ఇతిహాసములు రంగనాథరామాయణము అయోధ్యాకాండము
జటాధారియై రాముఁడు సుమంత్రుని వీడ్కొనుట
నేమంబులన్నియు నిష్ఠతోఁ దీర్చి
సేమ మేర్పడ గుహుచే మఱ్ఱిపాలు
దెప్పించి కోమలదీర్ఘకేశములు
విప్పి యా వైదేహి వివశయై 284తూల
నా మఱ్ఱిపాలచే నందంద తడిపి
సౌమిత్రియును దాను జడ లొప్పఁదాల్చి
ఘనుఁడు రాఘవుఁడు వైఖానసవృత్తి
ననుజుండు దానుఁబాయనినిష్ఠఁబూని:
“యనఘ!సుమంత్ర ర.”మ్మని చేరఁబిలిచి
తనరార రథమెక్కఁదగదు మా; కింక
నరదంబు గొని యయోధ్యాపురంబునకు
మరలిపొ;మ్మధిపు నెమ్మదిఁగొల్చియుండు;
పార్థివేశ్వరునకుఁబరగఁ దల్లులకు
నర్థితో మ్రొక్కితిమని చెప్పు.”మనుడు:
“నేమిటి కీ మాట లిటమీఁద.”ననుచు
సౌమిత్రి యధికరోషమున నిట్లనియె:
“భూమీశుఁ డాలిపంపున నీతిమాలి
యేమియుఁబరికింప కిటుసేసి మమ్ముఁ
దనయాలుఁదానును దన 285కూర్చుకొడుకు
ఘన రాజ్యభోగముల్‌ గైకొనుఁగాక.”
యని యేను జెప్పితి నని పల్కు మీవు;
చను.”మన్నవిని రామచంద్రుండు గినిసి:
“మాను సౌమిత్రి!”సుమంత్ర! నీవింక
భూనాథుతో 286నివి పుట్టింపవలవ.
దా నృపుఁడివి విన్న నధికదీనాయ
మానమానసుఁడునై మఱి పొక్కకున్నె?”
యనిన సుమంత్రుఁడత్యంతశోకమున
మునిఁగి భీతిల్లి రామునిఁజూచి పలికె:
“గానల మిముఁద్రోచి కడుదీనవృత్తి
నే నయోధ్యాపుర మేమని చొత్తు?
నేమని చెప్పుదు నీ వార్త పతికి?
నేమని కొనిపోదు నీ శూన్యరథము?
నేమని కౌసల్య నే నూఱడింతు?
నేమని కైక మో మేను వీక్షింతు?
వనమున కేనును 287వచ్చెదఁగాక.”
యనిన రాముఁడు నవ్వి యాతనిఁజూచి:
“కడఁకతో నేము గంగానది దాటి
యడవులు సొచ్చితి మనువార్తఁగైక
నీవు సెప్పినఁగాని నిజముగాఁగొనదు.
నీవు శోకింపక నెమ్మితోఁబొమ్ము.
నా మాఱుగా నీవు నయవాక్యసరణి
వేమాఱుఁదెల్పుచు విభుఁగొల్చియుండు.
మనవుడు రథమెక్కి యతిదీనుఁడగుచుఁ
జనియె సుమంత్రుండు సాకేతపురికి.

  1. ↑పొగుల
  2. ↑కూర్మి
  3. ↑నీవు
  4. ↑వత్తును
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )