ఇతిహాసములు రంగనాథరామాయణము అయోధ్యాకాండము
సీతాలక్ష్మణుల రామానుగమన నిశ్చయము
“నిదియె నిశ్చయమైన నేను నీ వెంట
వదలక పైనమై వత్తు నీ క్షణమె.[వా.రా. సర్గ 27]
నినుఁబాసి యే నిల్వనేరఁ; బ్రాణములు
ననుఁబట్టనేరవు నా ప్రాణనాథ!?
యడవుల కేనును నర్థితో వత్తుఁ;
161దొడుకొనిపొ.”మ్మన్నఁదూలి రాఘవుడు
“కమలాక్షి!యడవులఁగందమూలములు
నమలుచు,రానేల? నడచుచు, నీవు[వా.రా. సర్గ 28]
నారచీరలు గట్టి నవయుచు, వగలఁ
గూరుచుఁ,బేరెండకును గాలి కోర్చి,
నేలలఁబవళించి, నిచ్చలుఁ బర్ణ
శాలలయందుండఁజాలుదే162 యకట!
కోమల163దేహవు,గోలవు,బేల;
వేమియు నే పాటు నెఱుఁగవు నీవు.
తలఁప నీవెక్కడ? దంతులఁబులుల
నెలుఁగులఁదోఁడేళ్ల నిఱ్ఱులఁ164గరులఁ
బాముల గాములఁబైఁబ్రాఁకునెఱ్ఱ
చీమల గిరిగుహాసీమలఁ జఱుల
ఝరుల నిమ్నోన్నతాశ్చర్యమార్గముల
విరస కంటక లతావృక్షవర్గములఁ
దలఁప నక్కజమైన దారుణాటవుల
మెలఁగుట యెక్కడ మేదినీ తనయ!?
కావునఁగౌసల్యకడ నుండి నీవు
సేవింపు మా సాధ్విచిత్తంబు వడసి;
గృహదేవతలఁగొల్వు; కీర్తింపు నన్ను;
నహరహంబును మామయడుగులకెఱుఁగు;
భరతుఁడు నిను మాతృభావనఁగొలుచుఁ
బరుసంబు లాతనిఁ బలుకకు మబల.
యిదెపోయి పదునాలుగేండ్లు నిండించి
ముదమొప్పఁజనుదెంతు ముదిత!చింతిలకు.”
మనవుడుఁబ్రణయశోకార్తయై రాముఁ
గనుఁగొని సీత నిక్కము దోపఁ బలికె:[వా.రా. సర్గ 29]
“జననాథ! సహధర్మచారిణిగాఁగ
జనకుచే న న్నగ్నిసాక్షిఁ గైకొంటి.
జనలోక165నుతుఁడవు సత్యసంధుఁడవు;
ననుడించి 166నీకుఁగానల కేఁగఁదగునె?
యెన్ని దుఃఖములు నీ వెన్నితి వడవి
నన్నియు సౌఖ్యంబు లనఘ! నీదయను.
ఈ వాడ లీ మేడ లీ బంధుబృంద
మీ వస్తుసంపద లీ జీవనంబు
నీవు లేకున్నచో నిస్సార మరయఁ.
గావున నిచట నే కరణి వేగింతు?
సావిత్రియనుపుణ్యసతి దనపతిని
సేవించి పోయినచెలువున నేను
నీ వెంటఁజనుదెంతు నీ నీడవోలె.
నే వెంట సాధ్వికి నిదియ ధర్మంబు.
నినుఁబాసి యిచ్చట నిముస మే నోర్వ;
వనముల నినుఁగూడి వర్తింప నేర్తుఁ,
బదునాలుగేండ్లేల 167ప్రాణేశ! నిన్నుఁ
గదిసి వేయేండ్లైనఁ 168గాపుందు నందు.
సతులకు169జగముల జనులెంచఁదగిన
మతముఁబ్రతిష్ఠింపు; మఱి వేయునేల?
యీ వరణ్యములకు నిట నన్ను డించి
పోవుట నిజమైనఁబోవుఁబ్రాణములు
నలుకమైఁ గాదేని నగ్నిచే నైన
జలముల నైన విషంబుచే నైన.
నేచిన వగలోర్వ నే; నిటె చత్తు;
నా170చావు సూచి పో; ననుడించి పోకు.”
మని171విలాపించుచు నడుగులమీఁద
జనకజ వడియున్న చందంబు సూచి
కరుణతో నల్లనఁ గరపల్లవమున
ధరణీశతనయుండు దనుమధ్య నెత్తి:[వా.రా. సర్గ 30-32]
“యలివేణి! నిను172డించి నాకంబునందు
నలువంద విహరింప నా కిచ్చలేదు.
నినుఁదోడుకొనిపోదు; నీవు నాతోడఁ
జనుదేరఁగుశలంబు సకలంబు నాకు.
నిమ్ముల నీ చిత్త మెఱుఁగంగఁదలఁచి
యిమ్మాట లాడితి నేతెంతుగాక.”
యనుచు నా రఘురాముఁడతికృపామూర్తి
జనకజరాకకు సమ్మతుం డగుచు
“వలయుదానంబులు వరుసఁగావింపు
నెలఁత!నీ.”వనుటయు నెమ్మనంబలరఁ
గాంచనరత్నాదికంబులై173 మెఱయు
నంచిత దానంబు లమ్మహీసుతయుఁ
వరుసఁబ్రియంబగు వారలకెల్లఁ
గరమర్థి నందంద గావించె. నంత
నా వేళ లక్ష్మణుండన్న నిశ్చయము
భావించి తన పాణిపద్మముల్‌ మొగిచి:
“యినకులాధిప! యింక నిట్టిదయేనిఁ
దనకిట వనియేమి ధనువు మోపెట్టి
మునుపుగా నడవికిమ్ముల మిమ్ముఁగొల్చి
చనుదెంతు.”నని వేఁడుసౌమిత్రిఁజూచి:
“నా తోడ నీవు గానకు వచ్చెదేని
నా తోడ నినుఁబాసి నానావిధముల
మిడుకు కౌసల్యాసుమిత్రల నెవ్వ
రుడుకార్చిపోషింతు రుడుగనిభక్తి.”
ననవుడు లక్ష్మణుండనియె: “మీ వెంట
వనభూములకు వత్తు; వలదన్నఁజత్తు;
నిమ్ముల నామర్మమిట్టిద.” యనినఁ
దమ్మునిరాక కెంతయు సమ్మతించి

  1. ↑దొడుక పొమ్మనవుడుఁ
  2. ↑యబల!
  3. ↑దేహపు
  4. ↑గిరులఁ
  5. ↑హితు
  6. ↑నీవు… దగదు
  7. ↑పాసెద
  8. ↑గడువేడ్కఁగొలుతు
  9. ↑ఁబతులకు
  10. ↑చూపుడించి
  11. ↑ప్రలాపించుచు
  12. ↑బాసి యా వనంబునను
  13. ↑వెలయు, నట్టి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )