ఇతిహాసములు రంగనాథరామాయణము అయోధ్యాకాండము
కౌసల్య సీతను దీవించుట
ఘనుని రాఘవుని లక్ష్మణుని దీవించి
జనకజఁ జూచి కౌసల్య శోకించి:
“యడుగక యితఁడు మహాచక్రవర్తి
కొడుకని మీ తండ్రి కోరి నిన్నిచ్చెఁ;
235గడవనిదైవయోగంబునఁ జేసి
కడపట మఱి యిట్టిగతి యయ్యె236నేఁడు.
తాపసవృత్తిమైఁ దగిలి కానలకు
నీ పతితోఁ గూడి నీ కేఁగవలసె
దీనికి వగవకు; తివిఱి శ్రీరాముఁ
డీ నిఖిలోర్వియు నేలెడి మగుడఁ.
బతి పేదవాఁడైనఁ బాయంగరాదు
సతులకు; నిదియ విచారింపఁదగవు.
చేకొని పతిపంపు సేయు పత్నులకుఁ
గైకొను నుభయలోకములందు237 సుఖము.”
నన విని కౌసల్య నా సీత సూచి
వినుతంబుగాఁబల్కె వినయంబు మెఱసి:
“యనుకూలనై పతి నతిభక్తిఁగొలిచి
తనర వర్తించెద ధర్మమార్గమున.
మానుగాఁబతిఁ238బాయుమగువ సక్రంబు
లేని తేరును, దంత్రిలేని వీణయును
బోలెఁ బుత్త్రులు గల పుణ్యురాలైనఁ
జాలంగఁగొఱగాక చను; నట్లుగాన,
పతికిఁబ్రియంబైనఁబ్రాణంబులైన
హితబుద్ధి వంచింప కిత్తునే.”ననిన
నా దేవి వైదేహి నలరారఁజూచి:
“భూదేవి పుత్త్రివై పుట్టిన నీకు
నీ గుణంబులు దగు. నెలమి లక్ష్మణుని
నీ గుణోజ్జ్వలు రామహితుని మన్నింపు.”
మనిన సీతాదేవి“యౌగాఁక.”యనుచుఁ
దనకు మ్రొక్కిన నెత్తి తగఁగౌఁగిలించి
దీవించె. నప్పుడు దెఱఁగొప్ప రామ
దేవుండు గౌసల్య దీవనల్‌ వడసి

  1. ↑గడుకొని
  2. ↑నీకు
  3. ↑శుభము
  4. ↑లేని
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )