భాష నిఘంటువులు ఆంధ్రనామసంగ్రహము
తిర్యగ్వర్గు
సీ. వెడఁదమోముమెకంబు - జడలమెకం బేనుఁ
గులగొంగ మెకముల - కొలముసామి
తెల్లడాలుమెకంబు - తెఱనోటిమెకము సిం
గంబు నా బొబ్బమె - కం బనంగఁ
బరఁగును మృగరాజు - పసిదిండి పులి మెకం
బులతిండిపోతు చా - ఱలమెకంబు
మువ్వన్నె మెక మన - నివ్వసుంధరయందు
వ్యాఘ్రంబునకు సమా - ఖ్యలు చెలంగుఁ
 
ఆ. బుట్టకూడుదిండి - పో తన వెనుక చూ
పులమెకంబు నాఁగ - నెలు వనంగ
నెలుఁగునాఁగ మోర - తెలుపు మెకంబు నా
భల్లుకంబు దనరు - ఫాలనేత్ర!
1
క. పలుగొమ్ములమెక మనఁగా
నిల నెక్కుడుమెక మనంగ - నేనుఁ గనంగా
బలువంజమెకము నా జే
గలమెక మన గౌ రనంగఁ - గరి యొప్పు శివా!
2
తే. వాజికి సమాఖ్య లగుఁ దేజి - వారువంబు
మావు గుఱ్ఱంబు తట్టువ - వావురంబు
కత్తలాని బాబా జక్కి - తత్తడి యన
విగతభవపాశ! కాశీని - వేశ! యీశ!
3
క. తగ రేడిక పొట్టే లన
నగు మేషసమాఖ్య లెనిమి - దడుగులమెక మే
నుఁగుగొంగసూఁ డనంగా
జగతిన్‌ శరభాఖ్య లొప్పుఁ - జంద్రార్ధధరా!
4
క. సంగతి నుష్ట్రాఖ్యలు నొ
ప్పెం గడు నొంటె లన లొట్టి - పిట్ట లనన్‌ సా
రంగాఖ్య లలరు నిఱ్ఱుల
నంగా జింక లన లేళ్లు - నా సర్వజ్ఞా!
5
క. నులిగొమ్ములమెక మిఱ్ఱన
నిల మృగమున కొప్పుఁ బేళ్లు - మృగి లేడియనన్‌
వెలయును రెంటికిఁ దగు నా
ఖ్యలు జింక యనంగ నీశ! - యంబరకేశా!
6
తే. పసులు తొడుకులు పసరముల్‌ - పసి యనంగఁ
బశువులకును సమాఖ్యలై - పరఁగు నాల
పోఁతు బసవఁడు గిబ్బ యాఁ - బో తనంగ
వృషభమున కాఖ్యలై యొప్పు - వృషభవాహ!
7
సీ. తొఱ్ఱుపట్టు లనంగ - దొ డ్లనఁగా నివి
గోష్ఠ దేశమునకుఁ - గొఱలు నీశ!
కదుపులు మొదవులు - పదువులు మందలు
నా ధేనుగుణ మొప్పు - నగనివేశ!
యలరు నాఖ్యలు లేఁగ - లన దూడ లనఁ గ్రేపు
లన వత్సములకును - ధనదమిత్ర!
యా వనఁగా గిడ్డి - యనఁ దొడు కన మొద
వన ధేనునామముల్‌ - దనరు నభవ!
 
తే. యుక్షమునకు సమాఖ్యలై - యొప్పుచుండు
గిత్త యె ద్దనఁ గోడె నాఁ - గృత్తివాస!
యా లనఁగ ధేనువుల కాఖ్య - యలరు చుండు
శైలజానాథ! ప్రమథసం - చయసనాథ!
8
తే. అలరుఁ గుందేలు చెవులపో - తనఁగ శశక
మొప్పుఁ బొడలమెకంబు నా - దుప్పి యనఁగఁ
గాఱుకొమ్ములమెక మనం - గను ధరిత్రి
రామనామమృగంబు ధ - రాశతాంగ!
9
తే. దుంత యెనుపోతు జమునెక్కి - రింత దున్న
యనఁగ మహిషంబునకు సమా - హ్వయము లమరుఁ
బరఁగ నెనుపెంట్లు గేదెలు - బఱ్ఱె లెనుము
లనఁగ మహిషీసమాఖ్యలు - ధనదమిత్ర!
10
తే. పక్కి పులుఁగు పిట్ట యనంగఁ - బక్షి యొప్పు
గఱులు ఱెక్కలు చట్టుప - లెఱక లనఁగఁ
బక్షముల కివి పే ళ్లగుఁ - బర్ణములకు
నాఖ్య లగు లావు లన నీఁక - లనఁగ నీశ!
11
సీ. తొలకరికలుగుపు - ల్గులు నల్వ తేజీలు
పాలు నీరును నేరు - పఱుచుపులుఁగు
లంచలు తెలిపిట్ట - లన నొప్పు హంసలు
క్రౌంచముల్‌ దనరారుఁ - గొంచె లనఁగఁ
గొక్కరా లనఁగను - గొక్కు లనంగను
గొక్కెర లనఁగను - గొంగ లనఁగఁ
బరఁగు నభిఖ్యలు - బకవిహంగములకు
నట్టువపులుఁగు నా - జుట్టుపులుఁగు
 
తే. నాఁగ నె మ్మన నెమిలి నా - నమ్మి యనఁగఁ
గేకికి సమాఖ్య లగుఁ జంచ - రీకములకు
నాఖ్యలు జమిలిముక్కాలి - యనఁగఁ దేటి
యనఁగఁ దుమ్మెద నా నీశ! - యభ్రకేశ!
12
తే. పరఁగు నొడ్డీలు కూకీలు - పల్లటీలు
పావురాలును బకదార్లు - పావురములు
నాఁగఁ గలరవపక్షిబృం - దముల పేళ్లు
పంకజాతాక్షసన్మిత్ర! - ఫాలనేత్ర!
13
తే. పుడమిలోపలఁ జదువుల - పులుఁ గనంగఁ
జిగురువిల్కానితేజి నాఁ - దొగరుముక్కు
పులుఁ గనఁగఁ బచ్చఱెక్కల - పులుఁ గనంగఁ
జిలుక యన నొప్పుఁ గీరంబు - శ్రీమహేశ!
14
తే. బట్టికాఁడన గొరవంక - పిట్ట యనఁగఁ
బరఁగు శారిక యేట్రింత - పసులపోలి
గాఁడు కూఁకటిమూఁగ నాఁ - గను జెలంగు
నిల భరద్వాజవిహంగంబు - నీలకంఠ!
15
తే. జాలె డే గనఁ గురుజు నా - సాళ్వమనఁగఁ
గణుజు నాఁగను జలకట్టె - యనఁగ వేస
డం బనఁగ గిడ్డు నా నోర - ణం బనంగ
శ్యేనభేదంబు లగు మహా - సేనజనక!
16
తే. కోటఁ డనఁగను గూబ నా - ఘూక మమరుఁ
జిఱుతగూబ యనంగఁ బ - సిండికంటి
యనఁగ సకినాలపులుఁ గన - నలరుచుండుఁ
బృథివిఁ గనకాక్షి యనుపక్షి - శ్రీమహేశ!
17
తే. పాము సప్పంబు నిడుపఁడు - పడగదారి
గాలిమేఁతరి విసదారి - కానరాని
కాళ్లయది చిల్వ వీనుల - కంటి పుట్ట
పెట్టె పట్టనఁ జను నహి - పేళ్లు భర్గ!
18
క. ఇల నెంచ రుధిరమున కా
ఖ్యలు నల్ల యనంగ నెత్తు - రనఁగ ధరిత్రిం
బొల యీరు వెఱచి నంజుడు
పొల సన నివి పరఁగు మాంస - మునకు మహేశా!
19
క. భర్గుఁడు కాశీనిలయుఁడు
దుర్గాపతి యొసఁగు ముదము - తో నీతిర్య
గ్వర్గు లిఖించినఁ జదివిన
దౌర్గత్యము లణఁచి సంప - దలు నిత్యంబున్‌.
20
AndhraBharati AMdhra bhArati - AMdhra nAma saMgrahamu - bhAshha - nighaMTuvulu - AMdhranAmasaMgrahamu ( telugu andhra )