ఏచక.

నోచునకుం గలుగదు.
నోచక.
90. ఆగమ చకారంబునకు నెఱసున్న మీఁదిదానికి దుక్కు పరంబగునపుడు పకారంబు విభాష నగు.
ఆకర్ణింపుదురు - దంపుదురు - చింపుదురు.

పత్వంబురాని పక్షంబున వక్ష్యమాణ తాదేశంబు.
ఆకర్ణింతురు - దంతురు - చింతురు.
91. అగు వచ్చు చొచ్చు చూచులకు ముత్తు పరంబగు నపుడు కా రా చొరు చూడు లగు.
అగు - కాఁడు - కమ్ము, వచ్చు - రాఁడు - రమ్ము, చొచ్చు - చొరఁడు - చొరుము, చూచు - చూడఁడు - చూడుము.
92. ఇచ్చునకు సర్వంబున కీ యగు.
ఇచ్చు - ఈఁడు - ఇమ్ము.

ఈయ యనునాదేశంబు నొకానొకచోఁ గానంబడియెడి.
బలిమినీయని భూమి వలయపతుల.
93. తే తేరులు తెచ్చున కగు.
తెచ్చు - తేఁడు - తేరఁగు - తెమ్ము - తేరుము.
94. చావు నోవులు చచ్చు నొచ్చుల కగు.
చచ్చు - చాఁవడు - చావుము, నొచ్చు - నోవఁడు - నోవుము.

వక్ష్యమాణంబు ద్విత్వంబు.
నొవ్వండు.
95. ఙిత్తు పరంబగునపుడు వాని వువర్ణంబు విభాషను లోపించు.
చాక - చావక - చాకుము - చావకుము.
నోక - నోవక - నోకుము - నోవకుము.
96. అగున కను కనులకు ముఙ్ఙీత్తులు పరంబులగునపుడు కానా కానలు విభాష నగు.
అపదాద్య సూత్రముచే గాకు వకారంబు.
వక్ష్యమాణం బౌత్వంబు.
కమ్ము - అగుము - అవుము - ఔము.
కండు - అగుఁడు - అవుఁడు - ఔడు.
నాఁడు - అనఁడు - కానఁడు - కనఁడు.
97. నేరుచునకు లిడ్లాట్టులు ముత్తుం బరంబులగునపుడు రుచులకు లోపంబు బహుళంబుగా నగు.
నేచెను - నేరిచెను, నేచును - నేరుచును, నేరఁడు - నేరువఁడు.
98. పోవునకు దుఙ్ముత్తులు ముఙ్ఙుం బరంబులగునపుడు వులోపంబుం, బొద పద లును విభాష నగు.
పోదురు - పోవుదురు, పోఁడు - పోవఁడు, పోవుము - పోదము, పదము - పొమ్ము.
99. అగు పోవుల కడవ్రాల కిద్వక్రంబులు పరంబగు నపుడు యకారం బగు.
వక్ష్యమాణం బైత్వంబు.
అయి - ఐ, అయిరి - ఐరి, పోయి - పోయిరి, పోయెను - పోయెడును.
100. అగునకు వక్రంబు గూడుచో దీర్ఘం బగు.
వక్ష్యమాణంబు ద్విత్వంబు.
ఆయెను - అయ్యెను, ఆయెడును - అయ్యెడును.
101. పిలుచు మొదలగువానికి ముత్తు పరంబగునపుడు కడ వ్రాయి బహుళంబుగ లోపించు.
పిలఁడు - పిలువఁడు - పిలుము - పిలువుము.

లేచునకు ముఙ్ఙు పరంబగునపుడు చులోపంబగు.
లెమ్ము - లెండు.

పిలుచు - నిలుచు - తలఁగు ఇత్యాదులు.
102. లాఁతిచో సహితము కాదేశాదులు కానంబడియెడి.
కావుతను - కాతను, అగుట - కావుట, అగుడును - కావుడును, కానను - కావునను, అనుడును - అనవుడును - నావుడును ఇత్యాదు లెఱుంగునది.
103. ఆచ్ఛికంబులం దయి యవులకు వక్రతమంబులు బహుళంబుగా నగు.
అయిదు - ఐదు, అయిరేని - ఐరేని, అవుడు - ఔడు, గవుసెన - గౌసెన.
104. కలుగున కస్త్యర్థంబునందు లట్టు పరంబగునపుడు కల యగు.
ప్ర: కలఁడు - కలరు - కలదు - కలవు.
మ: కలవు - కలరు.
ఉ: కలను - కలము.
105. త్రర్థంబునం గలాదేశంబు విభాష నగు.
ఎడి యెడు లకు లోపం బిట నిత్యంబు.
కలఁవాడు - కలుగువాఁడు.
106. అస్త్యర్థంబునకు లఙి మి క ని వడి వర్ణకంబులు పరంబు లగునపుడు లే యగు.
ప్ర: లేఁడు - లేరు - లేదు - లేవు.
మ: లేవు - లేరు.
ఉ: లేను - లేము - లేమి - లేక - లేని - లేవడి.
107. వ్యతిరేకంబునందు వలచున కొల్ల విభాష నగు.
ప్ర: ఒల్లఁడు - ఒల్లరు - ఒల్లదు - ఒల్లవు.
మ: ఒల్లవు - ఒల్లరు.
ఉ: ఒల్లను - ఒలము - ఒల్లమి - ఒల్లక - ఒల్లని.

పక్షంబున వలవఁడిత్యాది. ఒల్లమి కొల్లఁబాటని ప్రయోగంబులం గానంబడియెడి.
108. చువర్ణంబుతోడ దుగ్ధకారంబు తకారం బగు.
నిలుతురు - పిలుతురు - అడఁతురు - కడతురు - చింతురు - పెంతురు - పచింతురు - వచింతురు - చేతురు - కోతు రిత్యాదు లసాధువులని యెఱుఁగునది.
109. పడుఙి కొను లొకానొకచో స్వార్థంబునం దనుప్రయుక్తంబు లగు.
చొచ్చు - చొరఁబడు. నిలుచు - నిలువబఁడు.
కూడు - కూడఁబడు. పండు - పండుకొను.
110. తెంచు ధాతు వగ్వాదుల కనుప్రయుక్తం బగు, నగుచో నుత్వంబుపయిని దాని తకారంబు దకారం బగు.
అగుదెంచు - నెగయుదెంచు - పోవుదెంచు.

అగు - నెగయు - పోవు - చొచ్చు - పుచ్చు - తోఁచు - నడచు - పఱచు - మొలచు - వీచు ఇత్యాదులు.
111. అభ్యాగతి నరుగ్వాదుల కయ్యది యనుప్రయుక్తం బగు, నగుచో గువర్ణకంబు విభాషను లోపించు.
అరుదెంచు - అరుగుదెంచు. ఏతెంచు - ఏగుదెంచు. చనుదెంచు.
112. అయ్యది పరంబగునపుడు చువర్ణకంబు లోపించు.
చొచ్చు - చొత్తెంచు, పుచ్చు - పుత్తెంచు, తోఁచు - తోతెంచు.
113. అద్దానికి ముత్తు పరంబగునపుడు తే తేరు లగు.
అగుదేఁడు - అగుదేరఁడు, అగుదెమ్ము - అగుదేరుము.
114. భూతంబున లఙికి లిడంతంబగు, నగు ధాతు వనుప్రయుక్తం బగు.
ప్ర: వాఁడు రాఁడయ్యెను - వారు రారయిరి - అది రాదయ్యెను - అవి రావయ్యెను. మ: నీవు రావయితివి - మీరు రావయితిరి.
ఉ: నేను రానయితిని - మేము రామయితిమి.
115. నుఙ్యంతం బగు నగు ధాతువు క్రియావిశేషణంబుల కనుప్రయుక్తం బగు, నుఙీకి విభాష నగు.
కాను - అనునది నుఙ్యంతంబగు నగు ధాతువు రూపంబు.
116. దానికి హ్రస్వంబు విభాష నగు.
లెస్సగాను - లెస్సగను, న్యాయముగాను - న్యాయ్యముగను. ఇట సరళంబు నిత్యంబు. చూడఁగాను - చూడఁగను - చూడను. ఇట స్వత్వంబు లేదు.
117. ఉన్న కల న వర్ణకంబుల మీఁది తచ్ఛబ్ద వకారంబునకు లోపంబు విభాష నగు.
బాహుళకంబుచే నిట సంధి నిత్యంబు.
ప్ర: వండుచున్నవాఁడు - వండుచున్నాఁడు, వండుచున్నవారు - వండుచున్నారు.
మ: వండుచున్నవాఁడవు - వండుచున్నాఁడవు, వండుచున్నవారరు - వండుచున్నారరు.
ఉ: వండుచున్నవాఁడను - వండుచున్నాఁడను, వండుచున్నవారము - వండుచున్నారము.

ఇట్లు వండఁగలవాఁడు - వండఁగలాఁడు, వండినవాఁడు - వండినాఁ డిత్యాదు లెఱుంగునది.
118. ధాత్వాదులకు ధాతువు లనుప్రయుక్తంబు లయి విలక్షణార్థాభిధాయకంబు లగు, నీయవి శబ్దపల్లవంబులు నాఁబడు.
కూరుచుండు - నిలుచుండు - పరుండు - పన్నుండు - ఆఁకొను - ఈకొను - ఈయకొను - ఇయ్యకొను - రక్కొను - త్రెక్కొను - మేకొను - మయికొను - మేలుకొను - మేలుకను - మేలుకాంచు - అలవడు - ఏరుపడు- చొప్పడు - వెలువడు - తలపోయు - వానపోయు - ఆపోవు - కొంపోవు - కొనిపోవు - విజయం చేయు - కయివ్రాలు - తూపొడుచు ఇత్యాదులు శబ్దపల్లవంబులు.
119. చేదర్థయోగంబున లృట్టునకు లి ట్టగు.
ఆ ఋషీశ్వరుండు వచ్చెనా ఫలించుఁ గార్యముల్‌.
వాఁడు ఱేపు వచ్చెనేని నీవు కార్యంబు దొరఁకొనుము.
120. ఆత్మార్థం బభిహితం బగుచోఁ దల్లింగసంఖ్యాభిధాయి వచనంబు ధాతువిశేషణంబుల కగు.
రాముఁడు రావణుం బరిమార్చి సీతయుం దాను సౌమిత్రి సహితంబుగం బుష్పకారూఢుం డయి సాకేతంబున కేతెంచె.
121. ఆగతికంబులగు భ్వాదుల కిందు యోగంబు లేదు.
భూ - నృ - కృ - రేకృ - లోకృ - లోచ్క - పచి - లప ఇత్యాదులకు, గతి విరహితంబులగు ధాతువులకీ భాషం బ్రయోగంబులేదు.

ప్ర - పరా - అప - సమ్‌ - అను - అవ - నిన్‌ - నిర్‌ - దుస్‌ - దుర్‌ - వి - ఆజ్‌ - ని - అధి - అపి - అతి - సు - ఉద్‌ - అభి - ప్రతి - పరి - ఉప - ఊరీ ప్రభృతులను సాక్షాత్ప్రభృతులును గతి సంజ్ఞాకంబులు, ప్రాదులిరువది రెండు నుపసర్గంబులు నాఁబడు.

ప్రభవించు - ఆవిర్భవించు - ప్రసరించు - సంస్కరించు - భస్మీకరించు - సాక్షాత్కరించు - అతిరేకించు - ఆలోకించు - ఆలోచించు - ప్రపంచించు - ప్రలవించు ఇత్యాదు లార్యప్రయోగంబుల నెఱుంగునది.
122. వలయ్వాది క్రియలకుం, గర్త యగు భావంబునందు నుఙి యగు.
వలయ్వాది క్రియలకుం, గర్తృభూత క్రియావృత్తి యగు ధాతువునకు నుఙి వర్ణకంబగు. ప్ర:వాఁడు చూడవలయు - వారలు చూడఁగావలయు.
మ: నీవు చూడవలయు - మీరు చూడవలయు.
ఉ: నేను జూడవలయు - మేము చూడవలయు - మనము చూడవలయు.

వలయును - వలదు - కూడును - కూడదు - చెల్లును - చెల్లదు - తగును - తగదు ఇత్యాదులు వలయ్వాదులు.

సకర్మకంబునకు స్వరూప ప్రేరణార్థంబులు రెండును గొను పడ్వనుబంధంబులం దొక్కొక్కటి తోడ రెంటితోడం గూడుచో నగునవి యాఱుం గూడ రూపంబు లెనిమిదయ్యె. వాని సొరిది నుదాహరించెద:
కర్త్రర్థకము: మైత్రుఁడు వంటకమును వండెను.
ఆత్మనేపద కర్త్రర్థకము: మైత్రుఁడు వంటకమును వండుకొనియెను.
కర్మార్థకము: మైత్రునిచేత వంటకము వండఁబడియెను.
ఆత్మనేపద కర్మార్థకము: మైత్రునిచేత వంటకమును వండుకొనఁబడియెను.
ప్రేరణ కర్త్రర్థకము: చైత్రుఁడు మైత్రునిచేత వంటకమును వండించెను.
ప్రేరణాత్మనేపద కర్త్రర్థకము: చైత్రుండు మైత్రునిచేత వంటకమును వండించుకొనియెను.
ప్రేరణ కర్మార్థకము: చైత్రునిచేత మైత్రునిచేత వంటకమును వండింపఁబడియెను.
ప్రేరణాత్మనేపద కర్మార్థకము: చైత్రునిచేత మైత్రునిచేత వంటకము వండించుకొనఁబడియెను.
123. గతిబుద్ధి ప్రత్యవసానార్థ శబ్దకర్మాకర్మంబుల కప్రేరణంబునం గర్త యగునది ప్రేరణంబునం గర్మం బగు.
పొందు మొదలయినవి గత్యర్థకంబులు.
తెలియు మొదలయినవి బుద్ధ్యర్థకంబులు.
తిను మొదలయినవి ప్రత్యవసానార్థకంబులు.
విను - చెప్పు - చదువు - మొదలయినవి శబ్దకర్మంబులు.
అకర్మకంబులు ప్రసిద్ధంబులు.
మైత్రుండు గ్రామంబు బొందెను.
చైత్రుండు మైత్రుని గ్రామంబుం బొందించెను.

లాఁతిచో సహిత మిక్కార్యంబు గానంబడియెడి.
మైత్రుండు పుడమి నేలెను -
చైత్రుండు మైత్రునిం బుడమి నేలించెను.
124. అనభిహితకర్త కొకానొకచో షష్ఠి బహుళంబుగానగు.
రాముఁడు మిథిలం గనియె - రామునకు మిథిలం గనంబడియె - రామునిచే మిథిల గనంబడియెను.
మైత్రుండు తత్త్వంబుం దెలిసెను - చైత్రుండు మైత్రునకుం దత్త్వంబు దెలిపెను.

కన్వాదియోగంబునం బ్రయోజ్య కర్తకు షష్ఠి నిత్యంబుగానగు.
విశ్వామిత్రుఁడు రామునకు మిథిలం గానిపించెను.
కృష్ణుం డర్జునునకు విశ్వరూపంబు జూపెను.

అకర్మకంబున కప్రేరణంబునం దాత్మనేపద కర్మాను బంధంబులు లేమింజేసి రూపభేదంబు లయిదని యెఱుంగునది.
కర్త్రర్థకము: మైత్రుండు మనియెను.
ప్రేరణ కర్త్రర్థకము: చైత్రుండు మైత్రుని మనిచెను.
ప్రేరణాత్మనేపద కర్త్రర్థకము: చైత్రుండు మైత్రుని మనుచుకొనియె.
ప్రేరణ కర్మార్థకము: చైత్రునిచేత మైత్రుండు మనుపఁబడియె.
ప్రేరణాత్మనేపద కర్మార్థకము: చైత్రునిచేత మైత్రుండు మనుచుకొనఁబడియె.

వెండియుం బ్రేరణంబునం దించుగాగమంబు గలిగినచో సకర్మకంబునకుం బండ్రెండు, నకర్మకంబునకుం దొమ్మిదియు భేదంబులని యూహించునది.
AndhraBharati AMdhra bhArati - bhAshha - bAla vyAkaraNamu - kriyA parichchhEdamu - chinnaya sUri - andhra telugu tenugu ( telugu andhra )