చరిత్ర శాసనములు  

మనదేశచరిత్ర నిర్మాణమునకు గల ఆధారములు అన్నిటిలోనికి ముఖ్యములయినవి, ప్రామాణికములయినవి శాసనములు. మనదేశములో దొరకిన అత్యంత పురాతన శాసనములు మౌర్యవంశజుడయిన అశోక చక్రవర్తివి. ఇవి హైదరాబాదులోని మాస్కిలోను, కర్నూలు జిల్లా లోని యెర్రగుడి, రాజులమందగిరులలోను, కళింగములోని జౌగడ, ధౌలీలలోను కానవచ్చినవి. అశోక చక్రవర్తి క్రీస్తుకు పూర్వము మూడవ శతాబ్దమునాటి వాడగుటచేత ఈ శాసనములును ఆనాటివే; రెండువేల సంవత్సరములకు పూర్వపువి. ఈ యశోకచక్రవర్తి శాసనములవల్ల అతని సామ్రాజ్యము దక్షిణదిశకు ఎంతమేర వ్యాపించినదో తెలియుచున్నది. అశోకుని శాసనములు మన తెలుగుదేశములో కాన్పించినను, అవి మొత్తముమీద హిందూదేశ చరిత్రమునకు సంబంధించినవి కాని తెలుగుదేశచరిత్రకు ఉపకరించునవి కావు.

అశోకుని శిలాశాసనములకు తరువాత ఇంచుమించుగా అంతప్రాచీనమైనవి భట్టిప్రోలువద్ద దొరకిన ధాతుకరండముమీది శాసనములు. ఇవి క్రీస్తు పూర్వపు తుది శతాబ్దముల నాటివి. వీనివల్ల ఆనాటికే తెలుగుదేశములో బౌద్ధము పరివ్యాప్తమయినట్లు స్పష్టమగుచున్నది. తెలుగుదేశమునకు సంబంధించిన వైనను శాతవాహన నృపతుల తొలి శాసనములు పడమటి దక్కనులోని కార్లె, నాసిక, కన్హేరీల వద్దనున్న గుహాలయములలో కానవచ్చినవి. అమరావతీ స్తూపమున కానవచ్చిన శిలాశాసనము లన్నియు వేరు వేరు వ్యక్తులు బుద్ధునిమీది భక్తిపెంపున బౌద్ధస్తూపమునకును, బౌద్ధసంఘమునకును చేసిన దానములను తెలుపును. ఆ కాలములో తెలుగుదేశమున వ్యాపించిన బౌద్ధ ధర్మ సంప్రదాయమునకు చెందిన విషయములును, కొంతవరకు ఆనాటి జనుల యాచార వ్యవహారములును పైనుడివిన శాసనములవలన తెలియవచ్చును.

ఇక్ష్వాకునృపతుల కాలపు శాసనములవలె అందమయిన శాసనములు తెలుగుదేశములో అంతకు పూర్వము కాని, తరువాతను గాని కానరావు. ఇక్ష్వాకులకు పిదప తెలుగు దేశమును పల్లవులు, బృహత్ఫలాయనులు, శాలంకాయనులు, ఆనందగోత్రులు పరిపాలించిరి. అశోకునికాలము నుండి ఇక్ష్వాకులకాలము చివరివరకు - అనగా క్రీస్తుకు పూర్వము మూడవ శతాబ్దమునుండి క్రీస్తుశకము మూడవ శతాబ్దాంతమువరకు - మాత్రమే కాక తరువాత మరికొంత కాలమువరకు కూడ తెలుగుదేశములో కానవచ్చు శాసనభాష ప్రాకృతము. ఆనాటి ప్రజల భాషలకు ప్రాకృతమన్నది సామాన్యనామము. క్రీస్తుశకము నాలుగవ శతాబ్దములో రాజ్యముచేసిన మొదటి పల్లవ, మొదటి శాలంకాయన, మొదటి ఆనందగోత్ర, బృహత్ఫలాయనుల తామ్రశాసనములలో సైతము ప్రాకృతమే కానవచ్చును.

ఇక్ష్వాకుల కాలమునకు తరువాతి నుండి కానవచ్చినవి తామ్రశాసనములు. తామ్రశాసనములు అనగా రాగి రేకుల మీద వ్రాశిన శాసనములు. శాసనములను శిలల మీదను, రాగి రేకుల మీదను మాత్రమే కాక బంగారు రేకుల మీదను, వెండి రేకులమీదను, తుదకు ఇత్తడి, ఇనుప రేకులమీదను, కంచురేకులమీదను వ్రాయువారు. మన దేశములో బంగారు రేకులమీదను, ఇనుపరేకులమీదను వ్రాసినవి దొరకలేదు. దేవాలయములలో స్వామికి అభిషేకము చేయు కంచు ధారాపాత్రలమీదను, కంచువిగ్రహముల పీఠములమీదను చెక్కిన శాసనములు కలవు. విజయనగరాధీశ్వరుడయిన శ్రీరంగరాయల శాసనము ఒక్కటే వెండిరేకులమీద లిఖించినది తెలుగుదేశములో దొరకినది. ప్రాకృతభాషా శిలాశాసనములకు తరువాత తెలుగుదేశములో విరివిగా కానవచ్చినవి తామ్ర శాసనములు.

పౌరాణిక హిందూమతముతోను, వైదిక సంస్కృతి పునరుద్ధరణముతోను తామ్రశాసనములు వాడుకలోనికి వచ్చినవి. వైదికసంస్కృతి పునరుద్ధరణముతో సంస్కృతమునకును, వేదవిదుడయిన బ్రాహ్మణునికిని ప్రాముఖ్యము కలిగినది. తామ్రశాసనభాష సంస్కృతమయినది. సాధారణముగా ప్రతితామ్రశాసనమును బ్రాహ్మణులకు చేసిన భూదాన, అగ్రహారదానములను తెలుపును. ఒకరాజు భూమిని బ్రాహ్మణునికి దాన మిచ్చునపుడు దానపత్రమును ప్రధానముగా రాగిరేకులమీద వ్రాసియియ్యవలెనని, అ ట్లిచ్చునపుడు దాతల, ప్రతిగ్రహీతలతోపాటు వారి తండ్రితాతల నామములను, దాన కారణమును, దానకాలమును అందు వ్రాయవలెనని ప్రాచీన ధర్మశాస్త్ర గ్రంథములు పేర్కొనుచున్నవి. అటుపిదప, దాన మిచ్చిన ప్రదేశమును, దాని సరిహద్దులును, తరువాత దానమును కాపాడినందువలన వచ్చుఫలమును, హరించినందువలనను చెరచినందువలనను వచ్చు పాపమును తెలుపు వ్యాసప్రోక్త శ్లోకములును ఉదాహరింపవలయును. అంతటితో శాసనము పూర్తియగును. తామ్రశాసన మనగా పూర్వ కాలపు దానపత్రము. తామ్రశాసనములు ఆరంభకాలమున దాతవంశమున మూడు తరములవారినే చెప్పుచు వచ్చినను కాలక్రమమున పౌరాణిక వంశానుక్రమముతోపాటు దాతసంపూర్ణ వంశవృక్షమును, ఆయా రాజుల పరాక్రమ కృత్యములనుకూడ వర్ణించుచు వచ్చినవి. కాలము గడచినకొలది శాసనములలో బార్హస్పత్య మానాబ్దములును, శక సంవత్సరములును సూచించుట పరిపాటియైనది. మొదట శకరాజ సంవత్సరములు, శక రాజ్యాభిషేక సంవత్సరములు అను పేరుతో ఆరంభమైన సంవత్సరములు క్రీస్తుశకము పదమూడవ, పదునాలుగవ శతాబ్దములనుండి శాలివాహన శకాబ్దములుగా మారినవి. పూర్వ చాళుక్యనృపతుల కాలమునుండి దత్తగ్రామసీమావధులు తెలుగులో వర్ణితము లగుటవలన తామ్రశాసనములు ద్విభాషాశాసనములైనవి. అంతకు పూర్వము గ్రామనామములు మాత్రమే తెలుగులో ఉండెడివి.

కళింగ-ఆంధ్ర సముద్రతీరములనుండి ప్రాచ్యదేశములకును, సుమత్ర, జావా మొదలైన ద్వీపములకును వలస వెళ్ళిన హిందూ, బౌద్ధ ఆంధ్ర, కాళింగులు తమతోపాటు తమ లిపిని కూడ అక్కడ ప్రవేశపెట్టిరి. ఈ కారణముచేత సుమత్ర, జావా, బోర్నియో, ఇండో చైనాలలో కాన వచ్చు మొదటి శాసనములు సాతవాహనులనాటి బ్రాహ్మీ లిపిలోను, వేంగీ లిపిలోను ఉన్నవి. ఆ శాసనముల భాష సంస్కృతము.

ప్రాకృత భాషలో నున్న శిలాశాసనములకు తరువాత క్రీస్తుశకము నాలుగవ శతాబ్దమునుండి పదునొకండవ శతాబ్దము వరకును శిలాశాసనము లరుదుగను, తామ్రశాసనము లధికముగను కానవచ్చును. క్రీస్తుశకము ఆరవ శతాబ్దమునుండి తెలుగు దేశములోని శిలాశాసనములు తెలుగుభాషలో ఉన్నవి. శిలాశాసనములలో తెలుగు పద్యములు కనిపించుట క్రీస్తుశకము తొమ్మిదవ శతాబ్దము నుండియే. క్రీస్తుశకము పదునొకండవ శతాబ్దమునుండి తామ్ర శాసనములకు తోడు శిలాశాసనములును అధికమైనవి. అప్పటినుండియు శిలాశాసనములు తెలుగులోనేకాక సంస్కృతములో వ్రాయుట కూడ ఆచారమయినది. శాసనములలో సంస్కృతమును, తెనుగును కలిపి వ్రాయుటయు అలవాటు అయినది. సాధారణముగా శిలాశాసనము లన్నియు దేవాలయములకు చేసిన దానధర్మములను తెలుపును. వేరువేరు వృత్తుల వారు, వర్తక సంఘములవారు తమతమ వృత్తులకు, సంఘములకు సంబంధించిన వ్యవహార విషయములను, నియమ నిబంధనలను శిలలమీద చెక్కించుచు వచ్చిరి; కాని ఇట్టివి చాల అరుదు.

కళింగదేశ తామ్రశాసనములలోని లిపి మొదట వేంగీలిపి, అనగా తెలుగు-కన్నడ లిపియే; కాని కళింగ దేశమునకు ఇరుగు పొరుగుల నున్న ఉత్తరదేశములతో సంబంధము ఎక్కువగుటవలన కళింగ తామ్రశాసన లిపి కుటిలలిపిగా మారి క్రమక్రమముగా పదవ శతాబ్దమునాటికి నాగరియై అటుతరువాతకూడ, అదియే వాడుకలో ఉండెను. ఇట్లే కళింగదేశములోని శిలాశాసనములు మొదటినుండి తెలుగు లోనే తెలుగు-కన్నడ లిపిలో ఉండినను క్రీస్తుశకము పదునొకండు, పండ్రెండు శతాబ్దములనుండి సంస్కృతములో నాగరిలిపిలోకూడ కానవచ్చుచున్నవి.

నాగరిలిపి శాసనములు ఒక కళింగములోనే కాక తెలంగాణాలోను కానవచ్చును. కాకతీయుల శిలాశాసనములును, తామ్రశాసనములును కొన్ని పశ్చిమోత్తరలిపుల ప్రభావమున నాగరిలిపిలో ఉన్నవి. కాని కళింగ గాంగ శాసన నాగరిలిపికిని, కాకతీయ శాసన నాగరిలిపికిని ఆశాసనములు కానవచ్చిన ప్రదేశమును బట్టి కొంచెము భేదము ఉన్నది. క్రీస్తుశకము పదునాలుగవ శతాబ్దమునుండి వచ్చిన విజయనగర శాసనము లన్నియు నాగరి లిపిలోనే ఉన్నవి. ఈ నాగరిని నంది నాగరి అందురు.

శాతవాహన, ఇక్ష్వాకు రాజన్యుల చరిత్రమును, బృహత్ఫలాయన, ఆనందగోత్ర, శాలంకాయన, విష్ణుకుండి, పూర్వచాళుక్య, పూర్వగాంగాది రాజవంశములను గురించిన చరిత్రమును కేవలము శాసనములవల్లనే తెలియవచ్చినది. క్రీస్తుశకము పదునొకండవ శతాబ్దమునకు పూర్వపు దేశచరిత్ర తెలియుటకు శాసనములే మనకు పరమాధారము లైనవి.

మల్లంపల్లి సోమశేఖర శర్మ.
తెలుగు సంస్కృతి ( తెలుగు విజ్ఞాన సర్వస్వము - మూడవ సంపుటము ) నుంచి.

AndhraBharati AMdhra bhArati - charitra - telugu dEsha charitra - AdhAramulu - shAsanamulu ( telugu andhra )