ఇతిహాసములు రంగనాథరామాయణము అరణ్యకాండము
రావణునితోఁ జుప్పనాతి మొఱ్ఱ
అంతట ఖరదూషణాది రాక్షసులు
పంతంబుసెడి రాముబాణాగ్నిఁబడుట[వా.రా. సర్గ 32, 33]
యంతయునట సూచి యా చుప్పనాతి
సంతాపమందుచుఁజని లంక సొచ్చి
యా సుధర్మాస్థానియందుఁజింతామ
ణీ సింహపీఠి నుండెడి యింద్రుఁడనఁగ
మానితంబగు సభామంటపవేదిఁ
బూని సింహాసనంబున నున్నవాని
గరుడోరగామర గంధర్వయువతు
లురుమతిఁగొలువఁగ నున్న రావణుని
నైరావతోగ్ర దంతాగ్రసంఘట్టి
తోరస్స్థలస్థగితోరు భూషణుని
సకలలోకైకభీషణుని సంగ్రామ
వికటభాషణుని విద్వేషిదూషణునిఁ
గని మ్రొక్కి యేడ్చుచుఁగరములుమొగిచి
తనలోని ఘనవిషాదము దోపఁబలికె:
“నసురేశ!లోకంబులన్నింటియందు
నసమానసత్త్వుండ ననుకొందు వీవు;
కడిమిమై మూఁడులోకంబుల రిపులఁ
202గడఁగి చంపితినని గర్వింతు వీవు;
కడఁక నా రాజ్యమకంటకంబనుచు
నుడివి పెల్లుబ్బి వినోదింతు వీవు;
నీ విక్రమంబును నీ భుజాబలము
నీ విభవంబులన్నియు మున్నెకాక
యింకఁజెల్లునె? యిది యెట్లంటివేనిఁ;
గొంకక విను: భానుకులపావనుండు
తన తండ్రి దశరథధరణిపాలకుఁడు
తనుఁబంప రాముఁడు దాపసవృత్తిఁ
దనకుగాదిలిసహోదరుఁడు లక్ష్మణుఁడు
దనదేవి సీతయుఁ దాను నేతెంచి
మును దండకాటవి ముదమొప్పఁజొచ్చి
యనుకంప మునులకు నభయంబులిచ్చి
వచ్చి యిమ్ములఁబంచవటి నున్నచోట
నిచ్చలోఁగామించి యేను డగ్గఱినఁ
గరమల్గిననన్నిట్లు గాసిసేయుటయు
ఖరునితోఁజెప్పిన ఖరుఁడు బిట్టలిగి
రోషించి లయకాలరుద్రుండువోలె
దూషణత్రిశిరులతో దండువెడలి
నరభోజనులు పదునాలుగువేలు
వరవీరభటులతో వడి నేఁగుదెంచి
బలువిడి రఘురాముబాణాగ్నిశిఖల
బలములు దానును భస్మమైమడిసె.
నటుగాన నా భంగమంతయు నీఁగ
నిట నీవె కాక దిక్కెవ్వరు గలరు?
ఇదె నాదుముఖభంగ మీక్షింపు; నాదు
కొదవ నీ కొదవగాఁగోర్కి భావింపు.”
మనిన నచ్చెరువంది యాత్మఁజింతించి
దనుజాధినాథుఁ డా దానవి కనియె:
“జ్ఞాతివధంబు నీచన్నవిధంబు
ఖ్యాతి వింటిని;గంటి; నది యట్టులుండె.[వా.రా. సర్గ 34]
నోరామ! యా రామునురుసత్వమెంత?
యే రూప; మే ప్రాయ; మెంతటివాఁడు?
అతనితమ్మునిరూప మది యెట్టి?దతని
సతియైన సీత కేచందంబు రూపు?
చెప్పుమా చూచివచ్చిన తెఱంగెల్ల.
దప్పి దీఱుతు రక్తధారల నీకు.”
నావుడు నా శూర్పణఖ యిచ్చఁబొంగి
రావణుతోడ నేర్పడఁజెప్పఁదొణఁగె:
“నున్నతోరస్‌స్థలుఁడుత్పలశ్యాముఁ
డిన్నిలోకములకు నెక్కుడు వాఁడు
మిగులఁజక్కనివాఁడు మిహిరమండలముఁ
దెగడు తేజమువాడు ధీరవర్తనుఁడు
ఆజానుబాహుఁ డుదగ్రవిక్రముఁడు
రాజీవనేత్రుఁడు రామచంద్రుండు.
అతఁడెపో ఖరదూషణాది రాక్షసులఁ
గృతమతి నొంటిగా గెలిచినజోదు.
హేమవర్ణుఁడుగాక యిన్నిచందముల
సౌమిత్రి రఘురాముచందంబువాఁడు.
వాఁడెపో తన కీ యవస్థ గావించి
నాఁ.డింక సీతసౌందర్యంబు వినుము:
తెఱఁగొప్పఁజూచితి దేవకామినులఁ
దఱిగొని చూచితి దనుజకామినులఁ;
గేలిమైఁజూచితిఁగిన్నరాంగనలఁ;
బోలించి చూచితి భోగికామినులఁ,
గలఁగొనఁజూచితి గంధర్వసతుల;
నలవడఁజూచితి యక్షకాంతలను;
జూచితిఁబార్వతిఁ; జూచితి లక్ష్మి;
జూచితి భారతిఁ; జూచితి రతిని;
జూచితిరంభను; జూచితి శచిని;
జూచితిఁద్రిభువనసుందరీజనుల;
మునుకొని చూచితి మునులకామినులఁ
బనివడి చూచితి బ్రాహ్మణస్త్రీల;
నా చన్ను లా కన్ను లా ముద్దుఁబల్కు
లా చెక్కు లా ముక్కు నా సోయగంబు
నాతరు లా కురు లా వాలుఁజూపు
లా తొడ లాయొడ లా యొయారంబు
లా మందహాసంబు లా విలాసంబు
లా మందగమనంబు లా వివేకంబు
నే ముందుఁబొడగాన నేయింతులందు.
భూమిజ నేమని భూషింతుఁజెపుమ?203
నెగడ లోకములేలు నీయట్టిపతికిఁ
దగుఁగాక యా యింతి తగునె యన్యులకు?
నా యిందుబింబాస్య యా చకోరాక్షి
యా యెలజవ్వని యా కుందరదన
యా మత్తగజయాన యా లతకూన
యా మానినీమణి యా పుష్పగంధి204
యా యింతి నీ యింతియై యుండెనేని
నీయాన దనుజేశ! నీ రాజ్యమొప్పు.”

  1. ↑నే పల్కినట్టి కన్నెలటెక్కులెల్ల - రూపింపఁగాలిగోరును బోల వరయ, నెమ్మేన వెలుఁగొందు నిద్దంపుమణుల - సొమ్ములకును దానె సొమ్మయి తనరు; నెగడ…
  2. ↑ఆ కోకిలాలాప యా నీలవేణి - యా కోకవక్షోజ యా కోమలాంగి, యా పక్వబింబోష్ఠి యా ముద్దులాడి - యా పసిండిసలాక యా ఘనజఘన, యా యింతి…
  3. ↑సుచంద్రాఖ్య
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )