ఇతిహాసములు రంగనాథరామాయణము బాలకాండము
మరుత్తుల కథ
“నా తనయులనెల్ల నాథ! నీ తనయు
లాతతగతి నుగ్రులై చంపి; రింక
నొనర నింద్రునిఁజంపనోపెడునట్టి
తనయునికై యేను తపము సేసెదను;
నాకు దయాబుద్ధి నందను నిత్తు
గాక నీ.” వనిన నా కశ్యపుఁడనియె:
“నిద్ధచిత్తమున వేయేఁడులదనుక
శుద్ధాత్మురాలవై సుభగవై యున్న
మూఁడులోకంబులు మొగి గెల్చువాని
వాఁడిమి నింద్రుని వధియించువానిఁ
గనియెద వొకపుత్త్రుఁగాంత! నా వలన.”
నని పల్కి దితిమేను హస్తాంబుజమున
నయమారఁబరిమార్జనము సేసి మఱియు
దయఁజూచి యతఁడేఁగె దప మాచరింపఁ
జనియె; నా దితియుఁగుశప్లవంబునకుఁ.
జని యుగ్రతపమందుఁజరియించుచుండ
ననిమిషాధిపుఁడంత నచటి కేతెంచి
తన తల్లియగు దితిఁ దగఁజేరఁబోయి
పాయకకుశసమిత్ఫలమూలహవ్య
తోయాదు లతిభక్తితోడఁదెచ్చుచును
జరణంబులొత్తుచు సత్కృతుల్‌మఱియుఁ
బరిపాటి సేయుచుఁబరిచర్య సేయఁ
గడచన్న యేఁడులు గణనంబుసేయ
బడి తొమ్మనూటతొంబదియు నిండుటయుఁ
నలరి యా దితియప్పుడమరేంద్రుఁజూచి:
“బలభేది!వినుము నా పలుకు నీవొకటి;
తనయునిఁగోరి మీ తండ్రి నేనడుగ:
“వినుము వెయ్యేఁడులు వెడలిన మీఁద
నిచ్చితి సుతు.”నంచు నింపార నాకు
నచ్చుగా వరమిచ్చె; నటుగాన నీకు
446నిటమీఁదఁబదియేఁడు లేఁగినపిదపఁ
బటుశక్తి దమ్ముఁడు ప్రభవింపఁగలఁడు;
అలవుమై నీవును నతఁడును గూడి
పొలుపార నేలుఁడు భువనత్రయంబు;
వినుతకీర్తుల మీరు విలసిల్లుచుండుఁ.”
డని పల్కి యంత మధ్యాహ్నకాలమునఁ
దల447వీడి కాల్గడ దలయంపి గాగఁ
నలఁతమై నిద్రించు నా దితిఁజూచి
శతమన్యుఁడెంతయు సంతోషమంది
వితతవైఖరి “నిది వేళ నా.”కనుచు
448దితిగర్భ మతియోగ ధీశక్తిఁజొచ్చి
శతకోటిచేఁ దన శత్రు449వౌ శిశువు
నేడు దున్కలుసేయ, నెలుఁగెత్తి బాలుఁ
డేడువ, దితియు నయ్యెడ మేలుకాంచె.
మఘవుఁడు ‘మారుద,మారుద’యనుచు
లఘురీతిఁబలుక “బాలకుఁజంపవలదు,
వల.”దనియెడు దితివాక్య మాలించి
వెలువడి గర్భమవ్వేళ వాసవుఁడు
కరములు ముకుళించి కరముఁజిత్తమునఁ
దిరమైన భక్తి నా దితితోడఁబలికెఁ:
“దనరంగఁగాల్గడ దలయంపి గాఁగఁ
గొని ముక్తకేశివై కూర్కుటఁ జేసి
యార్య! నీ వశుచివై; తటుగాన తెగువఁ
గార్యంబుకొఱకు నీ కడుపేను సొచ్చి
గొనకొని ననుఁజంపఁ గోరుగర్భంబుఁ
దునిమితి నే నేడుతునియలుగాఁగ.
సన్న కసన్న నా శత్రుండుగాన
చిన్ని పాపనిఁబరిచ్ఛిన్నుఁజేసితిని;
450జనని! ధర్మజ్ఞవై సైరింపవలయు.”
ననిన దుఃఖించుచు నా యింద్రుఁ జూచి,[వా.రా. సర్గ 47]
451“నా నేర మింతయు నాకలోకేశ!
నీ నేరమదిలేదు నిక్కువంబరయ;”
నని పల్కి “మరుదాఖ్యలమరఁదేజంబు
లెనయంగ ఖండంబు లేడ్వురు నగుచు
నిమ్ముల నా పుత్త్రులెలమి నెల్లెడల
సమ్మద మింపారఁ జరియింపనిమ్ము.
452సప్తఖండంబులై సరినొప్పు వీరి
సప్తమారుతగణస్కంధనాయకులఁ
గావింపు.”మని వేఁడఁగా నట్లు చేసి
దేవేంద్రుఁడమరావతికిఁబోయె; నంత
వారును దేవతావల్లభు చెలిమి
మారుతగణసంజ్ఞ మఱి దివ్యులైరి.

  1. ↑ఁజటులప్రతాపనిశ్శంకుఁడైనట్టి- ప
  2. ↑విడి
  3. ↑అతులవేగంబున నాకుక్షిఁజొచ్చి, గర్భంబు నొగి నేడుఖండముల్‌ సేయ-గర్భమెరియ (మేడువ) మేలుకాంచె నా దితియు, నెఱయఁ గోపంబున నిర్జరాధిపుఁడు- మఱియును “మారుద, మారుద” యనుచుఁ, దునియ లొక్కొక టేడుతునియలు సేయఁ-” జనదింకఁ జంపకు చంపకు” మనిన, నా మాటవిని యతఁడౌఁగాక యనుచు - నా మాత యుద(జఠ)రంబు నప్పుడు వెడలి, కరములు ముకుళించి…
  4. ↑నా
  5. ↑నావిని దితిపల్కె నముచిసూదనుని -నావల్ల నేర మన్నా, (మున్నను) వీరిఁగావు, సప్తఖండంబులై…
  6. ↑నేరమికి ‘నేరము’ ప్రయోగము
  7. ↑పరగ నందొక్కఁడు బ్రహ్మలోకమున - నిరవొప్పగా నొక్కఁ డింద్రలోకమున, నరయ (డరు) విష్వగ్వాయు వనుతృతీయుండు - వడి దిశల్‌ వదియింట వర్తింపనిమ్ము, మొగి మరుత్తులు నాఁగ మూఁడు లోకముల - నెగడని మ్మమరేంంద్ర, నీ నిమిత్తమున, ననిపల్క ముకులితహస్తాబ్జుఁ డగుచు - ననిమిషలోకేశుఁ డా తల్లి, జూచి “ నీ పుత్త్రులందఱు నిర్జరత్వమున - నేపారఁ జరియింతు రిమ్ముల” ననుచు, ననువారఁగాఁబల్కి (ల్క) నాకలోకమున - కెలమిమైఁ దా రంత నిరువురుఁ జనిరి, దేవేంద్రుఁడతిభక్తి…
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )