ఇతిహాసములు రంగనాథరామాయణము అయోధ్యాకాండము
మంథర దురాలోచనము
నప్పుడు మంథరయను కైకదాసి
తప్పక తన మేడఁదా నెక్కి చూచి[వా.రా. సర్గ 7]
“యిదియేమి 20సంభ్రమ మీ పురలక్ష్మి
పొదలుచున్నది మహాద్భుతవైభవములఁ.
బౌరులందఱును నపార శృంగార
చారుశరీరులై 21సంచరించెదరు.
కౌసల్యనగరిలోఁగల కాంతలెల్లఁ
గైసేసియున్నారు గడు22వేడ్కతోడ.
నేలకో కౌసల్య యెద నుబ్బియుబ్బి
వేలసంఖ్యధనంబు వెచ్చపెట్టెడిని.”
అనుచుఁబ్రమోదాదియగు రాముదాదిఁ
గనుఁగొని యడిగి యక్కామినివలన
రాముఁబట్టముగట్టి రాజుఁగావింప
నా మహోత్సవకోటులని నిశ్చయించి
23పనివడి“రాముఁడు బాల్యంబునందుఁ
దన కాలువిఱిచిన తప్పు సాధింప
నిది నాకుఁదఱి.”యని యిచ్చఁజింతించి
యది హెచ్చి కైకతో నంతయుఁజెప్ప
వచ్చి తత్కేళీ నివాసంబుఁజొచ్చి
మచ్చిక నుయ్యెలమంచంబుమీఁదఁ
బ్రవిమలమృదులతల్పంబుపై వేడ్కఁ
బవళించి 24యున్న యప్పద్మాక్షిఁజూచి
“లెమ్ములెమ్మో భామ! లీలాభిరామ!
యిమ్మెఱుంగవు కార్యమేమియు.”ననుచుఁ
గొనరెట్టవట్టి గ్రక్కున లేవనెత్తి
తన నేర్పుమాటలఁదరుణి కిట్లనియె:
“వామలోచన!నీకు వచ్చిన భయము
నీ మదిఁదలపోయ నేర వెంతయును.
‘వసుధాధిపతి నాకు వలచు; నా భాగ్య
మసమాన’మని చెప్పు; దది బొంకులయ్యె.
నది యెట్టిదనఁ: బెద్దయాలికి వెఱచి
మదిరాక్షి! నిను25నేఁడుమఱి మోసపుచ్చి
భరతుని నొకవంకఁ బరభూమి కనిచి
పరికించి రఘురాముఁ బట్టంబుగట్టఁ
దలఁచుచునున్నాఁడు దశరథేశ్వరుఁడు.
నెలఁత! యిట్టిదయైన నీ కేటి బ్రతుకు?
రాజుల మది నమ్మరాదు. నీ వేల
వేజాడలను విఱ్ఱవీఁగె దో బాల?
యిట్టి మోహవిదూరు నిట్టివంచకుని
నిట్టిబూమెలకాని నెందు నేఁగాన.
మగఁడె యాతఁడు మైత్రి మాలినయట్టి
పగవాఁడుగాక యీ పట్టున నీకు!
సవతికుమారుని జగతియంతటికి
ధవునిగాఁ జేసిన ధవళాయతాక్షి!
నీ కుమారునకును నీకును నాకు
శోక మబ్బుటెకాక సుఖమేల కలుగు?
నీ కరణంబుగా నీ తండ్రి వనుపఁ
జేకొన్నప్రేమ వచ్చినదానఁ 26గాన,
నీ లెస్స నాలెస్స నీకైన లేమి
నా లేమి గాన నానావిధంబులను
హితవు సెప్పితి నీకు నిందుబింబాస్య!
మతి నీదు పుత్త్రుండు మనుట దలంపు:’
మనిన వేడుక పూని యా కైక దాని
వినుతించి కౌఁగిట వేగంబ చేర్చి:
“శ్రీరాముపట్టాభిషేకోత్సవంబు
సేరి నా కెఱిఁగించి చెవులకు విందు
సేసితి; వేమందుఁజెలువ! నీ పొందు
వాసిగా ఫలియించె; వక్రోక్తులుడుగు.
భరతునకంటె నా భరతాగ్రజుండు
దిరమైనభక్తి విధేయుండు నాకు.
నీ మేలువార్తల కేను మెచ్చితిని
భామరో!”యనుచు నేర్పడ27నొకసొమ్ముఁ
“గొమ్ముకొ”మ్మని యొసగుటయు నా సొమ్ము
నమ్మాయలాఁడి యల్లటు పాఱవైచి[వా.రా. సర్గ 8]
పాపంబు హృదయతాపంబుఁగోపంబు
దీపింపఁబలికె నత్తెఱవతో మఱియు:
“నిది యేమిమేలుగా నిచ్చ నుబ్బితివి?
యిది యేమిమెచ్చుగా నిచ్చితి నాకు?
నిది యేమి కైక? యీ హితవు గైకోక
వదరి పల్కితి నీతి భావింపలేక.”
సవతికుమారుఁ డీ సామ్రాజ్యమునకు
ధవుఁడైన సకలభూధవులు బాంధవులు
బ్రజలు మంత్రులు రాముపంపు సేయుదురు.
గజహయాదిబలంబు కైవసంబగును.
దశరథునకు స్వతంత్రము లేదు పిదప.
శశిముఖియైన కౌసల్య సంపదల
విఱ్ఱవీఁగఁగ 28సరివెలఁదివై యుండి
వెఱ్ఱిదానవె యెట్లు వేగించె దీవు?
అది యిది యేల? నీ వావధూమణికి
నొదుఁగుచు దాసివై యుండంగవలయు;
భరతుఁడు నా రఘుపతికి భీతిలుచు
వెరవేది భృత్యుఁడై విహరింపవలయు;
రాచదేవులటంచు రమణి సీతకును
నీ చిన్నికోడ లెన్నికఁ గొల్వవలయు;
నెలఁత! యిట్టిదయైన నీకేటి బ్రతుకు?
కలదుపాయం 29బిట్టికార్యంబునకును.
వనదుర్గముల రాము వసియింపఁబనుపు;
30పనుపుము భరతునిఁబట్టంబు31గట్ట.”
ననవుడుఁగైకేయి:“యక్కటా!నాకు
జననాథుఁ32డింతటిచన వేలయిచ్చు?[వా.రా. సర్గ 9]
నా రాజు నేమని యడుగుదు నేను,
నీ రెండు? దశరథుఁడేల నాకిచ్చు?
నెక్కడిమాట! నీవెన్ని సెప్పినను
నిక్కార్యఘటన నా కే రీతిఁబొసఁగు?”
ననుచున్న కైకతో నా యుపాయంబు
తన33కీడు మెఱసి మంథర సెప్పఁదొడఁగె:
“బడఁతుక!తొల్లి శంబరుఁడు నింద్రుండుఁ
దొడరి పోరాడ నింద్రునకునై పూని
నినుఁదోడుకొని సైన్యనివహంబుఁదానుఁ
జని రాత్రి మార్కొన్న శంబరుతోడఁ
బోరాడు దశరథభూపాలుమీఁద
నా రాక్షసుఁడు మాయ34లలుకఁబన్నుటయు
ధవళాంగుఁడనుమునిదయ నీవు గన్న
యవిరళంబగుమాయ నమ్మాయ లణఁచి
నీ విభునా దైత్యు నిశితాస్త్రనిహతిఁ
జావకుండఁగఁగాచి సంప్రీతిఁ జేసి
వసుధేశుచే నాఁడు వరములు రెండు
మసలక పడసితి; మఱచితే వాని?
నీవె నా కీ కథ యెఱిఁగించి మఱచి;
తీ వాత్మమఱచిన నే నేల మఱతుఁ?
బట్టంబుఁబెడఁబాసి పదునాలుగేండ్లు
గట్టిగా మునిచర్యఁ గౌసల్యకొడుకు
దారుణకాంతారతలము నేలుటకు
ధారుణీతలము నీ తనయుఁడేలుటకు
నా రెండువరములు నవనీశు నడిగి
యీ రెండుతెఱఁగుల నిటు సేయఁబనుపు.
పడఁతుక! యతఁడెంతప్రార్థించెనేనిఁ
దొడవులెన్నేనిఁ దోడ్తో నిచ్చేనేని
జడమతి లోఁగాక సత్యంబు నెఱపి
విడువక యీ కార్యవిధము సాధింపు.
పతి బొంక వెఱచు; నీ పై నెయ్య మెక్కు
డతకరింపఁడు సేయు.”ననిన రాగిల్లి:
“నీ వంటి ప్రియురాలి, నీ వంటి సఖిని,
నీ వంటి నయగుణనిధి నెందుఁగాన.
నీవు నా చే విన్న యీ వరద్వయముఁ
గావరంబునఁగానఁగా వరారోహ!
యీ వెంచినటువలె నీ భూమికెల్ల
నా వరతనయుండు నాయకుండైన
బాగుగా నపరంజిబంగారుచేత
నీ గూను వొదిగించి నీ ముఖేందువునఁ
దిలకంబుఁగస్తూరి దిద్ది నీ మేను
వలనొప్ప భూషణావళులఁగైసేసి
నటియించుమరుని 35యందలపుఁగొమ్మనఁగఁ
గుటిలకుంతల! నీవు గ్రుమ్మరుచుండ
సఖులెల్ల నీ మాట జవదాటకుండ
సఖియ!36నిన్నలరింతు సతత మే.”ననుచుఁ
గైక మంథరకు సత్కారముల్‌ సేసి
యేకాంతమునఁదనయింటికిఁబోయి
పెట్టినసొమ్ములు పెట్టెలోఁ37బెట్టి
దట్టమౌ కస్తూరిఁదలపట్టు వెట్టి
మలినవస్త్రము గట్టి మది నల్కఁ38దొట్టి
చలము 39సేపట్టి భూస్థలిఁబండె. నంతఁ
దనలోన నూహించి తనుఁగొల్చివచ్చి
మనమార నున్న యామంథరఁ జూచి:[వా.రా. సర్గ 10]
“జననాయకుఁడు రామచంద్రునిఁ బిలిచి
వనమున మునివృత్తి వర్తింపఁ బనిచి
భరతునిఁ దన రాజ్యభరమునకెల్లఁ
గరమర్థిఁబట్టంబు గట్టినఁగాని
యన్నపానములొల్ల; నాభరణంబు
లెన్ని యిచ్చిన నొల్ల; నేమియు నొల్ల;
నిట లేచిరా నింక నే.” నంచు నలుక
నటుపూని మదిలోన నలయుచున్నంతఁ;
గైకేయితోడ రాఘవుని పట్టాభి
షేకోత్సవంబుఁ దాఁ జెప్పెదననుచు
నా రాత్రి దశరథుండచటి కేతెంచి
చారుమాణిక్యకాంచనధగద్ధగిత
కేళీగృహంబునఁ గేకయపుత్త్రిఁ
బోలంగఁబరికించి పొడగాన కపుడు
దౌవారికునిఁగాంచి దశరథుండడుగఁ
గా వాఁడు 40వణఁకుచుఁగరములు మొగిచి:
“దేవ! యా కోపమందిరములోపలికి
దేవి విచ్చేసె; నేతెఱఁగొకో యెఱుఁగ.”
నని వాఁడు వలికిన41నా మాట గుసుమ
ధనురుగ్రటంకారదారుణంబగుచు
వీనులఁబడ మోము వెలవెలఁబాఱ
మానవాధీశుండు మానసంబునను
మానైన ధృతి దూలి మ్రాన్పడి కలఁగి
మానంబు డోలాయమానంబు గాఁగఁ
బ్రేమానుబంధంబుఁ బ్రీతి రెట్టింప
నా మందిరంబున కల్లన వచ్చి
యనిమిషపురినుండి యచ్చరలేమ
సనుదెంచి పడియున్నచందంబు దోప
నూరక ధరణిపై నున్న యా వికచ
నీరజాననఁజూచి నివ్వెఱఁగంది
వెఱవెఱపాటొంది వేదనఁజెంది
తెఱవడగ్గఱఁ జేరి దీనుఁడై యపుడు
యా యింతియొడలెల్ల నంటి దువ్వుచును
గాయజవివశుఁడై కడువేఁడఁదొడఁగె:
“నిందీవరాక్షి! పూర్ణేందుబింబాస్య!
యిందిందిరాలక! యీ నేల నలుకఁ
బవళింప నీకేల? బాలేందుఫాల!
యవిరళమృదులపర్యంకంబు లుండఁ?
గోమలధవళ దుకూలంబు లుండ
నీ మైలచేల నీ వేల కట్టితివి?
పసిఁడిశలాకకుఁబ్రతియైన మేనఁ
బొసఁగ భూషణములు పూనవేమిటికిఁ?
జలపట్టి కొఱనెలచందమౌ నుదుటఁ
దలపట్టు వెట్ట నీ తలఁపెట్టుపుట్టె?
నీలాలకంబులు నిగ్గులుదేర
నేల పాపట దీర్ప విన్నాళ్లరీతిఁ?
గెమ్మోవి కిన్మడికెంపు సంధిల్లఁ
గమ్మఁదమ్ముల మేల కాక్షింప వబల!?
జిలుఁగువెన్నెలతేట 42జిగి నవ్వుమొలక
మొలపింపవేటికి ముఖచంద్రునందు?
నిదియేమి కైక, నీ విటు సిన్నవోవ?
మదిఁదూలి నీ కింత మఱుఁగ నేమిటికి?
నెవ్వరు నీ దెస నెగ్గులు43 వలికి?
రెవ్వరు మాఱాడి రెదిరి నీ తోడ?
వారి నెఱింగింపు వారిజనయన!
వారి వారింతు నెవ్వారలనైన.”44
నని పల్కి కన్నుల నందంద45క్రమ్ము
ఘనబాష్పపూరముల్‌ గరములఁదుడిచి
“లేమ! నీ వొకదిక్కులేని చందమున
భూమిపై నిటు ధూళిఁబొరల నేమిటికి?
గాము సోఁకెనొ, లేక ఘనమైనరోగ
మేమి వాటిల్లెనో, యెఱిఁగింపు నాకు.
46వెజ్జులఁబిలిపించి, వేగ మాన్పెదను.
లజ్జింప నేటికి లలితాంగి! నీకు?
నటుగాక నీ తలంపరయ నొండైన
నిటు సేయుమని పల్కు; మేనెచేసెదను;
వనిత! నీ కొఱకునై వధ్యులు గాని
యనఘచరిత్రులనైనఁజంపెదను;
చంపంగఁదగిన దుర్జనకోటినైనఁ
గంపించి నీ మాటఁగాచి పుచ్చెదను;
నీకుఁబ్రియంబైన నిరుపేదనైనఁ
జేకొని రాజుగాఁజేసెద నెలమి;
భామ! నీ కరుణకుఁబాసినయట్టి
శ్రీమంతునైన దరిద్రుఁజేసెదను;
నేను నా వారు నీ హితబుద్ధి గడవఁ
గానేర;మిట్లుండఁ గారణంబేమి?
లేమ! నా మాట లాలించి నీ విపుడు
మో మెత్తు నా మదిముచ్చట దీఱ;
నడిగిన ప్రాణంబులైన నీ కిత్తు;
నడుగుము నీ.” వన్న నా నందమంది
యన్నాతి విభునినెయ్యముఁదియ్య మెఱిఁగి
సన్నపుటెలుఁగున జననాథుఁబలికె:
“దేవ! నేఁజెప్పిన తెఱఁగున నీవు
గావింతు నని బాస గావించి తేని[వా.రా. సర్గ 11]
మఱి యెఱింగింతు నమ్మాట నీ.”కనినఁ
దెఱవతో దశరథాధిపుఁ47డప్పుడనియె:
“వీరుఁడెవ్వఁడు మేటివిలుకాండ్రలోన;
సార మెవ్వఁడు ధర్మసమితిలోనెల్ల;
నెవ్వనిఁజూడక యే నుండఁజాల;
నెవ్వఁడు48నను భక్తి నే ప్రొద్దుఁగొలుచు;
నట్టి రాఘవునితో డతివ! నీ కోర్కి
నెట్టన గావింతునే.”నన్న నలరి
మరుదగ్ని శశి నభోమణిముఖ్యులైన
సురలఁ బేర్పేర సాక్షులుగా నొనర్చి
ధరణీశుమదిలోనితమకంబుఁదెలిసి
కరుణకుఁబెడఁబాసి కైకేయి వలికె:
“నొలసి దేవాసురయుద్ధంబునందు
వలనొప్ప నిచ్చితి వరములు రెండు
భూవర! మఱచితే బుద్ధిఁజింతింపు;
మా వరద్వయము నిన్నడిగెద నిపుడు.
నాదిత్యకులజుండవగు మహారాజ!
వాదిరాజులకంటె నధికపుణ్యుఁడవు;
తప్పాడ; వాడినఁదప్పవు; నాకుఁ
దప్పక వరములు దయ నిచ్చితేని
ధరణికంతటికిని 49దగు రాజుగాఁగ
భరతుఁ బట్టముగట్టఁ బనుపు మొక్కటికిఁ;
బరగఁ దాపసవృత్తిఁ బదునాలుగేఁడు
లురుదుర్గముల రాము నునుపు మొక్కటికి.”
ననుపల్కు నిర్ఘాతమై వచ్చి చెవులఁ
గొని50కాఁడి నొప్పింపఁగుంభినిఁద్రెళ్లి[వా.రా. సర్గ 12, 13]
పెలుకుఱి51మూర్ఛిల్లి పెద్దవ్రొద్దునకుఁ
దెలివొంది కైకేయిదెసఁ జూచి పలికెఁ :
“గోమలి! కేకయకులమునఁబుట్టి
యీ మాటలాడ నీ కెట్లాడెనోరు?
అడవులపాలు గమ్మని రాముఁద్రో52వ,
నెడపక తొల్లి నీ కె గ్గేమిసేసెఁ?
గౌసల్యకంటె నిన్‌ ఘనముగాఁజూచు;
నీ సేవ లొనరించు; నీ పంపు సేయు;
నటువంటి సుగుణాఢ్యుఁడైన శ్రీరాము
నెటువలెఁబొమ్మంటివే దయమాలి?
యడవుల కతని నీ వంపుమటన్న
నెడ సూచి చూచి నేనెట్లు పొమ్మందు?
నా మహాత్ముని రాము నడవుల కనిచి
యీ మేనఁబ్రాణంబు53లే నెట్లు దాల్తు?
నృపపుత్రివని నిన్ను నెమ్మిఁగైకొంటిఁ;
జపలలోచన! కాలసర్పంబవైతి.
నా రాజ్యమైనఁ బ్రాణములైన 54విడుతు;
నా రాము విడిచి పొమ్మని పల్కఁజాల.
నను వృద్ధుదీను ననాథు దుర్బలుని
మనికితపడకుండ మగువ! రక్షింపు.
చక్కఁగా నీ పాదజలజంబులకును
మ్రొక్కెద నేను రాముని55యెడాటమునఁ
జెలువ! యీ 56పాపంబు సింతింపనీకు
వల.”దన్నఁగోపించి వామాక్షి వలికె?
“రాజేంద్ర! సత్యపరాక్రమస్ఫూర్తిఁ
బూజితకీర్తి57వై బొంకంగఁదగునె?
యిట్టు దేవత లింద58ఱెఱుఁగంగ నొట్టు
వెట్టి తప్పెద వెట్టి పృథ్విపాలుఁడవు?
ఒక గువ్వకై తనయొడలి మాంసంబు
నొకడేగకును శిబి యొసగఁడే తొల్లి?
క్షోణిదేవున కలర్కుండను రాజు
త్రాణతో నొసగఁడే తన లోచనములు?
చెలరేఁగి జలధియుఁజెలియలికట్ట
బలిమి దాటక లోనుబడి యుండలేదె?
అది యట్టులుండె: నీ యన్వయోద్భవులు
మదిలోన నవ్వులమాటలకైనఁ
గలనైన బొంక; రిక్ష్వాకుండ వయ్యు
వెలయఁగౌసల్యకు వెఱచి బొంకెదవు!
బొంకెడువాఁడొక్కపురుషుఁడే యకట!
బొంకితి; నినుఁ59జూడ బుద్ధిగా;దింక,
విచ్చలవిడి నేను విషమైన మ్రింగి
చచ్చెద; నటమీఁదఁజంపింపు భరతుఁ;
బావనుండగు రాముఁ బట్టంబు గట్టి
నీవుఁ గౌసల్యయు నెమ్మది నుండుఁ.
డని పల్కుటయు శోక మాత్మరెట్టింప
జననాథుఁ60డెంతయుసంతాపమంది
వెలవెల61పాటు వివేకహీనతయుఁ
గలిగి యా కైకతోఁగ్రమ్మఱఁ బలికె:
“నేల కైకేయి, నీ కిట్టిపాపంబు
బాలిశత్వంబును బ్రాపించె మదిని?
అన్నయుండఁగఁ దమ్ముఁడవినీతితోడ
నిన్నేల యేలునా? యిన్నియు నేల?
నీ కుమారుఁడు ధర్మనిరతుండు భరతుఁ
డీ కలుషక్రియ కెట్లొడికట్టు?
మా కులాగతమైన మర్యాదఁదలఁపు;
శోకార్తుననుఁదెగఁజూడక 62మనుపు.
మెప్పుడు నిల్లాలు హితము భక్తియును
దప్పక సఖిరీతిఁ, దల్లిచందమున,
దాసివైఖరి, సహోదరితెఱంగునను
నా సేవ లొనరించు నానా విధముల;
నట్టి కౌసల్య మోహపుఁబట్టిఁబాసి
పట్టైనధృతి నెట్లు ప్రాణముల్‌ వట్టు?
సౌదామనీ లతాసంకాశదేహ
వైదేహి యేరీతి వగల వేగించు?
నా సుమిత్రాపుత్త్రుఁడతనితల్లియును
నీ63సుద్ది విని శోక మెట్లడంచెదరు?64
“అకట!కామాంధుఁడై యాలిమాటలకు
సకలభూభువనరక్షణదక్షుఁడైన
యగ్రనందను రాము నడవుల కనిచె;
నుగ్రాంశుకులకీర్తులుడిగెఁబొ.”మ్మనుచు
వెఱగంది రచ్చలు వీథులు గలయఁ
దఱచు మూఁకలు గట్టి తలపోసి చూచి
కల్లుద్రావిన విప్రు గర్హించినట్టు
లెల్లరు నెంత గర్హింతురో నన్నుఁ!
గావున నెల్లలోకములకుఁ గీడు
గావించి యే సౌఖ్యగతులందె దీవు?
ఇది65యది యేల? నేనిఁక నొక్కమాట
ముదిత!సెప్పెద నిక్కముగ;నీవు వినుము:
కలువరేకులఁబోలు కన్నులవాని,
మొలకనవ్వులమోము మురిపంబువాని,
బలువైనయాజాను బాహులవాని,
వలరాజు66నేలు చెల్వము గలవాని,
నల్లఁగల్వలకాంతినగు మేనివానిఁ,
జల్లఁజూపులు వెదసల్లెడువానిఁ,
గెంపుపెంపడఁగించు కెమ్మోవివాని,
నింపుగుల్కెడునడ నెసగెడువాని,
జిగియద్దములఁబోలు చెక్కులవాని,
మగఁటిమి దివిజుల మఱపించువాని,
సుధలొల్కుతియ్యని సుద్దులవాని,
బుధులకు హిత మాత్మఁ బూనెడువాని,
67వలసి నా కెపుడు సేవలు సేయువాని,
నిలువెల్ల ధర్మమై నెగడెడువాని,
రాముని, జితభృగురామునిఁ,గాంతి
సోముని, సద్గుణస్తోమునిఁ, గీర్తి
కాముని, సౌందర్యకాముని, శాంతి
ధాముని, రవిసమధామునిఁ బాసి
నిమిషమాత్రంబైన 68నే నోర్వఁజాలఁ;
గమలాక్షి! నీ వెఱుంగవె యిట్టి 69దౌట.
ఆ యుత్తమోత్తముండడవుల కెపుడు
వోయె నా ప్రాణముల్‌ వోవు నాక్షణమ.
కఠినాత్మురాల! యీ కల్మషంబేల?
శఠమతిఁగోరెదు సాధ్వివైయుండి?
ఆలవై ప్రాణాపహారంబు సేయు
కాలరాత్రివిగాక కాంతవా నీవు?
నడచి రాముఁడు గాననముల కెట్లరుగు?
నడవుల నెట్లుండు నందఱఁబాసి?
మెత్తనిపాన్పున మే70నొత్తు భోగి
యెత్తెఱుఁగున నుండు నిలఁదృణశయ్య?
బంతి నిష్టాన్నముల్‌ బంధులుఁదాను
నెంతయునియతితో నిట యారగించు
కడుపుణ్యదేహికిఁ గందమూలములు
నెడపక భుజియింప 71నెట్లు సిద్ధించు?
నతివ! నీ కతిభక్తుఁడైన రామునకు
మతిఁగీడు దలఁపక మన్నింపు.”మనుచు
నడరుశోకంబున నడుగులమీఁదఁ
బడిన మ్రొక్కొల్లక పాదముల్‌ దిగువ
భూకాంతుఁడిలఁబడి 72పొగులుటఁజూచి
కైకేయి దశరథుఁగని యిట్టులనియెఁ:
“జాలుఁ73జాలునువట్టిజగజాలిమాట;
చాలింపుమీ; యిట్టిజాడ లేమిటికి?[వా.రా. సర్గ 14, 15]
ధర్మంబు విడిచి, సత్యము వీటిఁబుచ్చి,
నిర్మలయశమెల్ల నీటిలోఁ గలపి,
యీ వరద్వయము నీ కీలేదటంచు
భూవర! బొంకి నీ పుత్త్రుండు నీదు
దేవులు నీవు వర్ధిల్లుము; నేను
నా వరసుతుఁడుఁబ్రాణములు వాసెదము.”
అనునంత మాఱాడ కనువేది విభుఁడు
దనమదిఁజింతించి తలవాంచియుండె.

  1. ↑చందమో యీ
  2. ↑సంతసించెదరు
  3. ↑వింతగాఁగ
  4. ↑ఈ ద్విపదప్రక్షిప్తము కాఁబోలును చూ. బాలకాండ. అను “తొల్లి కౌసల్యాతనయుచేతం దనకునైన చరణతాడన భంగంబు వైరకారణంబుగాఁగొని.” భాస్కర రా
  5. ↑నిదురించుపద్మాక్షి
  6. ↑వేడ్క
  7. ↑నేను
  8. ↑గొంత
  9. ↑నీవు వెలితిగానుండి - వెఱ్ఱిదానాయెట్లు వేగింపఁగలవు?
  10. ↑బునీ కార్యం
  11. ↑పనివడి
  12. ↑గట్టు- మ
  13. ↑డెంతైనఁ జనవిచ్చునేని
  14. ↑రెడుననుచు
  15. ↑లడరించుటయును
  16. ↑యందపుఁగొమ్మయనఁగ
  17. ↑నిన్నేలింతు
  18. ↑వైచి
  19. ↑బుట్టి, దోఁప, తోడ
  20. ↑సాధింప
  21. ↑వగచుచు
  22. ↑యా మాటలెల్ల
  23. ↑చిఱు
  24. ↑వట్టి
  25. ↑నెవ్వరు నీమాటలిటమీఱిచనిరి?- యివ్వగ నీకేల? యిట్లుండనేల?-ననిపల్క…
  26. ↑దొరుగు
  27. ↑వెజ్జులఁబిల్చిన (లువచ్చిన)వేగమాన్చెదరు
  28. ↑డిట్టుల
  29. ↑భక్తినన్నెప్పుడు
  30. ↑దగ
  31. ↑కాఁడమూర్ఛిల్లి
  32. ↑భూపతి
  33. ↑య
  34. ↑లెట్లునిల్పుదును
  35. ↑నిత్తు
  36. ↑బాయఁ(విడ్వఁ)జాల
  37. ↑పాపంపుఁజింత చింతింప
  38. ↑మై
  39. ↑టెఱిఁగినమాటలెట్టు
  40. ↑బొంద
  41. ↑డెంతేని
  42. ↑ఁబోయి
  43. ↑నిలుపు
  44. ↑సొద
  45. ↑శ్రీరాముపట్టాభిషేకంబుఁ గోరి - పౌరులందఱు వేడ్కఁబడి యుండుచోట, నా రాము నడవుల కనిచితినేని - ధీరాత్మకులు నన్నుఁ(త్మననుఁబ్రువ్వ) దిట్టకుండెదరె?- కావున నెల్ల…
  46. ↑యేలకో కైక యింకొక్క
  47. ↑గేరు
  48. ↑వలచి
  49. ↑నిల్వనేఁ
  50. ↑వాని-నా
  51. ↑నెత్తు
  52. ↑నెటుసమ్మతించు, టెటులని తలఁప- వ
  53. ↑పొగులఁ గైకొనక
  54. ↑జాలీవట్టి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )